Sewing Machine Scheme : బీసీ మహిళలకు నిజంగా ఇది శుభవార్తేనని చెప్పచ్చు. బీసీల ఆర్థిక అభ్యున్నతి కోసం, అందులోనూ ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలు ఉచిత కుట్టు మిషన్లను పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలోని బీసీ మహిళల కోసం ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు సమాచారం ఇస్తున్నారు. కుట్టు మిషన్లు కావాలసిన బీసీ మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన మహిళలు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

దరఖాస్తు చేసే బీసీ మహిళల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల వయసు లోపువారై ఉండాలని అధికారులు తెలిపారు. వితంతు, ఒంటరి, వికలాంగులు, అనాధ మహిళలకు ముందు ప్రాధాన్యత ఉంటుందని, అలాగే టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని వారు వివరించారు. నివాసం, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కనీస అక్షరాస్యత తప్పనిసరిగా ఉండాలని, నియోజకవర్గంలో వెయ్యి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీస విద్యార్హత ఐదవ తరగతి పాసైన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ అవకాశం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఉంటుందన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణులకు 1.50లక్షలు, పట్టణ వాసులకు రెండు లక్షల లోపు ఉండాలని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు అని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని కుల, ఆదాయ, నివాస, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతవాసులు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.