
Pakistan Cockroach Party : భారత్‌లో వార్తల్లో నిలిచిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తరహాలోనే, ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా ‘కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్’ (CPP) పేరుతో ఒక కొత్త ఆన్‌లైన్ రాజకీయ సమూహం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వేగంగా ఆదరణ పొందుతున్న ఈ గ్రూప్‌కు ఇన్స్టాగ్రామ్‌లో ఇప్పటికే 1.12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తమను తాము యువత, సామాన్య పౌరుల ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఈ వినూత్న సమూహం.. దేశంలో అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది.
పాకిస్తాన్‌లో సరికొత్త చర్చకు తెరలేపిన ఈ ‘కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్’ను న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తున్న సల్మాన్ తరార్ అనే యువకుడు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం, ఈ ఖాతాను మే నెలలో కెనడా నుండి నిర్వహిస్తున్నట్లుగా క్రియేట్ చేయగా, ఇటీవలే దీనికి వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) కూడా లభించింది. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ఉద్యమాన్ని నిర్మిస్తూ నిరసన తెలియజేయడం ఇప్పుడు పాకిస్తాన్ పాలక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పొలిటికల్ గ్రూప్ పాకిస్తాన్‌లో మెరుగైన పరిపాలన, పారదర్శక రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తోంది. పాకిస్తాన్ అనేది కేవలం అవినీతి మాఫియాలది కాదని, అది అక్కడ నివసించే సామాన్య ప్రజలదని స్పష్టం చేస్తోంది. తమ పోస్టులు, డిమాండ్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read : అమెరికాలో క్షిపణి నిల్వల సంక్షోభం…. ఒత్తిడిలో వాయు రక్షణ వ్యవస్థ ?
ఈ పార్టీ తన మేనిఫెస్టోలో అనేక కీలకమైన ప్రజా సమస్యలను పొందుపరిచింది. అందులో ముఖ్యంగా అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడం, కుటుంబ రాజకీయాలు ,వీఐపీ సంస్కృతిని వ్యతిరేకించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యారంగంలో సంస్కరణలు తేవడం, నిరంతరం వేధిస్తున్న విద్యుత్ (శక్తి) సంక్షోభం, తీవ్ర నీటి ఎద్దడి సమస్యల పరిష్కారంతో పాటు దేశంలో ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం వంటి అంశాలను పొందుపరిచారు.
కేవలం పాకిస్తాన్ సమస్యలే కాకుండా, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లో జరుగుతున్న అణచివేత, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఈ గ్రూప్ సోషల్ మీడియా వేదికగా నిరంతరం స్పందిస్తోంది. అంతేకాకుండా, ఈ ఆన్‌లైన్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ సంస్థలోని వివిధ రాజకీయ, సంస్థాగత పదవులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుండడం గమనార్హం.
భారత్‌లో CJP ప్రచారం జరుగుతున్న సమయంలో పాకిస్తానీ యువత స్పందిస్తూ.. భారత్‌లో ప్రజాస్వామ్య వాతావరణం ఉండటం వల్లే ఇలాంటి వ్యంగ్యాత్మక, వినూత్న నిరసనలకు అవకాశం లభిస్తుందని, పాకిస్తాన్‌లో ఇలాంటి ప్రయత్నాలు చేయడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడ నిరసన తెలిపే వారికి చట్టపరమైన లేదా ఇతర తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతున్న ఈ కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్‌కు నిజమైన ప్రజాదరణ ఉందో లేదో, భవిష్యత్తులో ఇది పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా ఎదుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read : మైక్రోసాఫ్ట్ సరికొత్త చరిత్ర.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ









