Explainer: ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన దేశాల్లో ఒకటైన జపాన్ తన గుర్తింపును మార్చుకోబోతోంది. ఇన్నాళ్లూ దేశానికి ఏకైక రాజధానిగా, కేంద్ర బిందువుగా ఉన్న టోక్యో నగరం ఇకపై ఒంటరిగా ఆ హోదాను పంచుకోదు. తీవ్ర భూకంపాలు, ప్రకృతి విపత్తుల భయంతో జపాన్ పార్లమెంట్ దేశానికి ‘రెండో రాజధాని’ (బ్యాకప్ రాజధాని)ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక చారిత్రక చట్టాన్ని ఆమోదించింది. ఎగువ సభలో అత్యల్ప మెజారిటీతో ఈ బిల్లు నెగ్గడం గమనార్హం.

భూకంప శాస్త్రవేత్తలు, బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. రాబోయే 30 ఏళ్లలో టోక్యోలో 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భారీ భూకంపం సంభవించే అవకాశం 70 శాతం వరకు ఉంది. ఒకవేళ అదే జరిగితే, టోక్యో నగరం క్షణాల్లో శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది. ప్రధాని కార్యాలయం, పార్లమెంట్,దేశం యొక్క మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోతాయి. ఈ విధ్వంసం నుండి దేశాన్ని, పరిపాలనను కాపాడుకోవడానికే ప్రధాని తకైచి ప్రభుత్వం ఈ మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసింది.

కేవలం భూకంప భయమే కాకుండా, టోక్యోలో విపరీతంగా పెరుగుతున్న జనాభా ఒత్తిడి కూడా ఈ నిర్ణయానికి ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం జపాన్ మొత్తం జనాభాలో 30 శాతం మంది ఒక్క టోక్యోలోనే నివసిస్తున్నారు. దేశ ఆదాయంలో ఐదవ వంతు ఈ ఒక్క నగరం నుంచే వస్తోంది. అధికారం, సంపద ఒక్కచోటే కేంద్రీకృతం కాకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండో రాజధానిగా ఎంపికయ్యే నగరంలో బిలియన్ల కొద్దీ కొత్త పెట్టుబడులు వస్తాయి, ఇది ఆ ప్రాంత రూపురేఖలనే మార్చేస్తుంది.

ఈ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వెంటనే, రెండో రాజధాని హోదా కోసం జపాన్‌లోని అనేక అభివృద్ధి చెందిన ప్రాంతాల మధ్య పోటీ మొదలైంది. చట్టం ప్రకారం.. భూకంపాల నుండి సురక్షితంగా ఉంటూ, ప్రభుత్వం నడపగల సామర్థ్యం ఉన్న నగరానికే ఈ అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం ఈ రేసులో ఓసాకా, నాగోయా (ఐచి ప్రొవిన్స్), ఫుకుఓకా, సప్పోరో నగరాలు ముందు వరుసలో ఉన్నాయి.

Also Read : ఐరోపాను వణికిస్తున్న కార్చిచ్చులు: ప్రాన్స్ రక్షణ రంగానికి ముప్పు, స్పెయిన్‌లో తీవ్ర విధ్వంసం

టోక్యో తర్వాత జపాన్‌లో అత్యంత పెద్దది , శక్తివంతమైనది ఓసాకా నగరం. శతాబ్దాలుగా ఇది దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది, అందుకే రెండో రాజధాని రేసులో దీనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే నాగోయా, ఫుకుఓకా నగరాల గవర్నర్లు, స్థానిక వ్యాపారవేత్తలు కూడా తమ నగరాలే రాజధానిగా ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని బలంగా వాదిస్తున్నారు.

మరొక ప్రధాన నగరమైన సప్పోరో భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ఈ నగరం టోక్యోకు చాలా దూరంలో ఉంది. కాబట్టి, భవిష్యత్తులో టోక్యోలో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పటికీ, సప్పోరో సంపూర్ణ సురక్షితంగా ఉంటుందని, తద్వారా దేశ పరిపాలన ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతుందని సప్పోరో వర్గాలు చెబుతున్నాయి. రెండో రాజధానిగా ఓసాకా నగరం రేసులో ముందున్నప్పటికీ, అక్కడ కూడా ఒక పెద్ద ముప్పు పొంచి ఉందని జపనీస్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘నాంకాయ్ ట్రఫ్’ (Nankai Trough) ప్రాంతంలో వచ్చే అవకాశం ఉన్న ఒక వినాశకరమైన భూకంపం కారణంగా ఓసాకా నగరంలోని మూడో వంతు భాగం నీట మునిగిపోయే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ కొత్త చట్టం జపాన్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి కూడా దారితీసింది. ప్రధాని సనాయ్ తకైచి తన కుర్చీని కాపాడుకోవడానికి కూటమి భాగస్వామి అయిన ‘జపాన్ ఇన్నోవేషన్ పార్టీ’ (JIP) ఒత్తిడికి లొంగిపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓసాకా నగరం JIPకి బలమైన కోట కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కొత్త నగరానికి ఎప్పుడు, ఎలా తరలిస్తారనేది ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ, ఈ నిర్ణయం టోక్యో నగర ఆధిపత్యాన్ని దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.

Also Read : టన్నుల కొద్ది బంగారం కొంటున్న చైనా.. ట్రంప్ కు షాకిచ్చే వ్యూహం ఇదేనా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.