Ukrainian Drone Strikes : రష్యా, ఉక్రెయిన్ల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. రెండు దేశాలు పట్టు విడుపులు లేకుండా దాడులు చేసుకుంటుండటంతో రెండు దేశాల్లో విపరీతమైన ప్రాణ, ధన నష్టం వాటిల్లుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో రష్యాలో అతిపెద్ద ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ అయిన ‘వైల్డ్‌బెర్రీస్‌’కు చెందిన పలు గిడ్డంగులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ దాడితో సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

Also Read : జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన పోస్ట్‌…ఆందోళనలో పీటీఐ

ఉక్రెయిన్ గత కొంతకాలంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన కీలక సరఫరా, నిల్వ కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయి. రష్యా వ్యాప్తంగా ఉన్న సంస్థ లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే వైల్డ్‌బెర్రీస్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కాగా, ఉక్రెయిన్‌ దాడుల కారణంగా పలు గిడ్డంగుల్లో నిల్వ ఉన్న వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ సరుకును నష్టపోయారు. ఆర్డర్ల పంపిణీలో జాప్యం ఏర్పడటంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సంస్థ ప్రకటించింది.

అయితే ఈ వైల్డ్‌బెర్రీస్‌ గిడ్డంగుల పై దాడులు చేయడానికి ప్రధాన కారణం వైల్డ్‌బెర్రీస్‌ గిడ్డంగులు రష్యా యుద్ధానికి అవసరమైన వస్తువుల సరఫరాలో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వాటిని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకుంది. అయితే రష్యా ఈ వాదనను కొట్టిపారేస్తోంది. ఇవి పౌర వాణిజ్య మౌలిక వసతులని, వాటిపై దాడులు చేయడం వల్ల సాధారణ వ్యాపారులు, వినియోగదారులు నష్టపోతున్నారని స్పష్టం చేసింది.

మరోవైపు క్షిపణులు, డ్రోన్లు, గ్లైడ్‌ బాంబులతో ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 10 మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందారని, 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా.. ఉత్తర కొరియా నుంచి రష్యా సైనిక సహాయాన్ని పొందుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. రష్యా బలగాలకు ఉత్తర కొరియా నుంచి క్షిపణులు సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు.

Also Read : సీక్రెట్ సర్వీస్ చెప్పినట్లే వింటా: విమానం మార్పుపై ట్రంప్ స్పష్టత

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.