
-RAVI PRAKASH
E20 : ”దాల్ మే కాలా నహీ… పూరీ దాల్ హీ కాలీ హై” ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన తీవ్రమైన వ్యాఖ్య. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో అత్యంత బలమైన విమర్శగా దీనిని భావించవచ్చు. రాఫెల్ కాకుండా, అదానీ అంశం కాకుండా, నిరుద్యోగం కాకుండా… ఈసారి రాహుల్ గాంధీ గురి పెట్టింది E20 పెట్రోల్ పైనే. దీన్ని ఆయన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా అభివర్ణించారు. ప్రజల వాహనాలకు నష్టం కలిగించడం, ప్రజల జేబులకు భారం వేయడం కాకతాళీయం కాదని, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యమని ఆరోపించారు. రాహుల్ మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం ఒక తప్పుడు నిర్ణయం మాత్రమే కాదు, అసలు ఈ విధానంలోనే (పాలసీలోనే) లోపం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన ఇంధన విధాన నిర్ణయాల్లో E20 ఒకటి. ఇప్పుడు ఈ విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ అంశాన్ని మొదట లేవనెత్తింది రాహుల్ గాంధీ కాదు. గత కొన్ని వారాలుగా అరవింద్ కేజ్రీవాల్ కూడా E20 విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. E20తో పాటు సాధారణ పెట్రోల్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, వినియోగదారులకు ఎంపిక చేసుకునే హక్కు ఉందని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కోరని ఇంధనాన్ని వారిపై బలవంతంగా రుద్దుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు దేశంలోని ఇద్దరు కీలక ప్రతిపక్ష పార్టీల నాయకులు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఒకే అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీంతో E20 నిజంగానే వాహనాలను దెబ్బతీస్తుందా? ఇది నిజంగానే ఒక భారీ కుంభకోణమా? లేక ఎన్నికల ముందు జరుగుతున్న రాజకీయ ప్రచారమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అర్థం చేసుకోవడానికి ముందు, అసలు E20 అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం వాడే పెట్రోల్‌లో చాలా తక్కువ శాతం ఎథనాల్ మాత్రమే కలిపేవారు. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా ఆ శాతాన్ని E5, E10 నుండి ఇప్పుడు E20 వరకు పెంచింది. 20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్. ఎథనాల్ అనేది ఒక రకమైన ఇంధన స్థాయి ఆల్కహాల్. దీన్ని ప్రధానంగా చెరకు, మొక్కజొన్న మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసి, పెట్రోల్‌లో మిశ్రమం (బ్లెండ్) చేసి బంకుల ద్వారా సరఫరా చేస్తారు. ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి నాలుగు ముఖ్యమైన కారణాలను పేర్కొంటోంది. దిగుమతుల భారం తగ్గడం: భారత్‌కు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గించడానికి దేశీయంగా తయారయ్యే ఎథనాల్ ఉపయోగపడుతుంది. 2. ఉద్గారాల తగ్గింపు: పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్ వల్ల కాలుష్య వాయువుల (ఉద్గారాల) విడుదల తక్కువగా ఉంటుంది. 3. రైతులకు ప్రయోజనం: ఎథనాల్ ఉత్పత్తి పెరిగితే చెరకు రైతులకు, చక్కెర కర్మాగారాలకు కొత్త మార్కెట్ లభించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. 4.అందరికీ లబ్ధి చేకూర్చే విధానం: కాలుష్యం తగ్గి, రైతులకు లాభం చేకూరి, దిగుమతులు తగ్గే ఈ విధానాన్ని ఒక జాతీయ ఇంధన సంస్కరణగా కేంద్రం ప్రచారం చేస్తోంది. వాహన తయారీ సంస్థలు కూడా E20 ఇంధనానికి అనుకూలమైన (E20-కంపాటిబుల్) వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి.
ఈ ఇంధనాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ లక్ష్యాలు బాగున్నప్పటికీ, అసలు వివాదం కేజ్రీవాల్ మరియు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో మొదలైంది. కేజ్రీవాల్ ఈ అంశంపై మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్‌ల ద్వారా తీవ్రమైన ప్రచారం చేపట్టారు. ఆయన లేవనెత్తిన ప్రధాన ఆరోపణలు: 1)వాహనాలు దెబ్బతినడం: E20 వాడిన తర్వాత మైలేజ్ (ఇంధన సామర్థ్యం) తగ్గిందని, ఇంజిన్ పనితీరు పడిపోయిందని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారులు తమకు తెలియకుండానే ఈ దాగి ఉన్న అదనపు భారాలను మోస్తున్నారు. 2) ఎంపిక హక్కు లేకపోవడం: E20 మంచిదే అయితే, సాధారణ పెట్రోల్ మరియు E20 రెండింటినీ మార్కెట్లో ఉంచి వినియోగదారుడికే ఎంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? 3) ధర తగ్గకపోవడం: ఇంధనంలో 20% దేశీయంగా తయారయ్యే ఎథనాల్ కలిపినప్పుడు, సాధారణ పెట్రోల్ కంటే E20 ధర తక్కువగా ఉండాలి కదా? సమాన ధర ఎందుకు వసూలు చేస్తున్నారు? 4) ప్రజలను పరీక్షా సాధనాలుగా మార్చడం: తగినంత ప్రజా అవగాహన, పారదర్శకత లేకుండా ప్రజలపై ఈ విధానాన్ని అమలు చేశారనేది మరొక విమర్శ. విదేశీ ఒప్పందాల అనుమానం: ఎథనాల్ నిర్ణయం భారత రైతుల కోసం కాదని, అమెరికాలోని ఎథనాల్ నిల్వలను కొనడానికేనని కేజ్రీవాల్ ఆరోపించారు.
ప్రభుత్వం, చమురు సంస్థలు , ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. కొత్త వాహనాలు E20కి అనుకూలంగానే తయారవుతున్నాయని స్పష్టం చేశాయి. సోషల్ మీడియా, ఇతర వేదికల్లో వాహనదారులు, మెకానిక్‌లు, టాక్సీ డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొందరు మైలేజ్ తగ్గిందని చెబుతుంటే, మరికొందరు ఎలాంటి తేడా లేదని అంటున్నారు. అయితే, వాహన మైలేజ్ అనేది ట్రాఫిక్ పరిస్థితులు, డ్రైవింగ్ శైలి, టైరు గాలి ఒత్తిడి, ఇంజిన్ ఆరోగ్యం మరియు వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఒక ముగింపునకు రావడం సరికాదు. ఇక్కడ ప్రధానమైన జెన్యూన్ ప్రశ్న ఏమిటంటే—కొత్తగా వచ్చే E20 వాహనాలకు సమస్య లేకపోయినా, ఇప్పటికే రోడ్లపై ఉన్న లక్షలాది పాత వాహనాల పరిస్థితి ఏమిటి? వారికి ప్యూర్ పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఉందా? లేదా? రాహుల్ గాంధీ దీన్ని ఒక “భారీ కుంభకోణం” అంటుంటే, ప్రభుత్వం దీనిని ఒక “దీర్ఘకాలిక జాతీయ ఇంధన విధానం”గా సమర్థించుకుంటోంది. ఈ వివాదంలో చివరికి తేలాల్సింది రాజకీయ ఆరోపణలు కావు, అలాగే కేవలం ప్రభుత్వ ప్రకటనలు మాత్రమే సరిపోవు. “కుంభకోణం” అనే పదం చాలా తీవ్రమైనది అయినందున ప్రతిపక్షాలు దానికి తగిన బలమైన ఆధారాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం కూడా పారదర్శకతతో, స్వతంత్ర పరిశోధనా నివేదికలతో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కోట్లాది మంది ఇంధన వినియోగదారుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో, విశ్వసనీయమైన ఆధారాలు మరియు స్పష్టమైన విధానాలే E20 ఒక విజయవంతమైన సంస్కరణగా నిలుస్తుందా లేదా వివాదాస్పద విధానంగా మిగిలిపోతుందా అని నిర్ణయిస్తాయి.









