
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఒడిశాకు తిరిగి రావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సంబల్‌పూర్ లోక్‌సభ సభ్యుడిగా తొలిసారిగా భువనేశ్వర్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. 18 మంది ప్రమాణస్వీకారం
ఒడిశాలో బీజేపీని మొదటి నుంచి బలోపేతం చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఆయనకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో పాటు, ఆయనను ఒక ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా చూస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి రేసులో ముందున్నప్పటికీ, హైకమాండ్ మాత్రం గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాంఝీని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఒడిశా రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.
ధర్మేంద్ర ప్రధాన్‌కు రాష్ట్రంలో భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఆయన రాకతో బీజేపీ అంతర్గత రాజకీయాల్లో వేడి పుట్టింది. ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీని మార్చి ఆ స్థానంలో ప్రధాన్‌ను కూర్చోబెడతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, కేంద్రంలో మంత్రి పదవి కోల్పోయిన వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద పీఠం వేస్తే అది గిరిజన సామాజిక వర్గంలో వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, యువతలోనూ కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read : మోదీపై మైనర్ బాలిక కామెంట్స్… ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం!









