Cyber Crimes
Cyber Crimes

Cyber Scam : ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను అంతం చేసేందుకు మయన్మార్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన ‘యాంటీ ఆన్‌లైన్ స్కామ్ బిల్లు’కు ఆ దేశ చట్టసభ ఆమోదముద్ర వేసింది. ఈ నూతన చట్టం ప్రకారం సైబర్ నేరాల్లో దోషులుగా తేలిన వారికి నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష విధించేలా నిబంధనలను పొందుపరిచారు. రాజధాని నేపిడాలో నిర్వహించిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో స్పీకర్ ఆంగ్ లిన్ ద్వే ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

కేవలం ఆర్థిక మోసాలకే కాకుండా, ఆన్‌లైన్ మోసాల కేంద్రాలలో ప్రజలను అక్రమంగా బంధించడం, బలవంతంగా పనిచేయించడం, శారీరక, మానసిక హింసకు గురిచేయడం వంటి చర్యలను ఈ చట్టం తీవ్ర నేరాలుగా పరిగణిస్తుంది. సైబర్ ముఠాల వేధింపులు లేదా నిర్బంధం కారణంగా బాధితులు మరణిస్తే, బాధ్యులైన నిందితులకు ఖచ్చితంగా మరణశిక్షే విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ కరెన్సీ (క్రిప్టో) స్కామ్‌లు నడిపే వారికి, ఈ కేంద్రాలను నిర్వహించే ప్రధాన ముఠా నాయకులకు గరిష్టంగా జీవిత ఖైదు పడేలా స్పష్టమైన నిబంధనలు తీర్చిదిద్దారు.

బాధితులలో అత్యధికులు విదేశాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగ యువతేనని అనేక విచారణల్లో వెల్లడైంది. మెరుగైన ఐటీ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాల పేరిట సోషల్ మీడియా ప్రకటనల ద్వారా విదేశీయులను ఆకర్షించి మయన్మార్‌కు రప్పిస్తున్నారు. వారు ఇక్కడకు చేరుకోగానే ప్రయాణ పత్రాలు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, బందీలుగా మార్చి తమ ఇష్టానికి విరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను బురిడీ కొట్టించే సైబర్ మోసాల్లో పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు విదేశీ దౌత్య కార్యాలయాలకు విస్తృతంగా ఫిర్యాదులు అందాయి.

ఇటీవల కాలంలో సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులను మయన్మార్‌కు తరలించిన సైబర్ ముఠాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్‌పోర్టులను గుంజుకుని ఒక కంపౌండ్‌లో నిర్బంధించి, డేటింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరిట నేరాలు చేయాలని వేధించారు. ఈ విషయాన్ని బాధితులు రహస్యంగా తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, వారు జులై 17న భారత కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అధికారులు దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేశారు.

Also Read : ఇండియన్స్‌కు ఊరట.. అమెరికా గ్రీన్ కార్డ్ బిల్లులో కీలక ప్రతిపాదనలు..!

మయన్మార్‌లో 2021లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి సైనిక దళాలు అధికారాన్ని పిలకజిక్కించుకున్నాయి. ఆ తర్వాత చోటుచేసుకున్న అంతర్యుద్ధం, దేశీయ అస్థిరతల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో సైబర్ స్కామ్ నెట్‌వర్క్‌లు అడ్డూఅదుపు లేకుండా విస్తరించాయి. ఉద్యోగాల ఆశతో వచ్చిన విదేశీయులను కంబౌండ్లలో బంధించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ సైబర్ నేరాలకు కేంద్రబిందువుగా మారింది.

మయన్మార్ కేంద్రంగా జరుగుతున్న ఆర్థిక మోసాలు, అక్రమ నిధుల మళ్లింపుపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) వంటి అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కేంద్రాల ద్వారా సేకరిస్తున్న నల్లధనం ఉగ్రవాదానికి, అక్రమ ఆయుధ వ్యాపారానికి మళ్లుతోందని హెచ్చరికలు జారీ అయ్యాయి. విదేశీ ప్రభుత్వాల నుండి వస్తున్న దౌత్యపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో సైబర్ రంగాన్ని నియంత్రించక తప్పనిసరి పరిస్థితి సైనిక ప్రభుత్వానికి ఏర్పడింది.

సైనిక మాజీ అధిపతి మిన్ ఆంగ్ లైంగ్ నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఆమోదించిన తొలి కీలక చట్టం ఇదే కావడం గమనార్హం. ప్రతిపక్షాలు, సూకీ పార్టీ దూరంగా ఉన్న ఇటీవల వివాదాస్పద ఎన్నికల అనంతరం కొలువుదీరిన ఈ పార్లమెంట్, అంతర్జాతీయంగా పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందేందుకు ఈ చట్టాన్ని వేగంగా ఆమోదించింది. నిరంతరం వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు, తమ దేశం సైబర్ నేరగాళ్లకు స్వర్గధామం కాదని ప్రపంచానికి చాటేందుకు ఈ కఠిన నిబంధనలను పొందుపరిచారు.

పార్లమెంట్ మరణశిక్ష నిబంధనతో చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ, దాన్ని ఎంతవరకు సమర్థవంతంగా అమలు చేస్తారనే దానిపై అంతర్జాతీయ సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సరిహద్దుల్లోని రెబెల్ గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఈ స్కామ్ సెంటర్లు నడుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ, ఈ కఠిన చట్టం వల్ల మయన్మార్ గుండా సాగుతున్న అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు, ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలకు కొంతవరకు చెక్ పడుతుందని, చిక్కుకున్న విదేశీయుల విడుదలకు బాటలు తవ్వుతుందని భావిస్తున్నారు.

Also Read : అమెరికాలో తీవ్ర విషాదం… తెలంగాణ మహిళ మృతి!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.