KTR : తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా చెలరేగిన రాజకీయ ఉద్రిక్తతలపై బీఆర్‌ఎస్‌ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోక్‌ భవన్‌ కు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. సభ ముగిసే వరకు బీఆర్ఎస్ శాసనసభ్యులను సస్పెండ్‌ చేయడం, అసెంబ్లీకి వస్తున్న సభ్యులపైన పోలీసుల తీరుపై గవర్నర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బుధవారం (సెప్టెంబర్ 9) మధ్యాహ్నం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలను వివరిస్తూ 13 పేజీలతో కూడిన ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు అందజేశారు.

Also Read : అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ కుట్ర… ఫాంహౌస్ పాత్రపై విచారణ.. సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అరచేతిలో స్వర్గం చూపారు. అన్ని వర్గాలకు డిక్లరేషన్లు, బాండ్‌ పేపర్లు, అఫిడవిట్ల పేరిట 420 హామీలు ఇచ్చారు. కానీ, వెయ్యిరోజులైన వాటిని అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. రాష్ర్టంలో యూరియా కొరత, రైతు భీమాపై గవర్నర్‌ తో చర్చించామన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై గవర్నర్‌కు కంప్లైంట్ ఇచ్చామన్నారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాం. బ్లాక్ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని ఆయర ఆరోపించారు. మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకుని దాడి చేశారని, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాపై దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారని. వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చి వేలాది మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్‌పై దాడికి ఉసిగోల్పారని ఆరోపించారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్‌కు ఆపాదించారన్నారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్‌ను అవమానిస్తున్నారన్నారు. చావు డప్పు ఎప్పుడు కొడుతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారని గవర్నర్‌కు తెలిపినట్లు కేటీఆర్‌ వివరించారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్, డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.

Also Read : పోలీస్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు గడువు పెంచిన బోర్డు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.