Ravi Prakash

RUCHIKA : ఇలాంటి భాషను ఎవరూ సమర్థించరు. ఎవరి విషయంలోనైనాసరే… భారత ప్రధానితోసహా ఎవరిపైనా… ఇలాంటి అసభ్యకరమైన భాష ఉపయోగించడం కరెక్టు కాదు. రాజకీయ విభేదాలు వేరు. వ్యక్తిగత దూషణలు వేరు. కానీ… ఈ కథ కేవలం రుచికా సింగ్ అన్న మాటల గురించా? లేక… రుచికా అన్న మాటలు తర్వాత జరిగిన పరిణామాల గురించా? ఎందుకంటే ఈరోజు… నొయిడాకు చెందిన 25 ఏళ్ల యువతి దేశంలోని అతిపెద్ద పొలిటికల్ కాంట్రవర్సీస్‌లో ఒకటిగా నిలిచింది. రుచిక నిరసనను నిర్వహించినందుకు కాదు. రుచిక ఉద్యమాన్ని నడిపించినందుకు కాదు. కేవలం ఒక వైరల్ వీడియో కారణంగా. ఇప్పుడు… రుచికా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీవీ చర్చలు వేడెక్కాయి. సోషల్ మీడియాలో రచ్చయింది. రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జర్నలిస్టులు… న్యాయవాదులు… సమాజిక కార్యకర్తలు… ఇలా ప్రతి ఒక్కరికీ ఈ విషయంపై ఒక్కో అభిప్రాయం ఉంది. కానీ మనం ఈ స్టోరీలోకి మరింత లోతుగా వెళ్లే ముందు… ఈ కథ ఎలా మొదలైందో ముందుగా తెలుసుకుందాం.

పరీక్షల వివాదంపై దేశవ్యాప్త విద్యార్థుల నిరసన ఇప్పటికే ప్రధాన రాజకీయ సమస్యగా మారింది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రతిపక్షాలు విద్యార్థుల ఉద్యమానికి మద్దతిచ్చాయి. ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకుంది. పనిలో పనిగా విద్యార్థులకు హామీ ఇచ్చింది. చివరకు… నిరసన హోరు ఆగిపోయింది. కానీ ఒకే ఒక్క ప్రసంగం… మొత్తం చర్చను మార్చేసింది. దేశమంతా వైరల్ అయిన క్లిప్ ఇదే. కొన్ని గంటల్లోనే… దీనిని టీవీ ఛానెళ్లు షేర్ చేసుకున్నాయి…. రాజకీయ నాయకులు… ఇన్‌ఫ్లుయెన్సర్లు… వేలాది మంది సోషల్ మీడియా యూజర్స్‌ రుచికా సింగ్ క్లిప్‌ని ఫార్వార్డ్‌ చేశారు. రుచికా సింగ్‌ మాట్లాడిన భాష హద్దులు దాటిందని చాలామంది ఫైర్ అయ్యారు. ఇక్కడే ఈ కథ ఒక మలుపు తీసుకుంది.

Also Read : రాఫెల్, బ్రహ్మోస్ అవసరమే లేదు.. భారత్ సరికొత్త సీక్రెట్ వెపన్ రెడీ!

ప్రధానమంత్రి పట్ల ఉపయోగించిన భాష బాలేదని, రుచికా సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్మృతి సింగ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే… కేసు నమోదైంది. పోలీసు రికార్డుల ప్రకారం, వైరల్ వీడియోలో ఉన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరైనా అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే… దానికి పరిణామాలు తీవ్రంగా ఉండాల్సిందేనన్న ఒక వాదన గట్టిగా వినిపించింది. కానీ ఇక్కడే మరో ప్రశ్న రైజ్ అయింది. ఇది కేవలం సాధారణ క్రిమినల్‌ ఫిర్యాదేనా? లేక,స్టూడెంట్ రుచికా సింగ్ ఉన్నపళంగా ఉద్యమ గొంతుకగా మారిపోయిందా? ఎందుకంటే ఎఫ్ఐఆర్ తర్వాత… చర్చ పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం ఒక వీడియో గురించే కాదు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ… క్రిమినల్ చట్టం… విద్యార్థుల నిరసనలు… ప్రభుత్వ అధికారాల పరిమితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ చర్చా వేదికగా మారింది!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… రుచికా సింగ్‌కు మద్దతుగా వచ్చిన వారు కూడా… ఆమె ఉపయోగించిన మాటలను సమర్థించలేదు. రుచిక భాష అభ్యంతరకరమేనని అంగీకరించారు. అయితే, వారి ప్రశ్న వేరేలా ఉంది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన… అది ఆటోమేటిక్‌గా క్రిమినల్ కేసుగా మారిపోవాలా? అని! రుచికా సింగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. భవిష్యత్తులో ఎవరూ నోరెత్తకుండా చేసే కుట్రా అని! ఈ ప్రశ్న రాజకీయ నాయకులు… న్యాయవాదులు… పాత్రికేయులు… పౌర హక్కుల కార్యకర్తలు… సోషల్ మీడియాను కూడా రెండు వర్గాలుగా చీల్చేసింది. ఈ వివాదం టీవీ డిబేట్ల వరకు ఎలా దారితీసిందో… న్యాయవాదులు, యాక్టివిస్టులు దీన్ని ఎలా మలుపు తిప్పారో.. ఆన్‌లైన్ టార్గెటింగ్, డాక్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో.. అన్నీ ఇప్పుడు చూద్దాం! ఇది కేవలం ఒక నినాదం గురించా.. లేక దీని వెనుక ఇంకేదైనా దాగుందా? స్పష్టంగా చూద్దాం.

రుచికాసింగ్‌పై ఫైల్ అయిన ఎఫ్‌ఐఆర్‌… మొత్తం వివాదాన్ని… ఒక వైరల్ వీడియో నుంచి జాతీయ స్థాయి చర్చగా మార్చేసింది. రుచికా సింగ్ అన్న మాటలతో అందరూ ఏకీభవించారని కాదు. నిజానికి… రుచికాసింగ్‌కు మద్దతు తెలిపిన వారు కూడా, ఆమె వాడిన భాషను సమర్థించలేదు. కానీ చర్చ దారి మళ్ళింది. ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే… రుచికా సింగ్ మాట్లాడిన తీరును ఖండిస్తూనే, ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు మనకు లేదా? ఈ ప్రశ్న చాలామంది రైజ్ చేశారు. సౌరవ్ దాస్ క్లియర్‌గా మాట్లాడారు. రుచికా సింగ్ వాడిన భాష తప్పు కావచ్చు… ఆమె మాటలు అభ్యంతరకరంగా ఉండొచ్చు. తాము ఏం మాట్లాడుతున్నామో అన్న విషయంపై యువత చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ, సౌరవ్ దాస్‌ అభిప్రాయం ప్రకారం, కేవలం దుర్భాషలాడారన్న రీజన్‌తో క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించడం సమర్థనీయం కాదు. ఎవరికైనా పరువు నష్టం కలిగిందని భావిస్తే, చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని, కానీ క్రిమినల్ జస్టిస్‌ సిస్టమ్‌ను ఈ సందర్భంలో ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్యయుతంగా చేసే నిరసనలకు విఘాతం కలుగుతుందని సౌరవ్‌ దాస్ వాదించారు.

సౌరవ్ దాస్ ప్రకటన మొత్త చర్చ తీరునే మార్చేసింది. ఇది రుచికా సింగ్ భాష ఆమోదయోగ్యమా కాదా అనే అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. అభ్యంతరకరమైన ప్రసంగానికి, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు మధ్య గీత ఎక్కడ గీయాలనే దానిపై చర్చగా మారింది. చిత్రనిర్మాత ఓనిర్ కూడా సౌరవ్‌దాస్‌లానే ఆందోళన వ్యక్తం చేశారు. ఓనిర్ ఏం చెప్తున్నారంటే… “అశ్లీలత అంటే నేరం కాదు.” అసభ్యకరమైన భాషను వాడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని అంటే, మహిళా జర్నలిస్టులు, కార్యకర్తలు, LGBTQ+ కమ్యూనిటీ సభ్యులపై ఆన్‌లైన్‌లో జరిగే దుర్భాషలకు కూడా సేమ్‌ యాక్షన్ తీసుకోవాలని ఓనిర్‌ వాదించారు. రచయిత్రి సాక్షి నరులా కూడా ఈ వివాదంలో ముఖ్యమైన తేడాను వేలెత్తిచూపారు. నరులా.. రుచిక భాషను ‘కర్స్’ అంటే చాలా అసభ్యకరమైనది అని అభివర్ణించారు. కానీ, కేవలం అసభ్యకరమైన భాష వాడినంత మాత్రాన ఎవరూ నేరస్థులు కారని కూడా సాక్షి నరులా వాదించారు. నిరసనలో పాల్గొన్న మహిళలపై ఆన్‌లైన్ టార్గెటింగ్, డాక్సింగ్, బెదిరింపులు జరుగుతున్నాయనే వార్తలపై సాక్షి నరులా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఆందోళనలను ‘ద హిందూ’ పత్రికా కథనం మరింత బలంగా ప్రతిబింబించింది. నిరసనల అనంతరం తమ వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసి, ఆన్‌లైన్ వేధింపులకు, ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని నిరసనలో పాల్గొన్న మహిళలు చేసిన ఆరోపణలను ద హిందూ పత్రిక ప్రచురించింది. దీంతో బాధితుల ఆవేదన, ఈ మొత్తం వివాదంలో ఒక కీలకమైన మలుపుగా మారింది. మరిన్ని వీడియోలు బయటపడే కొద్దీ.. ఈ వివాదం మరో మలుపు తిరిగింది. చర్చ ఇప్పుడు ఒక ప్రసంగానికి మాత్రమే పరిమితం కాలేదు. నిరసనలు ముగిసిన తర్వాత, ఇందులో పాల్గొన్న కొంతమంది మహిళల పట్ల ప్రభుత్వ మద్దతుదారులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమను ఆన్‌లైన్‌లో టార్గెట్‌ చేశారని, అనుమతి లేకుండా తమ వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వేధిస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. భయం గుప్పిట్లో బ్రతకాల్సి వస్తోందని, నిరంతరం బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు, దేశవ్యాప్త చర్చలో కీలకంగా మారాయి.

Also Read : 17 ఏళ్లకు తీర్పు.. జమ్ము కశ్మీర్ సీఎంకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

ఈ వివాదంలో మరొక పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ నిర్వహిస్తున్న ‘ది జైపూర్ డైలాగ్స్’ అకౌంట్ నుంచి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక మహిళ వీడియో షేర్ అయింది. ‘ఆమెకు తగిన బుద్ధి చెప్పమని బజరంగ్ దళ్‌ను కోరుతున్నాము’ అని ఆ పోస్టులో ఉంది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తులే ఇలాంటి పిలుపులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రోజులు గడిచేకొద్దీ… ఈ వివాదం ఒకే నినాదానికి పరిమితం కాలేదు. ఇది టీవీ స్టూడియోలు, సోషల్ మీడియా టైమ్‌లైన్లు, పోలీస్ స్టేషన్లు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పెద్ద యుద్ధంగా మారింది. ప్రధానమంత్రిపై చేసిన ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోలేమని, ఇలాంటి వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని కొంతమంది బల్లగుద్ది తమ వాదన వినిపిస్తున్నారు. విమర్శకులు మాత్రం, ఈ చర్య ఏమాత్రం సమంజసం కాదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేసే కుట్రంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రెండు భిన్నమైన కథనాలు పుట్టుకొచ్చాయి. రెండూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్తున్నాయి.

ఈ వివాదం ముదిరేకొద్దీ… ఇది కేవలం న్యాయవాదులు, కార్యకర్తలకే పరిమితం కాలేదు. రాజకీయ వర్గాలు కూడా ఈ చర్చలోకి ప్రవేశించాయి. విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నిరసనలు ముగిసిన తర్వాత కూడా విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం, వారిని నిర్బంధించడం వంటి చర్యలు తీసుకుంటున్నారని ఖర్గే విమర్శించారు. సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం, మహిళా నిరసనకారుల వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం వంటి వార్తలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరో ప్రశ్న లేవనెత్తారు. పార్లమెంట్‌లో మాజీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, ఎంపీ డానిష్ అలీపై చేసిన వ్యాఖ్యల వివాదాన్ని మహువా గుర్తు చేశారు. మహువా వాదన చాలా క్లియర్‌గా ఉంది. అసభ్యకరమైన భాషను వాడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటారా? అయితే, గతంలో జరిగిన ఇలాంటి సంఘటనల్లో బాధ్యులపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదు? ఇక్కడ మహువా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. చట్టం అందరికీ సమానమే కదా అని మహువా గుర్తుచేశారు!

ఈ వివాదంలో మరో కీలక కోణం ఏంటంటే.. ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు! గాంధీజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలానా? ఎందుకు ఈ వివక్ష? అని అశ్విని సోని అనే X యూజర్‌ ప్రశ్నించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే. చట్టం అందరికీ సమానమేనా? ఇప్పుడు ఈ చర్చ రుచికా సింగ్‌ను దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఇది మూడు ప్రాథమిక ప్రశ్నల చుట్టూ తిరిగే నేషనల్ డిబేట్‌గా మారింది. మొదటిది… అభ్యంతరకరమైన ప్రసంగం ఎక్కడ ముగుస్తుంది… నేరం ఎక్కడ మొదలవుతుంది? రెండవది… ప్రతి చిన్న విషయానికి క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించాలా? మూడవది… ఒకవేళ చట్టాన్ని ప్రయోగిస్తే… రాజకీయాలు లేదా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, అది అందరికీ ఒకేలా వర్తించకూడదా?

టీవీ డిబేట్లు రగులుతున్నాయి.. సోషల్ మీడియా రణరంగంగా మారింది! నిమిషానికో పోస్ట్.. గంటకో వీడియో.. ప్రతి అడుగు ఈ వివాదాన్ని అగ్నిపర్వతంలా మారుస్తోంది! ఇది ప్రధాని కార్యాలయ గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని ఒక వర్గం వాదిస్తుంటే.. ఇది తమ గొంతును నొక్కేసే కుట్ర అంటూ రాజ్యాంగ హక్కుల కోసం మరో వర్గం పోరాడుతోంది! ఇదే సమయంలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది! నిరసనల్లో పాల్గొన్న మహిళలు ఇప్పుడు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ‘మా వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్‌లో లీక్ చేసి.. మాపై అసభ్యకర దాడికి దిగుతున్నారు’ అంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ వారు చేస్తున్న ఆరోపణలు.. ఇప్పుడు ఈ కేసుని మరో మలుపు తిప్పాయి! టీవీ స్టూడియోలు కావచ్చు… రాజకీయ నాయకులు కావచ్చు… ఇన్‌ఫ్లుయెన్సర్లు కావచ్చు… సోషల్ మీడియా ఖాతాలు కావచ్చు… అందరి దృష్టి ఒకే యువతిపై ఉంది. రుచికా సింగ్ ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు. ఆమె ఒక నేషనల్ డిబేట్‌కు సింబల్‌గా మారింది. భావప్రకటనా స్వేచ్ఛపై చర్చ. జవాబుదారీతనంపై చర్చ. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికార పరిధులపై చర్చ.

కానీ, ఈ మొత్తం వివాదంలో అందరినీ నివ్వెరపరిచే అసలు నిజం ఇక్కడే ఉంది! రుచికా సింగ్‌కు మద్దతుగా నిలిచిన వారెవరూ.. ఆమె వాడిన భాషను సమర్థించలేదు. ఆ భాష తప్పు.. అభ్యంతరకరం.. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు కూడా ఒప్పుకుంటున్నారు. మరి వారి వాదన ఎక్కడ మొదలైంది? ఒక స్పీచ్‌ కోసం ఇంత పెద్ద ఎత్తున వేట మొదలుపెట్టాలా? చట్టపరమైన దాడులు.. రాజకీయ రచ్చ.. సామాజిక వేధింపులు.. ఇవన్నీ ఒక మాట కోసం అవసరమా? ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే!

ప్రతి ప్రజాస్వామ్యం ఎప్పుడో ఒకప్పుడు క్లిష్టమైన మలుపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ‘మాట్లాడే స్వేచ్ఛ’ – ‘గౌరవప్రదంగా ప్రవర్తించాల్సిన బాధ్యత’ అనే రెండు విలువల మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు ఆ సందిగ్ధత మరింత పెరుగుతుంది. రుచికా సింగ్ వైరల్ వీడియో, సరిగ్గా ఈ రెండు విలువలనే ఫేస్‌ టు ఫేస్ నిలబెట్టింది. రుచిక వాడిన భాష అభ్యంతరకరమని అందరూ అంగీకరించినప్పటికీ… ఆ తర్వాత తీసుకున్న చర్యల విషయంలో మాత్రం, దేశం రెండు భిన్నమైన ధ్రువాలుగా విడిపోయింది. ఒక వర్గం వాదన ప్రకారం, ప్రధానమంత్రి పదవికి దక్కాల్సిన గౌరవం విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారిపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసినప్పుడు, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపగలమని వారు నమ్ముతున్నారు.

అయితే, మరో వర్గం కూడా రుచిక వాడిన భాషను ఏమాత్రం సమర్థించలేదు, కానీ ప్రభుత్వ చర్యల పట్ల గళం విప్పింది. ఈ విషయంలో ‘క్రిమినల్ చట్టాల ప్రయోగం’ అవసరమా? ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీలు మారితే, ఇదే ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తిస్తాయా? అన్న ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు. దురదృష్టవశాత్తూ, ఈ ప్రశ్నలకు నేటికీ ఎటువంటి స్పష్టమైన సమాధానం దొరకలేదు. భారత రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తూనే, చట్టం పరిధిలో కొన్ని సమంజసమైన పరిమితులను కూడా విధించింది. వాస్తవానికి, ఈ స్వేచ్ఛకు – బాధ్యతకు మధ్య సమతుల్యతను కాపాడటం అనేది అత్యంత సున్నితమైన అంశం. ప్రతి కోర్టు, ప్రతి ప్రభుత్వం, చివరికి ప్రతి తరం కూడా… ఈ స్వేచ్ఛకు హద్దులు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాల్సిన సవాల్‌ను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఎందుకంటే, ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి చట్టాలకు పునాదులవుతాయి. ఈరోజు గీసిన ఈ గీత, భవిష్యత్తులో మన ప్రజాస్వామ్య ప్రమాణాలను ఎలా నిర్దేశిస్తుందనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న.

ఈ కథ ఇప్పుడు కేవలం రుచికా సింగ్ అనే వ్యక్తికి గానీ, ఆమె వాడిన ఒక నినాదానికి గానీ పరిమితం కాలేదు. ఇది ఒక విస్తృతమైన ప్రజాస్వామ్య చర్చకు ఆరంభం. పౌరులు హద్దులు దాటినప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశం అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏమిటి? అసభ్యకరమైన ప్రసంగాన్ని బలంగా ఖండిస్తూనే, అదే సమయంలో చట్టబద్ధమైన నిరసనలకు భంగం కలగకుండా, నిర్భయమైన వాతావరణాన్ని మనం ఎలా కాపాడగలం? విమర్శించే హక్కును రక్షిస్తూనే, భాషలోని అశ్లీలతను ఎలా తిరస్కరించగలం? ఇవి సమాధానం చెప్పడానికి సులభమైన ప్రశ్నలు కావు. కానీ, ఒక పరిణతి చెందిన ప్రజాస్వామ్యంగా వీటికి మనం సమాధానాలను వెతుక్కోవాల్సిందే. బహుశా… అందుకే ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇంతటి చర్చకు దారితీసింది. ఎందుకంటే, ఇది ప్రతి పౌరుణ్ణి నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతోంది.

ఇక్కడ రుచికా సింగ్ మాట్లాడింది సరైనదా కాదా అన్నది కాదు… రుచిక వ్యాఖ్యలతో బాధపడిన వారు సరైనవారా కాదా అన్న పాయింట్ అంతకన్నా కాదు. అసలు ప్రశ్న ఏంటంటే… సమాజంలో చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించే భాషను విన్నప్పుడు, భారతదేశం ఎలాంటి ప్రజాస్వామ్య దేశంగా తనను తాను ఆవిష్కరించుకోవాలనుకుంటోంది? దీనికి సమాధానం ప్రజాక్షేత్రంలో జరిగే ‘ఖండన’లో ఉండాలా? లేక అది ‘క్రిమినల్ కేసుల’ రూపంలో చట్టాన్ని ఆశ్రయించాలా? అసలు చట్టం అనేది అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే జోక్యం చేసుకునే ‘చివరి అస్త్రమా’? లేక రాజకీయ ప్రసంగాలను అణచివేసే ‘మొదటి స్పందన’గా మారాలా? ఇవి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ప్రశ్నలు కావు. స్వేచ్ఛ, జవాబుదారీతనం, రూల్ ఆఫ్ లా… ఈ మూడింటినీ ఒక ప్రజాస్వామ్యం ఎలా సమతుల్యం చేసుకుంటుంది అనేదానికి ఇదే అసలైన పరీక్ష!

ఈ కథ రుచికా సింగ్ గురించి కాదు.. ఇది ఒక ప్రజాస్వామ్య సూత్రం గురించి. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం మారకూడదు. అసభ్యకర భాషను అంగీకరించలేం, అదే సమయంలో దానికి ఇచ్చే స్పందన చట్టబద్ధంగా, అందరికీ సమానంగా ఉండాలి. ఈ చర్చ ఇక్కడితో ఆగిపోయేది కాదు, కొనసాగుతూనే ఉంటుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.