
US Iran War : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్‌లోని కీలక ఓడరేవులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ భారీ ఎత్తున వైమానిక దాడులకు తెగబడింది. ముఖ్యంగా వ్యూహాత్మక బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీతో పాటు పలు తీరప్రాంత కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకల ద్వారా ఏకధాటిగా ఏడు గంటల పాటు బాంబుల వర్షం కురిపించాయి. ఈ భీకర దాడుల్లో సుమారు 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా జరిపిన ఈ మెరుపు దాడులకు ఇరాన్ సైన్యం కూడా అంతే వేగంగా ప్రతిస్పందించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పక్కనే ఉన్న కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలలో సైరన్లు మోగించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను అమెరికా కూటమి వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అటు యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై కూడా ఇరాన్ క్రూయిజ్ మిస్సైళ్లతో దాడి చేసింది.
Also Read : అమెరికాలో మారనున్న కాలమానం: ‘డేలైట్ సేవింగ్ టైమ్’ను శాశ్వతం చేస్తూ బిల్లుకు ఆమోదం!
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ వరుసగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు దిగడమే అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వారం వ్యవధిలో ఇరాన్ ఏడు వాణిజ్య నౌకలపై దాడులు చేసి, ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వలను, నౌకాదళ సామర్థ్యాలను దెబ్బతీసేందుకే ఈ దాడులు చేసినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా రద్దయింది.
ఈ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చుట్టూ ఉన్న సముద్ర దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేశారు. అయితే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ కోసం గతంలో ప్రకటించిన 20 శాతం టోల్ విధింపు నిర్ణయాన్ని ట్రంప్ ఉపసంహరించుకున్నారు. గల్ఫ్ దేశాల పెట్టుబడులతోనే ఈ సైనిక ఖర్చులను భర్తీ చేస్తామని, తాము వాణిజ్య ఒప్పందాలకే ప్రాధాన్యత ఇస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. కాగా, అమెరికా తన దాడులను, నౌకా దిగ్బంధాన్ని పూర్తిగా ఆపేంతవరకు హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్‌జీసీ భీష్మించుకూర్చుంది. అమెరికాకు సహకరించే మిత్రదేశాల ఇంధన నౌకలను కూడా వదిలిపెట్టబోమని ఇరాన్ హెచ్చరించింది.
సైనిక దాడులతో పాటు ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా మరో వ్యూహాన్ని అమలు చేసింది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన పలు క్రిప్టో కరెన్సీ వాలెట్లను అమెరికా ప్రభుత్వం ఫ్రీజ్ (స్తంభింపజేయడం) చేసింది. దీనివల్ల ఇరాన్‌కు చెందిన దాదాపు 130 మిలియన్ డాలర్ల నిధులు నిలిచిపోయాయని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఆంక్షలు ఇరాన్ సైనిక చర్యలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికా భావిస్తోంది.
ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురు సరఫరాలో ఎక్కువ భాగం ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం, ఇంధన ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.
Also Read : ఇండియన్స్కు గుడ్ న్యూస్ : థాయ్‌లాండ్కు వీసా ఫ్రీ ఎంట్రీ!









