
Live-In Relationship : వివాహంతో సమానమైన స్వభావం ఉన్న సహజీవనంలో (Live-in relationship) ఉంటూ భర్త లేదా అతని కుటుంబసభ్యుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. చట్టబద్ధమైన వివాహం లేకపోయినప్పటికీ, పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ‘వివాహ బంధం లాంటి వాతావరణంలో’ కలసి ఉండే మహిళలకు ఐపీసీ సెక్షన్ 498ఏ (క్రూరత్వం, వేధింపులు) కింద చట్టపరమైన రక్షణ వర్తిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కొటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్త్రీలపై జరిగే గృహ హింసను అరికట్టడమే ఈ చట్టం యొక్క మూల ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సహజీవనం చేసే ప్రతి సందర్భంలోనూ ఈ సెక్షన్ నేరుగా వర్తించదని, కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేరాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేవలం తాత్కాలికంగా కలసి ఉండటం కాకుండా, సమాజంలో భార్యాభర్తలుగా చెలామణి అవుతూ, పెళ్లి చేసుకోవాలనే బలమైన ఉద్దేశం (Intent to Marry) ఉన్న సంబంధాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. తమ మధ్య ఉన్న సహజీవనం వివాహ బంధంతో సమానమైనదని, వివాహం చేసుకునే ఆలోచనతోనే కలసి ఉన్నామని నిరూపించే ప్రాథమిక బాధ్యత సదరు ఫిర్యాదుదారు (మహిళ)పైనే ఉంటుంది. ఈ సడలింపు కేవలం ఐపీసీ/బీఎన్‌ఎస్ పరిధిలోని సెక్షన్ 498ఏ (క్రూరత్వం, హింస)కు మాత్రమే పరిమితం అని, ఇతర నేర నిబంధనలకు ఇది నేరుగా వర్తించదని స్పష్టం చేసింది.
ఐపీసీ 498ఏ చట్టం దుర్వినియోగమవుతోందనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు రక్షణ చర్యలను పునరుద్ఘాటించింది. సహజీవన సంబంధాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే భర్త లేదా ఆయన బంధువులను వెంటనే అరెస్టు చేయకూడదని ఆదేశించింది. గతంలో ‘అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం’ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను ఇక్కడ కూడా ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సంబంధిత కేసుల్లో ముందుగా ప్రాథమిక విచారణ (Preliminary Inquiry) జరిపి, తగిన ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Also Read : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. ప్రశాంత్ కిశోర్ ఘన విజయం!
1983లో అమల్లోకి వచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఏ (ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం సెక్షన్ 85, 86) ప్రధాన ఉద్దేశం – భర్త లేదా అతని బంధువుల చేతిలో శారీరక, మానసిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ కల్పించడం,వరకట్న వేధింపుల చావులను అరికట్టడం. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది కేవలం భార్య మాత్రమే వేసే కేసు కాదు. అత్తింటివారి (భర్త, అత్త, మామ, ఆడపడుచు) క్రూరత్వంపై కోడలు కేసు పెట్టవచ్చు. సొంత ఇళ్లలోనే శారీరక, మానసిక హింస లేదా ఆస్తి/వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న కుమార్తెలు, అలాగే కోడలి చేతిలో తీవ్ర వేధింపులకు గురవుతున్న అత్తలు (కుటుంబ సభ్యుల ద్వారా) కూడా చట్టపరమైన రక్షణ పొందవచ్చు.
వరకట్న నిరోధక చట్టం వేలాదిమంది బాధితులకు కొండంత అభయాన్ని ఇచ్చిన మాట వాస్తవమే అయినా, కాలక్రమేణా ఇది దుర్వినియోగానికి గురైందనే విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం 498A కేసుల్లో శిక్షల శాతం (Conviction Rate) తక్కువగా ఉండటం, తప్పుడు కేసుల వల్ల అమాయక పురుషులు, వారి వృద్ధ తల్లిదండ్రులు జైలుపాలు కావడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని “చట్టబద్ధమైన తీవ్రవాదం” (Legal Terrorism) గా కొందరు న్యాయకోవిదులు అభివర్ణించారు.
మహిళల హక్కులను కాపాడుతూనే, అమాయక పురుషులు లేదా వారి కుటుంబసభ్యులు బలికాకుండా చూసేందుకు సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఈ చట్టాన్ని సమీక్షిస్తోంది. తాజాగా సహజీవనంలో ఉన్న మహిళలకు 498A రక్షణ కల్పిస్తూనే, “క్షుణ్ణమైన ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టులు చేయకూడదు” అని స్పష్టమైన నిబంధన విధించడం ద్వారా బాధితులకు న్యాయం, అమాయకులకు రక్షణ అనే రెండింటికీ న్యాయస్థానం ప్రాధాన్యం ఇచ్చింది.
Also Read : స్కాలర్‌షిప్, విద్యారుణంతో చదువుకున్న… సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే స్పష్టీకరణ









