
TVK Government : తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళవెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ రాజకీయ ర్యాలీలో చోటుచేసుకున్న దురదృష్టకర తొక్కిసలాట సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, సీఎం విజయ్ సర్కార్ జారీ చేసిన నియామక ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Also Read : అయోధ్య విరాళాల చోరీ కేసు: 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపుపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టే కానుక కాదని, రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు మాత్రమే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి అధికారిక సంస్థల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించింది. ప్రమాదాలు, తొక్కిసలాటలు వంటి అనూహ్య ఘటనలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించడం సమంజసమే కానీ, నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించడం సరైన విధానం కాదని తీర్పు ఇచ్చింది.
విచారణ సమయంలో పాలకుల తీరును ప్రశ్నిస్తూ ధర్మాసనం ఒక కీలకమైన ఉదాహరణను ప్రస్తావించింది. ‘రేపు ప్రభుత్వ బస్సు ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబాలకు కూడా ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా?’ అని ధ్వజమెత్తింది. ప్రమాద బాధితుల పట్ల మానవతా దృక్పథం చూపించడం వేరని, రాజ్యాంగ సూత్రాలను పక్కనబెట్టి ప్రభుత్వ ఉద్యోగాలను పంచిపెట్టడం వేరని తేల్చి చెప్పింది. ఉద్యోగాల నియామకంలో పారదర్శకత, అర్హతే ప్రామాణికంగా ఉండాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను చెల్లదని కొట్టివేసింది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు నుంచి ఎదురైన తొలి ప్రధాన ఐన్పరమైన ఎదురుదెబ్బ ఇది. సంక్షేమ పథకాలు, ఉపశమన చర్యలు ప్రకటించే సమయంలో చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు కరూర్ బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలకు బదులుగా బారీ ఆర్థిక పరిహారాన్ని అందించే దిశగా విజయ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Also Read : లక్షల్లో జీతాలు అందించే టాప్ 3 ఫైనాన్స్ కోర్సులు: విద్యార్థులకు పండగే..!









