PoK : అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ (The New York Times) ప్రచురించిన ఒక వార్తా కథనంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలో జరుగుతున్న అలజడులపై రాసిన ఆ కథనంలో ఆ ప్రాంతాన్ని ‘పాకిస్థానీ కశ్మీర్’ అని సంబోధించడం తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఘాటుగా స్పందించింది.

ఈ విషయమై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది. “పాకిస్థానీ కశ్మీర్ అనేదే లేదు, ఉన్నదల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) మాత్రమే” అని స్పష్టం చేస్తూ న్యూయార్క్ టైమ్స్ పెట్టిన అసత్య శీర్షికను పూర్తిగా ఖండించింది.

భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని తేల్చిచెప్పింది. ఆ ప్రాంతాల్లోని కొన్ని భూభాగాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకోవడమే కాకుండా, అక్కడి ప్రజలపై నిరంతరం హింసకు పాల్పడుతోందని మండిపడింది.

మరోవైపు, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎన్నికల సందర్భంగా ఆందోళనకారులు, భద్రతాదళాల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షాలు, పౌరులపై పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన తీవ్రమైన కాల్పుల్లో ఇప్పటివరకు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

Also Read : టోక్యో వద్దు.. రాజధాని మార్చుకుంటున్న జపాన్.. ఎందుకో తెలుసా?

అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన ఆంక్షలు విధించింది. నిరసనకారుల అంత్యక్రియలను ఊరేగింపుగా తీసుకెళ్లడంపై నిషేధం విధింఛగా, కాల్పుల్లో మరణించిన తమ వారి మృతదేహాలను కూడా భద్రతా దళాలు కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఈ భారీ నిరసనలకు ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ నాయకత్వం వహిస్తోంది. ఊహించని రీతిలో పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, తీవ్ర పాలనాపరమైన సమస్యలు, పాక్ ప్రభుత్వం చూపిస్తున్న రాజకీయ వివక్షకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు.

PoKలో జరుగుతున్న ఈ పరిణామాలపై, అక్కడి ఎన్నికలపై భారత్ ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహిస్తున్న నామమాత్రపు ఎన్నికలు కేవలం మానవ హక్కుల ఉల్లంఘనలను, తమ అక్రమ ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ ఆడుతున్న కపట నాటకాల్లో భాగమేనని భారత్ దుయ్యబట్టింది.

కాగా, న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ కూడా స్పందిస్తూ, బాధితుల మరణాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అయితే, ప్రాంతీయ వాస్తవాలను వక్రీకరించేలా శీర్షికలు పెట్టడాన్ని భారత్ దౌత్యపరంగా గట్టిగా హెచ్చరిస్తూ తమ భూభాగంపై సార్వభౌమాధికారాన్ని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది.

Also Read : ఇరాన్ పై బాంబుల వర్షం… క్షిపణి దాడులతో వణికిపోతున్న టెహ్రాన్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.