
Mount Everest : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఇపుడు ప్రపంచంలోనే ఎత్తైన చెత్తకుప్పగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకపుడు ఎవరో ఒకరు, ఎపుడో అపుడు ఎవరెస్ట్‌ను అధిరోహిస్తే అది గొప్పగా చెప్పుకునేవారు. కానీ నేడు వందల సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పైకి చేరుకుంటుండటంతో ఎత్తైన ఆ పర్వతశిఖరం ఇపుడు భయంకరమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హిమపాతాలు, మంచు అందాలతో ఒకపుడు మెరిసిపోయిన ఎవరెస్ట్ శిఖరం మానవ తప్పిదాల మూలంగా ఒక భారీ ‘విష వ్యర్థాల కుప్ప’గా మారుతోంది. ముఖ్యంగా ఎవరెస్ట్ పైన ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘డెత్ జోన్’ ఇప్పుడు టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తతో నిండిపోయి, దిగువన ఉండే లక్షలాది మంది ప్రజల తాగునీటి సరఫరాకు ముప్పుగా పరిణమించినట్లు తెలుస్తోంది.
This is Camp IV on Mt Everest (~7,900 m), the highest campsite on Earth and the final stop before the summit.
What should be one of the most extraordinary places on the planet has, in many ways, become one of the ugliest faces of Everest’s commercialisation. Abandoned tents,… pic.twitter.com/0Th04sCa5J
— Everest Today (@EverestToday) June 1, 2026
Also Read : సౌదీ అరేబియా పై హూతీల దాడి… యుద్ధంలోకి పాకిస్థాన్ ఎంటర్?
ఇది ఒక్కటే కాదు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నుంచి రోజుకు 6వేల లీటర్లకు పైగా మూత్రం మంచుపైకి చేరుతోందని తెలుస్తోంది. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క పర్వతారోహణ సీజన్‌లో ఈ మూత్రం వల్ల దాదాపు 154 టన్నుల మంచు కరిగే ప్రమాదం ఉంది. ఎత్తైన ప్రాంతాలను అధిరోహిస్తున్నపుడు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పర్వతారోహకులు ఎక్కువ నీరు తాగుతారు. తాగిన ఆ నీరు చివరికి మూత్రంగా బయటకు వస్తుంది. అలా అక్కడ మూత్ర విసర్జన చేయడం వల్ల ఆ మూత్రం నేరుగా చాలా సందర్భాల్లో హిమానీనదం మీదకు చేరుతుంది. మనిషి శరీరం నుంచి బయటకు వచ్చిన ఆ వెచ్చని ద్రవం మంచును తాకినప్పుడు అక్కడి మంచుకు వేడి చేరుతుంది. దానితో మంచు కరిగిపోతుంది. అలా వేలాది లీటర్లు ప్రతిరోజూ అదే ఉపరితలంపై పడుతూ ఉంటే, ఆ వేడి కూడా ఒక ప్రభావంగా మారి మంచు పూర్తిగా కరిగిపోతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం దానివల్ల 154 టన్నుల మంచు కరుగుతుంది. అది కేవలం ఒక సంఖ్యగా కనిపించవచ్చు కానీ ఆ సంఖ్య వెనుక ఒక హిమానీనదం ఉందనే విషయాన్ని గుర్తించాలి.
పర్వతారోహణ సీజన్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రాంతంలో దాదాపు 1,600 టెంట్ల వరకు వేస్తారు. దీంతో ఎవరెస్ట్ ప్రాంతం ఒక చిన్న పట్టణంలా మారుతుంది. అక్కడే వంటలు చేసుకుంటారు. చలినుంచి రక్షించుకోవడానికి టెంట్లను వేడిగా ఉంచుతారు, జనరేటర్లు వినియోగిస్తారు. అలా అనేక రకాలుగా అక్కడ వ్యర్థాలు పేరుకుపోతాయి. అలా పేరుకున్న ఘన వ్యర్థాలను ట్యాంకుల్లో సేకరించి కొండ కిందకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. కానీ, మూత్రం మాత్రం చాలా సందర్భాల్లో నేరుగా హిమానీనదం మీదకే చేరుతుంది. ఆ హిమానీనదం కరిగి కిందకు ప్రవహించి అనేక లోయల ద్వారా నీరు భూమిని చేరుతుంది. ఆ నీరే ఎన్నో జీవనాలకు ఆధారం. అలాంటి నీరు కాలుష్యంతో నిండి దిగువకు చేరడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి ఎన్నో జీవరాశులకు నష్టం వాటిల్లుతుంది.
ఎవరెస్ట్ మీద 2023లో 824 ఎల్పీజీ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల గ్యాసోలిన్ ఉపయోగించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా వంట చేయడానికి, టెంట్లను వేడిగా ఉంచడానికి, జనరేటర్లను నడపడానికి ఉపయోగించిన ఇంధనం. వీటి నుంచి ఉత్పత్తైన వేడి మొత్తం దాదాపు 849,174 మెగాజౌల్స్‌గా అంచనా వేశారు. ఆ శక్తి దాదాపు 2,492 టన్నుల మంచు కరిగిపోయేంత వేడిని సృష్టించగలదని పరిశోధకులు అంటున్నారు. ఈ లెక్కల్లో మనిషి చేసే ప్రతి పని చేరలేదనే చెప్పలి. హెలికాప్టర్లు మనుషులను, సామగ్రిని తీసుకెళ్లడానికి చేసే రాకపోకల వల్ల వచ్చే వేడి ఇందులో లేదు. వేలాది మంది శరీరాల నుంచి వెలువడే వేడి కూడా ఇందులో లెక్కించ లేదు. 154 టన్నుల మంచు మూత్రం వేడి వల్ల కరిగే అవకాశం ఉన్నా, ఇంధనం వల్ల మరో 2,492 టన్నుల మంచు కరిగేంత శక్తి విడుదలవుతున్నది. దీంతో ఎవరెస్ట్ మంచు లేని శిఖరంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
Also Read : టెక్నికల్ ఇష్యూ.. బ్రిటన్‌లో 1,000కి పైగా ఫ్లైట్లు బంద్!
ఇక మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి చివరి శిబిరమైన క్యాంప్-IV (సౌత్ కోల్) భూమిపైనే అత్యంత ఎత్తైన ప్రాంతం(సుమారు 7,900 మీటర్లు)గా పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అంటారు. ఎందుకంటే ఇక్కడ గాలి చాలా పలచగా ఉండి, ఆక్సిజన్ అందక మానవ శరీరం క్షీణించడం ప్రారంభిస్తుందట. రష్యన్ పర్వతారోహకురాలు ఏంజెలోవా ఇటీవల అక్కడ తీసిన చిత్రాలు ఈ ప్రాంతంలోని భయానక పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించాయి. అధికారులు అంచనా ప్రకారం, ఈ సౌత్ కోల్ ప్రాంతంలో ప్రస్తుతం 40 నుంచి 50 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. పాత ఆక్సిజన్ సిలిండర్లు, చిరిగిన టెంట్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, గడ్డకట్టిన మానవ వ్యర్థాలతో ఈ మృత్యు ప్రాంతం నిండిపోయినట్లు వెల్లడైంది. ఇక్కడి అతి శీతల వాతావరణం వల్ల ఈ చెత్త కుళ్ళిపోకుండా అలాగే ఉండిపోవడంతో వాతావరణం తీవ్ర కాలుష్యంతో దర్శనమిస్తోంది.
ఒకపుడు ఒక రికార్డు కోసం పర్వాతాలను అధిరోహించే అవకాశం ఉండేది. కానీ నేడు పర్వతారోహణ పూర్తిగా వాణిజ్యీకరణం కావడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం 2026 సీజన్‌లో రికార్డు స్థాయిలో 494 విదేశీ పర్వతారోహణ అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఈ ఏడాది దాదాపు 900 మంది శిఖరాన్ని అధిరోహించగా.. కేవలం మే 20న ఒకే ఒక్క రోజు ఏకంగా 274 మంది ఎవరెస్ట్‌ను చేరుకున్నారు. ఈ విపరీతమైన రద్దీ కారణంగా అలసిపోయిన అధిరోహకులు తమకున్న భారీ సామాగ్రిని, టెంట్లను అక్కడే వదిలేసి కిందకు వచ్చేస్తున్నారు. సాధారణంగా ప్రతి అధిరోహకుడు సగటున 8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాడు. వాటన్నింటిని అక్కడే వదిలేసి వస్తున్నారు. అక్కడ చెత్త సేకరణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుండటంతో ఎంతో అద్భుత ప్రదేశమైన ఎవరెస్ట్ అత్యంత అసహ్యకర ముఖాలలో ఒకటిగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ వ్యర్థాల సంక్షోభం కేవలం ఎవరెస్ట్ పర్వతానికే పరిమితం కాలేదు. గ్లోబల్ వార్మింగ్ (వాతావరణ మార్పుల) వల్ల హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయిన నీటితో పాటు దశాబ్దాల నాటి రసాయన, మానవ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ విష కాలుష్యం అంతా కొండలపై నుంచి కిందికి ప్రవహించే మంచినీటి ప్రవాహాలలో కలిసిపోయి మానవమనుగడకు ముప్పుగా మారుతోంది.









