
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమ కూతురికి మంచి సంబంధం అనుకుని వివాహం జరిపిస్తే, ఆ వ్యక్తి కోట్లు కొల్లగొట్టే పెద్ద మోసగాడని, ఇప్పటివరకు దాదాపు 25 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిసి ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌లోని సెవతా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ ఈ దారుణమైన నిజం తెలుసుకుని రేవూసా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడైన ప్రఖర్ త్రివేది, అతని తండ్రి అనుజ్ త్రివేదిలను అరెస్ట్ చేశారు.
పోలీసుల వెల్లడించిన ప్రకారం, మిష్రిఖ్‌లోని చంద్రవాల్ ప్రాంతానికి చెందిన అనుజ్ త్రివేది కొడుకు ప్రఖర్ త్రివేదితో ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ కుమార్తె ప్రజ్ఞకు 2024లో వివాహం జరిగింది. పెళ్లి సమయానికి అనుజ్ త్రివేది తానో పెద్ద ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారినని గొప్పలు చెప్పుకుని, తమకున్న నేర చరిత్రను, పాత కేసుల వివరాలను పూర్తిగా దాచిపెట్టాడు. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రముఖుల మాటలు నమ్మి, వివరాలు విచారించిన తర్వాతే తివారీ కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించింది. అయితే వివాహం జరిగిన రెండేళ్లన్నర తర్వాత, అల్లుడు ప్రఖర్ త్రివేది అసలు రంగు బయటపడింది.
ప్రఖర్ త్రివేది వేర్వేరు పేర్లతో, నకిలీ ఐడీ కార్డులతో మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లోని అమాయక మహిళలను ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని కోట్ల రూపాయలు కాజేశాడని ఎమ్మెల్యే తివారీ తీవ్రంగా ఆరోపించారు. అతనికి ఇప్పటికే దాదాపు 25 పెళ్లిళ్లు అయినట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు. ఈ నిజం తెలియగానే ఎమ్మెల్యే నిందితుడి కుటుంబంతో అన్ని సంబంధాలను తెంచుకుని, తన కుమార్తెను తిరిగి సొంత ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటన వల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని, ప్రజాప్రతినిధిగా సమాజంలో తనకున్న గౌరవానికి భంగం వాటిల్లిందని ఆయన వాపోయారు.
మరోవైపు ఎమ్మెల్యే తివారీ తన కుమార్తెతో కలిసి ఆగస్టు 6న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ కుటుంబాన్ని దారుణంగా మోసం చేసిన అనుజ్ త్రివేదికి ఉరిశిక్ష వేయాలని, ఒకవేళ తన అల్లుడు ప్రఖర్ త్రివేది కూడా ఈ నేరాల్లో దోషిగా తేలితే చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోసం కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు.









