
Bihar : బీహార్ లోని బాంకీపూర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆరు రౌండ్లు ముగిసే సరికి జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఏకంగా పదివేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా వెనుకబడిపోయారు. ఆమెకు మొదటి రెండు రౌండ్లలో కలిపి 505 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్థానిక ఏఎన్ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. మొత్తం 14 టేబుళ్లపై 31 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్, నీరజ్ సిన్హా, రేఖా గుప్తా సహా మొత్తం 25 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బాంకీపూర్ స్థానంలో గత 30 ఏళ్లుగా బీజేపీని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. 1995 నుంచి ఈ నియోజకవర్గంపై బీజేపీనే తన పట్టును నిలబెట్టుకుంటూ వస్తోంది. మొదట్లో నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, ఆ తర్వాత ఆయన కుమారుడు నితిన్ నబీన్ ఇక్కడి నుంచి వరుసగా విజయాలు సాధించారు. 1995 నుంచి 2005 వరకు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఎమ్మెల్యేగా ఉండగా, 2006 నుంచి 2026 వరకు నితిన్ నబీన్ ఎమ్మెల్యేగా కొనసాగారు.
Also Read : మరో పేపర్ లీక్ కలకలం: విద్యార్థుల పోరాటానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు!
అయితే 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది, ఫలితంగా ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
బాంకీపూర్ ఉపఎన్నికకు సంబంధించి జూలై 30వ తేదీన పోలింగ్ ముగిసింది. అయితే కేవలం 34.30 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 41.39 శాతం పోలింగ్‌తో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం తక్కువ. ఎన్నికలు కేవలం పట్టణ ప్రాంతంలో జరగడం, ఓటింగ్ శాతం భారీగా పడిపోవడం రాజకీయ పార్టీల్లో ఆందోళన రేకెత్తించింది. తమ సంప్రదాయ ఓటర్లు తక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ భావిస్తుండగా.. ఈ తక్కువ ఓటింగ్ మార్పును కోరుకుంటున్న సంకేతమని జన్ సురాజ్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు తీసుకున్న తరువాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, మళ్లీ తాను ఇన్ని రోజులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానం కావడం, దీనికి తోడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలి ఎన్నిక కావడంతో దీనిని బీజేపీ హైకమాండ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Also Read : ఫ్రీ నెట్‌ఫ్లిక్స్: ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అదిరిపోయే బంపరాఫర్!









