-RAVI PRAKASH

KANWAR YATRA : ప్రతి ఏడాది… లక్షలాది మంది భక్తులు కన్వర్ యాత్ర చేస్తుంటారు. కొందరు వందల కిలోమీటర్లు నడుస్తారు. కొందరు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేస్తారు. చాలామంది యాత్ర మొత్తం ఉపవాసం ఉంటారు… నియమ నిష్ఠలు పాటిస్తారు… ప్రార్థనలు చేస్తారు. వారికి… ఇది కేవలం ఓ పండుగ కాదు. వినోదం అసలే కాదు. ఇది వారి విశ్వాసం. వాళ్ల నమ్మకం. పరమశివుడికి చేసే ఒక పవిత్రమైన యాత్ర. తమకు నచ్చిన మతాన్ని, తమ విశ్వాసాన్ని గౌరవంగా ఆచరించే హక్కు… ప్రతి భారతీయుడికీ రాజ్యాంగం కల్పించింది.

కానీ… గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఓ భోజ్‌పురి డ్యాన్స్ performance. వందలాది మంది కన్వరీయాలు డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. మరికొందరు కేరింతలు కొడుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దీనికి, కన్వర్ యాత్రకు సంబంధం ఏంటి? దీనికి, భక్తికి సంబంధం ఏంటి? దీనికి, పరమశివుడికి సంబంధం ఏంటి?

దయచేసి నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ వీడియో కన్వర్ యాత్రకు వ్యతిరేకం కాదు. పరమశివుడికి వ్యతిరేకం కాదు. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించడం అంతకన్నా కాదు. నేను ప్రశ్నిస్తున్నది… “మతం పేరుతో అదే మతం గౌరవాన్ని దెబ్బతీస్తున్న కొంతమందిని”. ఎందుకంటే… లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితో, నియమ నిష్ఠలతో ఒక పవిత్రమైన యాత్ర చేస్తున్నప్పుడు… కొంతమంది ఆ భక్తి కార్యక్రమాన్ని ఇలా ఓ entertainment eventలా మార్చేస్తే… చివరికి ఆ కొద్దిమంది చేసిన పనులే… మొత్తం యాత్రపై ఒక ముద్ర వేస్తాయి. అది సమాజానికి మాత్రమే కాదు… నిజమైన భక్తితో కన్వర్ యాత్ర చేసే లక్షలాది మంది భక్తులకు కూడా.

Also Read : నాపై ఆంక్షలు విధించడానికి మీరెవరు? పోలీసులపై అభిజిత్‌ దీప్కే ఫైర్‌

వైరల్ వీడియోల గురించి మాట్లాడాల్సిన మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ వీడియోలు వస్తోంది ఉత్తరప్రదేశ్ నుంచి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను తాను యోగిగా చెప్పుకుంటారు. అలాంటి రాష్ట్రంలో… ఇంతటి పవిత్రమైన యాత్ర క్రమశిక్షణతో జరగాలి. గౌరవంగా జరగాలి. భక్తిభావాన్ని కాపాడుతూ జరగాలని ప్రజలు సహజంగానే ఆశిస్తారు. కాబట్టి… ఇప్పుడు క్వశ్చన్‌… కన్వర్ యాత్ర జరగాలా? వద్దా? అనేది కాదు. జరగాలి. ఖచ్చితంగా జరగాలి. అసలైన ప్రశ్న ఏంటంటే… కన్వర్ యాత్ర గౌరవాన్ని కాపాడుతుంది ఎవరు?

మరో వీడియోలో డ్యాన్స్ చేస్తున్నవారే కాషాయ దుస్తుల్లో ఉన్నారు. స్టేజ్ ముందు వందలాది మంది కన్వర్ యాత్రికులు నిలబడి ఉన్నారు. చాలామంది డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది ఆ డ్యాన్స్‌ను వీడియో తీస్తున్నారు. మరికొందరు కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ ప్రశ్నేంటంటే కాషాయం అంటే ఇదేనా? శతాబ్దాలుగా… కాషాయం అంటే త్యాగం… వైరాగ్యం… క్రమశిక్షణ… ఆధ్యాత్మికత. అది కేవలం ఒక రంగు కాదు. అది ఒక భావోద్వేగం. ఒక భావన. ఒక బాధ్యత.

అందుకే… కొన్నేళ్ల క్రితం ఓ సినిమా పాటలో ఒక సినీ నటి కాషాయ రంగు దుస్తులు ధరించినప్పుడు… దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. నిరసనలు జరిగాయి. టీవీల్లో చర్చలు జరిగాయి. రాజకీయ నేతలు ప్రకటనలు చేశారు. కాషాయానికి గౌరవం ఇవ్వాలని, దాని పవిత్రతను కాపాడాలని చాలామంది అన్నారు. సరే. అది వారి వాదన. కానీ ఇప్పుడు నా ప్రశ్న… అదే గౌరవం ఇక్కడ కూడా ఉండకూడదా? ఒక సినిమాలో కాషాయ రంగుకు గౌరవం ఉండాలని కోరుకుంటే… ఒక మతపరమైన యాత్రలో కూడా అదే గౌరవం ఉండాలి కదా? లేక… ఎవరు ధరిస్తున్నారు అన్నదాన్ని బట్టి… మన స్టాండర్డ్స్‌ మారిపోతాయా?

దయచేసి నా ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఈ యువతులను ప్రశ్నించడం లేదు. కన్వర్ యాత్రను కూడా ప్రశ్నించడం లేదు. నేను ప్రశ్నిస్తున్నది… “ఒక పవిత్రమైన యాత్రను బహిరంగ వినోద కార్యక్రమంగా మార్చేస్తున్న వారిని”. అంతకేకాదు… అధికార యంత్రాంగాన్ని కూడా ఒక ప్రశ్న అడగాలి. ఈ కార్యక్రమాలకు అనుమతి ఎవరు ఇచ్చారు? ఎందుకంటే… ఇవేమీ ఎవరికీ తెలియకుండా జరిగే కార్యక్రమాలు కావు. ఈ స్టేజ్‌లు బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నాయి. వందలాది మంది అక్కడ ఉన్నారు. అందరి కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే… ఎవరో ఒకరు దీనికి అనుమతి ఇచ్చినట్టే కదా?

మరొక వీడియోలో ఒక యువకుడు నవ్వుతున్నాడు. తనను తాను వీడియో తీసుకుంటున్నాడు. దాదాపుగా… ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అనుకుంటున్నట్టుగా ఉంది.” అతని వెనుక… ఓ డ్యాన్స్ ప్రదర్శన జరుగుతోంది. ఇదే…తన యాత్ర నుంచి తిరిగి తీసుకు వెళ్లాలనుకంటున్న జ్ఞాపకం. ఒక్క క్షణం ఆగి… మిమ్మల్ని మీరు ప్రశ్నించికోండి. ఇదేనా కన్వర్ యాత్ర అసలు ఉద్దేశం? ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో… లేదా ఫేస్‌బుక్‌లో… లేదా Xలో… అప్‌లోడ్ చేసినప్పుడు… ప్రపంచానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? కేవలం మన దేశంలోనే కాదు… ప్రపంచం మొత్తం ఈ వీడియోను చూస్తుంది. అప్పుడు వాళ్లు ఏం అనుకుంటారు? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటని అనుకుంటారా? లేక… ఇది కూడా మరో వినోదపు పండగ అని అనుకుంటారా? అదే…అసలు విషాదం. ఎందుకంటే… కొంతమంది చేసే పనుల వల్ల… లక్షలాది మంది నిజమైన భక్తులపై… మొత్తం యాత్రపై ఉన్న అభిప్రాయం మారిపోతుంది.

Also Read : ఫార్చ్యూన్ నూనె వాడుతున్నారా?.. FSSAI పరీక్షల్లో షాకింగ్ నిజాలు!

ప్రతి ఏడాది… లక్షలాది మంది కన్వర్ యాత్రికులు రోజుల తరబడి నడుస్తారు. రోడ్లపైనే నిద్రిస్తారు. చాలా నిష్టతో పవిత్ర జలాన్ని మోసుకెళ్తారు. హర్ హర్ మహాదేవ్ అంటూ నినదిస్తారు. వారు ఎవరినీ దూషించరు. అల్లర్లు క్రియేట్ చేయరు. అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకోరు. కానీ దురదృష్టవశాత్తూ… ఆ భక్తులు ఎప్పుడూ వైరల్‌ కారు. వైరల్ అయ్యే వీడియోలు మాత్రం… ఇలాంటివే. మెల్లగా… సోషల్ మీడియా ఈ పవిత్ర యాత్ర ఉద్దేశాన్నే మార్చేస్తోంది. యాత్ర ఇక భక్తి గురించి కాకుండా… కొందరికి… వైరల్ రీల్స్ చేయడం గురించే అయిపోతోంది. లైక్స్ కోసం. వ్యూస్ కోసం.

ఇంకో వీడియోలో ఓ కన్వర్ యాత్రికుడు… మద్యం మత్తులో ఉన్నాడు. స్టేజ్‌పైకి వెళ్లాడు… అక్కడున్న డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఆగండి. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ వ్యక్తి కన్వర్ యాత్ర ఎందుకు చేస్తున్నాడని? భక్తి కోసమా?, లేక వినోదం కోసమా? మరోసారి… నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవద్దు. లక్షలాది మంది కన్వర్ యాత్రికులు ఎంతో భక్తితో ఈ యాత్ర చేస్తారు. వందల కిలోమీటర్లు నడుస్తారు. క్రమశిక్షణ పాటిస్తారు. ఈ యాత్రను భగవంతుడి సేవగా భావిస్తారు. వారికి గౌరవం దక్కాలి. కానీ… ఇలాంటి వీడియోలే కన్వర్ యాత్రకు పబ్లిక్ ఇమేజ్ గా మారితే… నష్టం ఒక్క వ్యక్తికే కాదు. మొత్తం యాత్ర ప్రతిష్ఠకే నష్టం జరుగుతుంది. నిజమైన భక్తితో ఈ యాత్ర చేసే లక్షలాది మంది భక్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు ప్రశ్న… కన్వర్ యాత్ర చేయాలా? అన్నది కాదు. ఖచ్చితంగా చేయాలి. విశ్వాసం వ్యక్తిగతమైనది. దాన్ని గౌరవించాలి. అసలు ప్రశ్న ఏంటంటే… కన్వర్ యాత్ర గౌరవాన్ని కాపాడేది ఎవరు?

ఎందుకంటే… భక్తి ఎక్కడో దారి మారుతున్నట్టుగా కనిపిస్తోంది. భక్తి వెనక్కి వెళ్తోంది ! ఆర్భాటం ముందుకు వస్తోంది. ప్రార్థన తగ్గుతోంది… ప్రదర్శన పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే… రేపు ఈ ఆర్భాటమే… కన్వర్ యాత్రకు గుర్తింపుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు… మనం డ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం… వినోదం గురించి మాట్లాడుకున్నాం… సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ… ఇప్పుడు చూడబోయే వీడియోలు మాత్రం చాలా serious. ఎందుకంటే… ఇది ఇక కేవలం సంస్కృతికి సంబంధించిన విషయం కాదు. ఇది హింసకు సంబంధించిన విషయం. మతం పేరుతో హింస జరిగిన ప్రతిసారీ… బాధ్యతగల పౌరులుగా మనం కొన్ని ప్రశ్నలు అడగాల్సిందే.

ఇక మరో వీడియో… డ్యాన్స్ గురించి కాదు. డీజేల గురించి కాదు. సోషల్ మీడియా గురించి అసలే కాదు. ఇది హింస గురించి. మనకు అందిన సమాచారం ప్రకారం… ఈ వ్యక్తి అనుకోకుండా కన్వర్‌ను తాకడంతో, అతడిపై కొందరు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే… ఈ ఘటనపై పూర్తి వివరాలు మాకు ఇంకా తెలియదు. అయితే, అసలు ఏం జరిగిందో… పోలీసుల దర్యాప్తులోనే తేలాలి. కానీ… ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వ్యక్తిని కొంతమంది కలిసి కొడుతున్నారు. అదే సమయంలో… ఓ పోలీస్ కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక simple question. ఇది మతం గురించి కాదు. రాజకీయాల గురించి కాదు. మన రాజ్యాంగం గురించి. ఒక పౌరుడిని శిక్షించే అధికారం ఎవరికి ఉంది? కొందరు కలిసి ఏర్పడిన గుంపుకా? లేక చట్టానికా? ఎవరైనా తప్పు చేసి ఉంటే… పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. నేరం జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ… ఒక గుంపే న్యాయమూర్తిగా మారొచ్చా? ఒక గుంపే తీర్పు చెప్పొచ్చా? ఒక గుంపే శిక్ష కూడా విధించొచ్చా? ఇలా గుంపులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే… రేపు ఏ పౌరుడు సేఫ్‌గా ఉండలేడు. మీరు కాదు… నేను కాదు… ఎవరూ సేఫ్‌గా ఉండలేరు. ఎందుకంటే… గుంపే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు… చట్టంపై నమ్మకం తగ్గుతుంది… ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.

ఓ పోలీస్ అధికారి పరుగెత్తుతున్నాడు. అతడి వెనుక ఓ గుంపు పరుగెత్తుకుంటూ వెళ్తోంది. ఈ ఫ్రేమ్‌ను ఒక్కసారి pause చేయండి. పోలీసులు అంటే… చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థకు ప్రతినిధులు. అలాంటి ఓ పోలీస్ అధికారి… తనను తాను కాపాడుకోవడానికి పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తే… ప్రజల్లో ఎలాంటి message వెళ్తుంది? ఇక్కడి నుంచి discussion ఈ ఒక్క ఇష్యూకే పరిమితం కాదు. ఇది పాలన గురించి. Law and order గురించి. ఎందుకంటే… నేరాలు, అరాచకాలను అస్సలు సహించేది లేదని… యోగి సర్కార్ zero tolerance విధానాన్ని పదేపదే చెబుతోంది. ఆ మాట నిజంగా అందరికీ వర్తిస్తే… ఇక్కడ కూడా అదే కనిపించాలి కదా? ఇక్కడ గుంపు ఎవరు అనేది ముఖ్యం కాదు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేదా? అదే అసలైన point. ఎవరైనా రాస్తారోకోలు చేసినా… ఆస్తులు ధ్వంసం చేసినా… ఇతరులపై దాడి చేసినా… ప్రభుత్వం తీసుకునే actionకు ఒకటే standard ఉండాలి. అక్కడ అమలు కావాల్సింది ఒక్కటే…చట్టం. గుంపు ఎవరు అనేది కాదు… అక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు… వారి వెనుక ఎవరు ఉన్నారనేది కూడా కానే కాదు… చట్టం అందరికీ ఒక్కటే. మతాన్ని గౌరవించినట్టే… చట్టాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం.

ఇక తర్వాతి వీడియో… ఇంకో uncomfortable questionను లేవనెత్తుతోంది. మతం పేరు చెప్పి… మతపరమైన గుర్తింపును చూపించి… చట్టాన్ని లెక్కచేయలేని ఒక licenceగా మార్చగలవా? ఇప్పుడు ఈ వెహికల్‌ను చూడండి. మొత్తం కాషాయ రంగులో ఉంది. వెహికల్ మొత్తం… ఓం నమః శివాయ అని రాసి ఉంది. వెహికల్ రూఫ్‌పై పెద్ద శివుడి విగ్రహం ఉంది. ఈ వీడియో చూడగానే అందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ ఎక్కడుంది? కనీసం ఈ వీడియోలో అయితే… నంబర్ ప్లేట్ కనిపించడం లేదు. ఇక్కడ నేను క్లియర్‌గా మరోసారి చెప్తున్నా. ఈ ప్రశ్నకు శివుడితో ఎలాంటి సంబంధం లేదు. మతంతో కూడా సంబంధం లేదు. నా ప్రశ్న కేవలం చట్టం గురించి. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేదా అనే దాని గురించి. దేశంలో ప్రతి వెహికల్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి అయితే… ఇక్కడ కూడా అదే rule వర్తించాలి కదా? లేక… మతపరమైన గుర్తులు ఉన్న వాహనాలకు … చట్టం నుంచి మినహాయింపు ఉంటుందా? ఇవి కొంచెం uncomfortable questions. కానీ ఇవి ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే… మతం ఏదైనా… చట్టం అందరికీ ఒక్కటే. మతాన్ని గౌరవించాలి. అలాగే… చట్టాన్ని కూడా గౌరవించాలి.మరో వీడియో సోషల్ మీడియా గురించి కాదు. ఇది భయం గురించి. ఈ వీడియో ఒక్కసారి చూడండి. కారును ధ్వంసం చేస్తున్నారు. కారు అద్దాలు పగలగొడుతున్నారు. అదీ…ఓ జాతీయ రహదారిపై. ఇది జరగడానికి ముందు ఏం జరిగిందో మాకు తెలియదు. అసలు నిజం… పోలీసు దర్యాప్తులోనే తేలాలి. కానీ… ఒక విషయం మాత్రం clear. మరొకరి ఆస్తిని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు. ఏ గ్రూప్‌కు లేదు. ఏ మతానికీ లేదు. ఏ సంస్థకూ లేదు. ఎవరైనా తప్పు చేస్తే… చట్టం ప్రకారం శిక్ష పడాలి. కానీ… కొంతమంది రోడ్డుపైనే శిక్షలు విధించడం మొదలుపెడితే… సామాన్య ప్రజలు భయంతో బతకాల్సి వస్తుంది. చివరిగా మరో వీడియోలో ఘజియాబాద్ ఏసీపీ… ఓ ముస్లిం పోలీస్ ఆఫీసర్‌… శివ భక్తులకు తాగునీరు అందిస్తున్నాడు. ఈ వీడియోను… ఘజియాబాద్ పోలీసులే స్వయంగా షేర్ చేశారు. నిజం చెప్పాలంటే… పోలీసుల నుంచి మనం ఆశించేది ఇదే. కన్వర్ యాత్ర అయినా… కుంభమేళా అయినా… మొహర్రం అయినా… ఈద్ అయినా… క్రిస్మస్ అయినా… గురుపురబ్ అయినా… ఎవరైనా సరే… తమ విశ్వాసాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ఆచరించుకునేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. అది State responsibility. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్న పోలీసులను… ఖచ్చితంగా అభినందించాలి.

ప్రభుత్వం తాగునీరు ఏర్పాటు చేయగలుగుతోంది. వేలాది మంది పోలీసులను భద్రతకోసం ఉంచుతోంది. పూల వర్షం కూడా కురిపించగలుగుతోంది. కన్వర్ యాత్ర కోసం ఇన్ని ఏర్పాట్లు చేయగలుగుతోంది. మరి క్రమశిక్షణను ఎందుకు కాపాడలేకపోతోంది? లక్షలాది మంది భక్తులకు… కొంతమంది చేసే పనుల వల్ల చెడ్డ పేరు రాకుండా ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఎందుకంటే… ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కన్వర్ యాత్ర చేసే వారిలో ఎక్కువ మంది సాధారణ భక్తులే. వారు రోజుల తరబడి నడుస్తారు. హర్ హర్ మహాదేవ్ అంటూ నినదిస్తారు. భక్తితో పవిత్ర జలాన్ని తీసుకెళ్తారు. ఎవరినీ ఇబ్బంది పెట్టరు. వాహనాలను ధ్వంసం చేయరు. ఎవరిపైనా దాడి చేయరు. పోలీసులతో గొడవ పడరు. కానీ… వాళ్లు ఎప్పుడూ వైరల్ కారు. వైరల్ అయ్యేవి మాత్రం… హింసకు సంబంధించిన వీడియోలు. బెదిరింపులకు సంబంధించిన వీడియోలు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు. అసభ్యకరమైన దృశ్యాలు. ఇలా… కొంతమంది చేసే పనులతో మొత్తం కన్వర్ యాత్రకు చెడ్డపేరు వస్తోంది. ఇది నిజంగా దారుణం. సమాజానికి మాత్రమే కాదు… అసలైన శివ భక్తులకు బ్యాడ్ నేమ్ వస్తుంది.

నా ఉద్దేశం మరోసారి క్లియర్‌గా చెప్తున్నా. మేము కన్వర్ యాత్రకు వ్యతిరేకం కాదు. పరమశివుడికి వ్యతిరేకం కాదు. లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి వ్యతిరేకం కాదు. నిజానికి… ఆ విశ్వాసాన్ని గౌరవించాలనేదే నా తాపత్రయం. అందుకే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే… మనం నిజంగా ఒక మతాన్ని గౌరవిస్తే… ఆ మతం గౌరవాన్ని కూడా కాపాడాలి. కొంతమంది మతం పేరుతో తప్పు చేస్తుంటే… మనం మౌనంగా ఉండటం వల్ల మతానికి మేలు జరగదు. దాని గౌరవానికే నష్టం జరుగుతుంది. ఇక్కడ అసలు నష్టం… ఏ రాజకీయ పార్టీకి కాదు. ప్రభుత్వానికి కూడా కాదు. నష్టం జరిగేది కన్వర్‌ యాత్రకే. లక్షలాది మంది భక్తి… వారి నమ్మకం… వారి క్రమశిక్షణ… కొంతమంది చేసే పనులతో చెడ్డపేరు వస్తుంది. కాబట్టి… అసలు ప్రశ్న…కన్వర్ యాత్ర కొనసాగాలా? లేదా? అనేది కాదు. ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే… కన్వర్ యాత్రకు భక్తి, క్రమశిక్షణే గుర్తింపుగా ఉండేలా మనం చూడగలమా? ఇదే మనం ఆలోచించా ల్సిన విషయం. ఎందుకంటే… ఏ మతానికైనా నిజమైన గౌరవం సంబరాలు చేసుకోవడంలో కాదు. ఆ మతాన్ని ఎంత బాధ్యతగా పాటిస్తున్నామన్నదే ముఖ్యం.

హర్ హర్ మహాదేవ్.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.