Rahul Gandhi :  రామమందిర విరాళాల కుంభకోణానికి సంబంధించి పార్లమెంట్ భవనం వెలుపుల ప్రతిపక్ష ఎంపీలు ప్రదర్శించిన ఒక స్కిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ నిరసనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారణాసిలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, పప్పు యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక మత గురువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారణాసిలో ఈ కేసు నమోదు చేశారు. అలాగే ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్‌పై సూర్య మైథిల్ అనే వ్యక్తి మరో ఫిర్యాదు చేశారు.

కాశీ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్సాల్ మాట్లాడుతూ.. మహంత్ బాల్‌నాథ్ జీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా, రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సాధువు వేషధారణలో సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తమ డిమాండ్లు నెరవేరకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని ఫిర్యాదుదారు హెచ్చరించారు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అవధేష్ ప్రసాద్, పప్పు యాదవ్‌లపై తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పప్పు యాదవ్ సనాతన ధర్మాన్ని, కాషాయ వస్త్రాలను, సాధువుల సమాజాన్ని కించపరిచేలా ప్రవర్తించినందుకే ఈ ఫిర్యాదు చేశామన్నారు.

ఢిల్లీలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆమె కొత్త డెల్లీలో ఈ ఫిర్యాదు అందజేశారు. హిందూ మతపరమైన మనోభావాలను ప్రతిపక్ష నేతలు దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. నిరసన లేదా భిన్నాభిప్రాయం కాదని, ఇది సనాతన సంస్కృతిని అపహాస్యం చేయడమేనని బన్సూరి స్వరాజ్ అన్నారు.

ఈ స్కిట్ వివాదంపై పప్పు యాదవ్ స్పందిస్తూ.. హిందూమతం, సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్‌కు చెందినవి కాదని బదులిచ్చారు. హిందూమతం నాది, సనాతన ధర్మం నాది అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల నుండి ఈ వ్యక్తే అన్నీ దోచుకున్నారని, దేశంలోని వంద కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజల గొంతును తాము వినిపిస్తున్నామని పూర్ణియా ఎంపీ చెప్పారు.

ఈ వివాదానికి అసలు కారణం ఏమిటంటే.. రామమందిర విరాళాల ఆరోపణలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష ఎంపీలు జూలై 31న పార్లమెంట్ భవనం వెలుపుల ఒక ప్రదర్శన చేపట్టారు. ‘చందా చోర్, గద్ది చోడ్’, ‘జవాబ్ తుమ్కో దేనా హోగా’, ‘అమిత్ షా, సదన్ మే ఆవో’ అనే నినాదాలు పార్లమెంట్ ఆవరణలో మార్మోగాయి. ఈ నిరసనలో పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, అయోధ్య రాముడి ఫోటో పట్టుకుని భక్తుల నుండి విరాళాలు సేకరించే పూజారిలా నటించారు. మిగతా ప్రతిపక్ష ఎంపీలు భక్తుల పాత్రలు పోషిస్తూ విరాళాల బాక్స్‌లో డబ్బులు వేశారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం, పూజారి ఆ డబ్బులను బాక్స్‌లో వేయకుండా తన దగ్గరే దాచుకుంటున్నట్లు చూపించారు. ఆ సమయంలో భక్తుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అతన్ని నిలదీశారు.

రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు సనాతన ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించాయని అధికార కూటమి ఆరోపించింది. హిందువుల మతపరమైన మనోభావాలను ఈ ప్రదర్శన గాయపరిచిందని, ఇందులో భాగమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.