Surveillance : ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 కోట్లకు పైగా ప్రజల కదలికలపై చైనా ప్రభుత్వం రహస్యంగా నిఘా (Surveillance) పెట్టినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ నిఘా నెట్‌వర్క్‌లో కేవలం చైనా సొంత పౌరులు మాత్రమే కాకుండా, వివిధ పనుల నిమిత్తం ఆ దేశాన్ని సందర్శించిన విదేశీయులు, విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల సమాచారం కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ విస్తుపోయే నిజాలు ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చాయి. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ ఇంటర్నెట్‌లో అన్వేషణ జరుపుతుండగా ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే అసురక్షిత పోలీస్ డాష్‌బోర్డ్‌ను గుర్తించారు. ఆ వెబ్‌సైట్‌లో తన పేరు, ఫోటో, పాస్‌పోర్ట్ నంబర్, గతంలో చైనా పర్యటనలో ఉపయోగించిన మొబైల్ నంబర్‌తో పాటు ఇతర పర్సనల్ వివరాలు కనిపించడంతో ఆయన దిగ్భ్రాంతి చెందారు.

ఆ డాష్‌బోర్డ్ పరిశీలనలో ముఖ్యంగా చైనాలోని ‘జాంగ్‌జియాకోవు’ నగరాన్ని సందర్శించిన విదేశీయుల వివరాలు పెద్ద ఎత్తున నమోదై ఉన్నట్లు తేలింది. భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్థాన్ సహా అనేక దేశాల పౌరుల సమాచారం ఇందులో లభించింది. వీటితో పాటు ‘ఫైవ్ ఐస్ అలయన్స్’ (Five Eyes Alliance) కూటమికి చెందిన దేశాల పౌరులపై ప్రత్యేక ఫోల్డర్లు నిర్వహించడం గమనార్హం.

ఈ డేటాబేస్‌లో హెబే నార్త్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వివరాలు కూడా లభించాయి. వీరిలో అత్యధికంగా భారత్, పాకిస్థాన్‌లకు చెందిన విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ ద్వారాల వద్ద అమర్చిన కెమెరాల ద్వారా సేకరించిన విజువల్స్, వారి మతం, వివాహ స్థితి, అధ్యయన రంగాలు, రోజువారీ రాకపోకల సమయాలతో సహా సమగ్రమైన ప్రొఫైల్స్ తయారు చేసినట్లు ఆధారాలు లభించాయి.

ఈ నిఘా వ్యవస్థ వ్యక్తుల రోజువారీ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. వీరందరినీ సీసీటీవీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ద్వారా రియల్-టైమ్‌లో ట్రాక్ చేస్తున్నారు. వ్యక్తులు ప్రయాణించే విమానాలు, రైళ్లు, చివరికి వారి సీటు నంబర్లు కూడా ఈ సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే, సదరు విదేశీయులు చైనా పర్యటన ముగించుకుని తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఈ డిజిటల్ నిఘా కొనసాగుతుండటం.

చైనా పోలీసు విభాగానికి రోబోటిక్స్, నిఘా పరికరాలను సరఫరా చేసే ‘ఆరిజిన్ డైనమిక్’ అనే ప్రైవేట్ సంస్థకు ఈ డేటాబేస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారా సేకరించిన బయోమెట్రిక్ , డిజిటల్ వివరాలన్నీ స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ కార్యాలయాలకు అందుబాటులో ఉంచబడ్డాయి. సాధారణ వీడియో పర్యవేక్షణ నుంచి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సమగ్ర డేటాబేస్ వైపు చైనా అడుగులు వేస్తోందని ఇది స్పష్టం చేస్తోంది.

చైనాలో ఈ స్థాయి నిఘా పెరగడానికి 2019లో హాంకాంగ్‌లో చోటుచేసుకున్న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఆందోళనల తర్వాత ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టాలను కఠినతరం చేస్తూ నిఘా వ్యవస్థను విస్తరించింది. ఇందులో భాగంగానే సొంత ప్రజలతో పాటు వారి విదేశీ భాగస్వాములు, ప్రతినిధులు , విదేశీ జర్నలిస్టులపై కూడా నిరంతరం కన్నేసి ఉంచే విధానాన్ని అమలులోకి తెచ్చింది.

చైనా ఇప్పటికే అమలు చేస్తున్న ‘స్కైనెట్’ (Skynet) ‘షార్ప్ ఐస్’ (Sharp Eyes) వంటి భౌతిక కెమెరా నెట్‌వర్క్‌ల సహాయంతో ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కెమెరా వ్యవస్థలకు అధునాతన ఏఐ సాంకేతికతను జత చేసి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించడం ద్వారా ఒక భారీ నిఘా పర్యావరణ వ్యవస్థను (Surveillance Ecosystem) రూపొందించారు. ఇది ప్రైవేట్, పబ్లిక్, బయోమెట్రిక్ డేటాను ఒక్క చోట చేర్చుతుంది.

ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం అంతా మే నెలలో అకస్మాత్తుగా ఇంటర్నెట్ నుంచి అదృశ్యమైంది. అయితే, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ ఆ డేటా తొలగించడానికంటే ముందే 12,000కి పైగా డేటా లాగ్‌లు, 700 మంది విదేశీ నివాసితులు, 300 మందికి పైగా జర్నలిస్టుల ప్రొఫైల్స్ వివరాలను డౌన్‌లోడ్ చేయడంతో ఈ గ్లోబల్ నిఘా వ్యవహారం బయటపడింది.

ఈ ఉదంతంపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే, మానవ హక్కుల పరిశోధకులు ,అంతర్జాతీయ నిపుణులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో పోలీసు యంత్రాంగానికి అపరిమితమైన అధికారాలు ఉండటం, పారదర్శకత లోపించడం వల్ల విదేశీయులు, విద్యార్థులు అకారణంగా నిఘా నిழలంలోకి వెళ్తున్నారని, ఇది వ్యక్తిగత గోప్యతకు, అంతర్జాతీయ హక్కులకు తీవ్ర విఘాతమని హెచ్చరిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.