Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ -ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని పాకిస్థాన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అవినీతి ఆరోపణలపై  అరెస్ట్‌ అయి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఆయన కన్నుమూసినట్లు వార్తలు వెలువడటం కలకలం రేపింది.  అమెరికాలో ఉంటున్న పాకిస్తానీ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌  చేయడంతో పాక్ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. జర్నలిస్ట్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం పలించలేదు. దీంతో ఆయన మరణించారనే వాదనకు బలం చేకూరినట్లయింది. అయితే ఆ జర్నలిస్ట్‌ తన పోస్ట్‌లో రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు తెలిపిన వివరాలను ఊటంకిస్తూ ఆయన ఈ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉండకపోవచ్చని భావిస్తు్న్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ముగ్గురు స్వయంగా చూసి నిర్ధారణకు రాలేదన్న విషయాన్నికూడా ఆయన స్పష్టం చేశారు.

అయితే గత కొంతకాలంగా జైల్లో ఉంటున్న ఇమ్రాన్‌ఖాన్‌ ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు, వ్యక్తిగత వైద్యులను అధికారులు అనుమతించడం లేదు. దీంతో అనుమానాలను మరింత పెంచుతోంది. జైలులో ఆయన పరిస్థితిపై ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పీటీఐ డిమాండ్ చేస్తూ వస్తుంది.

కాగా, ఇమ్రాన్‌ ఖాన్ ను కలిసేందుకు అనుమతించకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేపడుతామని పీటీఐ  ఈ సందర్భంగా హెచ్చరించింది.  ఆ పార్టీ నేతలు ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సోహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 లక్షల మంది ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ యువత ఆగ్రహంతో ఉందని, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తే వారిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆయన సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సందర్భంలో  పీటీఐ సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు మార్చ్‌ను ప్రకటించడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, అడియాలా జైలు వద్ద నిరసన తెలుపుతామని సీటీఐ నేతలు ప్రకటించారు.

Also Read : ఓడిపోయిన ట్రంప్.. ఇరాన్‌తో యుద్దం క్లోజ్..!

మునీర్‌తో విభేదాలే కారణం..

ఇమ్రాన్ ఖాన్ గత మూడేండ్లుగా అంటే 2023 ఆగస్టు 5 నుంచి జైలులో ఉంటున్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆయనకు కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఇదే కేసులో 2025 జనవరిలో ఏడేళ్ల శిక్ష పడింది. అయితే ఇద్దరూ తమ శిక్షలను సవాలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మధ్య ఉన్న విభేదాలే ఆయనను జైలుకు తీసుకువచ్చాయనే వాదన సాగుతోంది. గతంలో తనను కాదని వేరే వ్యక్తి కి ఇమ్రాన్ ఖాన్ ప్రాధాన్యం ఇవ్వడంతో మునీర్ కోపం పెంచుకున్నాడనే ప్రచారం సాగుతోంది. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం  ప్రవేశపెట్టడంతో ప్రధాని పదవి కోల్పోయిన ఆయన  సైనిక వ్యవస్థపై బహిరంగంగా విమర్శలు మరింత పెంచుతూ వచ్చారు.  దీంతో 2023 మే 9 ఘటనల తర్వాత పీటీఐపై సైన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్‌ చేసి జైలుకు పంపాయి.

Also Read : ఒక్కటైన సౌదీ, పాక్, తుర్కియే.. భారత్‌కు తీవ్ర ముప్పు..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.