
H-1B Visa Renewals : అమెరికాలో రెండవసారి అధికారం చేపట్టిన ట్రంప్ సర్కార్ దేశంలో వలసలను నిరోదించడం కోసం అవసరమైన అన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు వీసాలు, ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ మరోసారి వీసా ఫీజును తెరపైకి తెచ్చారు. హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు వసూలు చేయాలనే మరో ప్రతిపాదనను సర్కార్ తెర మీదకు తెచ్చింది.ఈ ప్రతిపాదన ప్రకారం బడా కార్పొరేషన్ల హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్ల రెన్యువల్స్‌పై అదనపు ఫీజు విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజును వీసా రెన్యూవల్స్‌కు వర్తించేలా రూపొందించిన కొత్త నిబంధనలు తుది రూల్ మేకింగ్ దశకు చేరుకున్నట్టు అక్కడి జాతీయ మీడియా వెల్లడించింది. ఇది అమల్లోకి వస్తే ఆయా కంపెనీలకు హెచ్-1బీ వీసాదారులను కొనసాగించడం మరింత భారంగా మారుతుందని తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రకారం సగానికి పైగా హెచ్-1బీ వీసాదారులు, ఎల్-1వీ వీసాదారులు ఉన్న అమెరికన్ కంపెనీలపై ఈ అదనపు ఫీజును విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖ కసరత్తు ముమ్మరం చేశాయి.ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇలాంటి బడా సంస్థలు కొత్త విదేశీ వర్కర్లను స్పాన్సర్ చేసే సమయంలో హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్లపై అదనంగా 4 వేల డాలర్ల ఫీజును చెల్లిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇకపై విదేశీ ఉద్యోగిని కొనసాగించేందుకు చేసే రెన్యూవల్స్ విషయంలోనూ ట్రంప్ సర్కారు అదనపు ఫీజు విధించే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు నిప్పు…స్పాట్ లో 157 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం, ప్రభుత్వం జారీ చేసే హెచ్-1బీ అనుమలలో అధిక శాతం రెన్యువల్స్‌కు సంబంధించినవేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 4.06 లక్షల హెచ్-1బీ అప్లికేషన్లకు ఆమోదం తెలపగా వాటిల్లో 71 శాతం రెన్యూవల్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో ఈ ఫీజు కూడా అమల్లోకి వస్తే భారతీయులపై భారం పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
మీడియా కథనాల ప్రకారం.. ఈ వీసా పొడిగింపులు పొందిన వారిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.26 లక్షల మంది భారతీయ పౌరులు హెచ్-1బీ వీసా పొడిగింపులు చేసుకున్నారు. ఇది మొత్తం పొడిగింపులలో 77.6 శాతం కావడం గమనార్హం. ఇక పొడిగింపుల జాబితాలో చైనా (31,581) రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఫిలిప్పీన్స్, కెనడా, దక్షిణ కొరియా, మెక్సికో ఉన్నాయి. ఈ గణాంకాలు ప్రకారం ఫీజుల పెంపు భారతీయులపైనే ఎక్కువగా పడుతుందని తెలుస్తోంది.
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బీ వీసా పొడిగింపులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ పొడిగింపులలో2025 ఆర్థిక సంవత్సరంలో, అత్యధికంగా అమెజాన్ (14,532), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (5,293), మైక్రోసాఫ్ట్ (4,863), మెటా ప్లాట్‌ఫామ్స్ (4,740), యాపిల్ (4,610), గూగుల్ (4,509) సంస్థలు పిటిషన్లకు ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ఈ కొత్త ఫీజుల విధానం అమలైతే, ఈ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పెరగనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తుది దశలో ఉన్నప్పటికీ, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Also Read : పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్!









