Inox Group : సమకాలీన డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ఎంతటి ఉన్నతాధికారులనైనా ఇట్టే బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క వాట్సాప్ సందేశాన్ని గుడ్డిగా నమ్మినందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘ఐనాక్స్ గ్రూప్’ (Inox Group) ఏకంగా రూ.10.4 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) పేరుతో వచ్చిన నకిలీ సందేశాలను నిజమని నమ్మి, ఖాతాల విభాగపు ఉన్నతాధికారే స్వయంగా కంపెనీ సొమ్మును కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లించడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భారీ మోసానికి సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ముంబైలోని ఐనాక్స్ గ్రూప్ అకౌంట్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM)గా పనిచేస్తున్న గిరీశ్ అమీన్‌కు జూన్ 3వ తేదీన ఒక అపరిచిత నంబర్ నుండి వాట్సాప్ సందేశం వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను ఐనాక్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘సిద్ధార్థ్ జైన్’గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు, అది తన వ్యక్తిగత నంబర్ అని, దానిని సేవ్ చేసుకోవాలని కోరాడు. ఆ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ (DP) లో కూడా సిద్ధార్థ్ జైన్ ఫొటో ఉండటంతో అమీన్ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా, “నేను ప్రస్తుతం ఒక అత్యవసరమైన, అత్యంత రహస్యమైన సమావేశంలో ఉన్నాను. నేను చెప్పే విషయాలు ఎవరికీ వెల్లడించవద్దు” అంటూ సదరు కేటుగాడు అమీన్‌ను నమ్మించాడు.
12 రోజులు.. 63 లావాదేవీలు.. రూ.10.4 కోట్లు స్వాహా
సమావేశంలో ఉన్నందున ఫోన్ కాల్స్ మాట్లాడలేనని చాటింగ్ ద్వారా నమ్మించిన ఆ సైబర్ క్రిమినల్.. అత్యవసరంగా కొన్ని చెల్లింపులు చేయాలంటూ కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలను పంపాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇన్వాయిస్‌లు లేదా ఉన్నతాధికారుల లిఖితపూర్వక అనుమతులు అడగకుండానే.. బాస్ ఆదేశాలు అంటూ అమీన్ నగదు బదిలీ చేయడం ప్రారంభించాడు.
 జూన్ 3వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు (దాదాపు 12 రోజులు) ఈ మోసం నిరాటంకంగా సాగింది. మొదటి విడతగా రూ.46.5 లక్షల బదిలీతో ఈ వ్యవహారం మొదలైంది. నిందితుడు పంపిన వివిధ బ్యాంక్ ఖాతాలకు ఏకంగా 63 విడతల్లో కంపెనీ నిధులను బదిలీ చేశారు.ఈ విధంగా మొత్తం రూ.10,40,71,924 నగదు కేటుగాళ్ల పాలైంది. ఆ తర్వాత, ఈ భారీ చెల్లింపులకు సంబంధించిన అధికారిక ఇన్‌వాయిస్‌లు, బిల్లుల కోసం అమీన్ నేరుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను సంప్రదించాడు. దాంతో సిద్ధార్థ్ జైన్ తాను అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేయడంతో అమీన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తాము ఘోరంగా మోసపోయామని గ్రహించి తక్షణమే ముంబై పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు కేటుగాళ్లు అరెస్ట్..
ఫిర్యాదు స్వీకరించిన ముంబై సైబర్ విభాగానికి దర్యాప్తులో ఢిల్లీలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) జసోలా బ్రాంచ్ నుంచి ఒక కీలకమైన సమాచారం అందింది. సదరు మోసపూరిత ఖాతాల నుండి రూ.8 లక్షల నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమానాస్పదంగా వచ్చిన వికాస్, వంశ్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. కేవలం కొంత కమీషన్ డబ్బుల ఆశతో తాము సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చినట్లు వారు ఒప్పుకున్నారు. వీరి సమాచారం ఆధారంగా ఈ ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు ఫయ్యాజ్ ఆలమ్, అమిత్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంకా దొరకని అసలు సూత్రధారి..
ప్రస్తుతం అరెస్ట్ అయిన నలుగురు నిందితులు కేవలం కమీషన్ ఏజెంట్లు,బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వారేనని పోలీసులు తేల్చారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి (మాస్టర్‌మైండ్) ఎవరు? ఐనాక్స్ గ్రూప్ అంతర్గత వ్యవహారాలు, అధికారుల వివరాలు వారికి ఎలా తెలిశాయి? అనే కోణంలో ముంబై పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి కార్పొరేట్ మోసాలను (CEO Fraud / Business Email Compromise) అరికట్టడానికి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే, నిధుల బదిలీకి ముందు కనీసం ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా అంతర్గత అధికారిక ఛానెల్స్ ద్వారా సరిచూసుకోవడం అత్యంత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.