Gen-Z Movement : నేపాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏ జెన్-జీ (Gen-Z) యువతైతే బాలేంద్ర షా (బాలేన్ షా) ను అధికార పీఠంపై కూర్చోబెట్టిందో, అదే యువత ఇప్పుడు ఆయన పాలనా విధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆయన ప్రజావ్యతిరేక, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.ఖాట్మాండూ నగరంలో నదీతీరాల వెంబడి నివసిస్తున్న పేదలను, నిర్వాసితులను ప్రభుత్వం ఆకస్మికంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. రాబోయే వర్షాకాలంలో వరద ముప్పును నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సరైన పునరావాస ప్రణాళిక లేకుండా పేదలను అమానవీయంగా ఖాళీ చేయించడంపై జెన్-జీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్న తరుణంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు బ్యాటన్ చార్జ్ చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండూలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ముందు యువత ప్లాకార్డులతో హోరెత్తిస్తూ, పేదలపై చిత్రహింసలను తక్షణమే నిలిపివేయాలని నినాదాలు చేస్తున్నారు.ఈ నిరసనల నడుమ చోటుచేసుకున్న కొన్ని విషాదకర సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించగా, వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. పోలీసుల వేధింపులకు నిరసనగా ఒక యువకుడు తన బైక్‌కు వీల్ లాక్ వేయడంతో నిప్పంటించుకోగా, పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలినవారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఇరాన్ ‘హిట్‌లిస్ట్’: ట్రంప్, నెతన్యాహుతో సహా 13 మంది ప్రపంచ నేతలే లక్ష్యం…

గతంలో (సెప్టెంబర్ 2025) నాటి కే.పీ. శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు అవినీతికి పాల్పడిందనే ఆరోపణలతో నేపాల్ యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. ఆ సమయం లో జెన్-జీ యువతకు బాసటగా నిలిచిన బాలేన్ షా, ఆ ప్రజాస్వామ్య ఉద్యమం తెచ్చిన సానుభూతితో పార్లమెంట్‌లో ఉన్న 275 స్థానాల్లో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏకంగా 182 సీట్లు గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఇచ్చిన ప్రధాన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరడం, ఆదాయ వనరులను పెంచేలా పటిష్టమైన బడ్జెట్ లేదా ఆర్థిక విధానాలను రూపొందించకపోవడంతో యువతలో అసంతృప్తి వెల్లువెత్తింది. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తమ ఆశలను అడియాసలు చేసిందని జెన్-జీ ఆర్గనైజేషన్ తీవ్రంగా విమర్శిస్తోంది.

గతంలో (2023లో) యువత ఆత్మాహుతికి పాల్పడటం అనేది ప్రభుత్వ వైఫల్యమేనని నాటి నాయకుడిగా బాలేన్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇప్పుడు తన సొంత ప్రభుత్వ హయాంలోనే ముగ్గురు యువకులు ఆత్మాహుతికి యత్నించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా ఆయన మౌనంగా ఉండటంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఆయన తీరును ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు.నేపాల్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గగన్ కుమార్ థాపా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న సామాజిక కార్యకర్తలను, అరెస్టయిన యువతను భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో యువతలో నమ్మకాన్ని నింపడంలో, మానసిక ఆరోగ్య భద్రతను కల్పించడంలో బాలేన్ షా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనప్పటికీ, బాలేన్ షా పరిపాలన తీవ్ర నిరంకుశంగా మారుతోందని నిరసనకారులు మండిపడుతున్నారు. ప్రధాని పదవికి బాలేంద్ర షా తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఖాట్మాండూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతో ఆయన ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.యువత ఎదుర్కొంటున్న ఉపాధి, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే అర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం మరిన్ని తీవ్రరూపాలు దాలుస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జెన్-జీ మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన బాలేన్ షా, ఇప్పుడు అదే యువత నిరసన జ్వాలలను ఎలా చల్లారుస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది నేపాల్ రాజకీయంలో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Also Read : అమెరికాలో విషాదం: గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దారుణ హత్య

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.