Indians : విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ దాడుల సంఖ్య దాదాపు ఏడు రెట్లు పెరిగింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2021వ సంవత్సరంలో విదేశాల్లో భారతీయులపై కేవలం 15 దాడుల ఘటనలు మాత్రమే నమోదవగా, 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 104కి చేరుకుంది. మొత్తం 36 దేశాల నుంచి సేకరించిన ఈ సమాచారం విదేశాల్లో భారత పౌరుల భద్రతపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

గత ఐదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులపై మొత్తం 302 దాడులు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఏటికేడు ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2021లో 15 కేసులు నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 31కి పెరిగింది. ఆ తర్వాత 2023లో 67 ఘటనలు, 2024లో 85 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక 2025 వచ్చేసరికి ఈ సంఖ్య 104కి చేరడంతో పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, కెనడా, ఐర్లాండ్ వంటి దేశాల్లోనే ఎక్కువ దాడులు జరిగినట్లు ఈ డేటా చూపిస్తోంది.

Also Read : ట్రంప్ సంచలన ప్రకటన: హోర్ముజ్ జలసంధి అమెరికాదే!

దేశాల వారీగా వివరాలను పరిశీలిస్తే, అత్యధికంగా అమెరికాలో ఐదేళ్లలో 33 దాడుల కేసులు నమోదయ్యాయి. 2021లో ఒకే ఒక్క కేసు నమోదు కాగా, 2022లో 6, 2023లో 1, 2024లో 11 నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 14కి పెరిగింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం 32 ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడ 2021లో 3, 2022లో 4, 2023లో 7, 2024లో 6 జరగ్గా, 2025లో 12 దాడులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో 31 దాడులు, కెనడాలో 30 దాడులు జరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

మరోవైపు ఐర్లాండ్, మాలీ దేశాల్లో నమోదైన కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఐర్లాండ్‌లో మొత్తం 24 కేసులు నమోదు కాగా, గత రెండేళ్లలో అక్కడ దాడులు వేగంగా పెరిగాయి. 2021, 2022లలో ఒక్కో కేసు మాత్రమే నమోదు కాగా, 2023లో 5, 2024లో 7, అలాగే 2025లో 10 కేసులు నమోదయ్యాయి. రష్యాలో 23, జర్మనీలో 19 దాడుల ఘటనలు జరిగాయి. అంతకంటే ఆశ్చర్యకరంగా మాలీ దేశంలో 2021 నుంచి 2024 వరకు ఒక్క దాడి కూడా నమోదు కాలేదు. కానీ ఒక్క 2025లోనే ఏకంగా 11 దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో స్పందించారు. విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతకే భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. భారతీయులపై ఏవైనా దాడులు జరిగితే వెంటనే ఆయా దేశాల స్థానిక అధికారులతో మాట్లాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

Also Read : నేను హఫీజ్‌కు బానిసని.. ఉగ్రవాదులతో పాక్ మాజీ మంత్రి

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.