CM Revanth Reddy : శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించిందని, కానీ, ఈ సమస్యలు చర్చకు వస్తే తమ గుట్టు రట్టవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు పన్ని సమావేశాలు జరగకుండా ఫామ్‌హౌస్‌లో ప్రణాళికలు రూపొందించారని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం..ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను అడ్డుకోవడానికి కుట్ర చేశారని ఆరోపించారు. వారి సభ్యులను ఉన్మాదులుగా మార్చి ఉసిగొలిపి పంపించారని రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చ కోసమే తాము అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 22ఏ భూములు సహా అన్ని అంశాలను చర్చించాలనుకున్నామన్నారు. ఈ అంశాలపై చర్చ జరిగితే వారికి రాజకీయ సమాధి తప్పదని కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : గణేశ్‌ విగ్రహం పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి.. ఇలా చేయండి…

పార్లమెంట్, ముంబయి, పుల్వామా దాడులకు స్పీకర్ పై బీఆర్‌ఎస్‌ మాటల దాడికి ఏ మాత్రం తేడా లేదని తీవ్రంగా ఆక్షేపించారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ ఘటనను ముక్తకంఠంతో సభ్యులంతా ఖండించారన్నారు. దీనిపై కేసీఆర్ తన సభ్యులతో క్షమాపణలు చెప్పిస్తారని భావించామని, కానీ, ఎక్కడైతే ఈ కుట్రకు తెర లేచిందో అదే ఎర్రవల్లి ఫామ్‍హౌస్ కు వెళ్లి దళితులు డప్పు దరువు వేస్తే అక్కడ పసుపుతో శుద్దీకరణ చేశారని మండిపడ్డారు. ఉత్తరాఖండ్ లో ఖర్గే నిరసనలో పాల్గొంటే అదే మైదానంలో శ్రీరామసేన శుద్ధీకరణ చేసింది. ఇలాంటి దురదృష్టకర సంఘటన మన రాష్ట్రంలోనూ జరిగడం సిగ్గు చేటన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పిలిపించుకుని ఈ కుట్ర పన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా కేసీఆర్ కుట్ర పన్నారని ఆక్షేపించారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ ముష్కరులు వచ్చి మన అసెంబ్లీ ఎదుట.. ఉద్యోగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడి చేశారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో పన్నిన కుట్రలకు వ్యతిరేకంగానే.. దళితులు అక్కడ నిరసన తెలపడానికి వెళ్లారు.. దాడుల కోసం కాదు. ప్రజాస్వామిక పద్ధతిలో డప్పు కొట్టి దండోరా వేయడం ద్వారా.. తమ మనసులోని భావాలను వ్యక్తీకరించారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కాగా, స్పీకర్‌ పై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులపై దాడి తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. విచారణ అధికారిగా విజయ్‌కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. సభా ప్రాంగణంలో జరిగిన వివరాలను సేకరిస్తామన్నారు. జరిగిన సంఘటనలన్నీ ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద శిక్షకు అర్హమైనవని సీఎం అన్నారు. ఫౌం హౌస్‌ లో కుట్రలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

Also Read : వీర్లపల్లి శంకర్‌ నోటి దురుసు తగ్గించుకో… టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత ఫైర్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.