
Big Relief For H-1B Visa Holders : అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ నిపుణులకు కొత్త ఆశలు చిగురింపజేసే పరిణామం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించిన కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు చట్ట రూపం దాల్చితే, హెచ్-1బీ (H-1B) వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు, తాత్కాలిక రక్షిత స్థితి (TPS) కలిగిన దాదాపు 80 లక్షల మంది దీర్ఘకాలిక నివాసితులకు గ్రీన్ కార్డ్ పొందేందుకు సరికొత్త మార్గం సుగమం కానుంది.
ప్రస్తుతం అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అమలులో ఉన్న “రిజిస్ట్రీ ప్రొవిజన్” చట్టాన్ని ఆధునీకరించడమే ఈ కొత్త బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. 1929లో రూపొందించబడిన ఈ చట్టంలోని సెక్షన్ 249 ప్రకారం.. జనవరి 1, 1972 నాటికి అమెరికాలో అడుగుపెట్టి నిరంతరంగా నివసిస్తున్న వారికి మాత్రమే గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు అర్హత ఉండేది. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఈ కట్-ఆఫ్ తేదీలో మార్పులు చేయకపోవడం వల్ల, 2015-2019 మధ్య కాలంలో కేవలం 305 మంది మాత్రమే ఈ సదుపాయాన్ని పొందగలిగారు.
ఈ కాలం చెల్లిన నియమాన్ని సవరించి, స్థిరమైన తేదీకి బదులుగా రోలింగ్ అర్హత కట్-ఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సెనేటర్ పాడిల్లా ప్రతిపాదించారు. దీని ప్రకారం, అమెరికాలో కనీసం ఏడేళ్ల పాటు నిరంతరంగా నివసిస్తూ, నిర్దేశిత చట్టబద్ధమైన అర్హతలను పూర్తి చేసిన దీర్ఘకాలిక నివాసితులందరూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా మారతారు. ఈ సవరణ అమల్లోకి వస్తే, సాంప్రదాయ ఉద్యోగ ఆధారిత కోటాపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
Also Read : టన్నుల కొద్ది బంగారం కొంటున్న చైనా.. ట్రంప్ కు షాకిచ్చే వ్యూహం ఇదేనా?
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో భారతీయులే అత్యధికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఏటా ఏ ఒక్క దేశానికైనా గ్రీన్ కార్డ్‌ల కేటాయింపులో 7 శాతం గరిష్ఠ పరిమితి (కంట్రీ క్యాప్) ఉంది. భారత్ నుంచి ఏటా వేలాది మంది ఐటీ ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్-1బీ వీసాలపై అక్కడకు వెళ్తుండటంతో దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో ఏకంగా 80 శాతం వాటా భారతీయులదే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ కఠినమైన నిబంధనల వల్ల వేలాది భారతీయ కుటుంబాలు దశాబ్దాల తరబడి అనిశ్చితిలో కాలం వెళ్లదీస్తున్నాయి. హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాత “ఏజ్ అవుట్” అయి, వారు తమ డిపెండెంట్ హోదాను కోల్పోయే ప్రమాదం నెలకొంటోంది. అలాగే ఉద్యోగం మారడానికి లేదా వృత్తిపరంగా ఎదగడానికి వీసా నిబంధనలు ఆటంకంగా మారుతున్నాయి. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదన అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. సాధారణంగా విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్టూడెంట్ వీసా నుండి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కి, ఆ తర్వాత హెచ్-1బీ వీసాకి మారి, చివరకు సుదీర్ఘ గ్రీన్ కార్డ్ క్యూలో చేరుతుంటారు. ఈ చట్టం అందుబాటులోకి వస్తే, అర్హత కలిగిన ప్రతిభావంతులైన నిపుణులు సులువుగా స్థిరపడేందుకు ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుంది.
అయితే, ఈ బిల్లు ద్వారా హెచ్-1బీ వీసాదారులందరికీ ఆటోమేటిక్‌గా గ్రీన్ కార్డులు లభించవని ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దరఖాస్తుదారులు సవరించిన రిజిస్ట్రీ నిబంధనల ప్రకారం కనీస నివాస కాల పరిమితితో పాటు ఇతర ఐడి, లీగల్ షరతులను తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంటుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఇమ్మిగ్రేషన్ విధానాలను విమర్శించిన సెనేటర్ పాడిల్లా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు అపార సేవలు అందిస్తున్న వలసదారులకు న్యాయమైన మార్గాన్ని చూపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ బిల్లుకు సెనేట్ డెమోక్రటిక్ విప్ డిక్ డర్బిన్‌తో పాటు పలువురు సెనేటర్లు, 30కి పైగా ప్రముఖ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన (బిల్లు) దశలోనే ఉంది. ఇది చట్టంగా మారి అమల్లోకి రావాలంటే ముందుగా అమెరికా సెనేట్, ఆపై ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొంది, ఆ తర్వాత దేశ అధ్యక్షుడి ఆమోదముద్ర (సంతకం) పొందాల్సి ఉంటుంది. అంతవరకు ప్రస్తుత గ్రీన్ కార్డ్ ప్రక్రియలోనే ఎలాంటి తక్షణ మార్పులు ఉండవు.
Also Read : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ సైన్యం క్రూరత్వం: కాల్పుల్లో 20 మంది కశ్మీరీల ప్రాణాలు బలి









