
Silicon Andhra : అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిలికానాంధ్ర రజతోత్సవ కార్యక్రమాలు -జూలై 31, ఆగస్టు 1, 2026 తేదీలలో కాలిఫోర్నియాలోని ఓక్ల్యాండ్ ఎరీనాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పది వేలకు పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత అమృతవర్షిణి, లయ అమృతవర్షిణి, శతక శంఖారావం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను కార్యక్రమం సొంతం చేసుకుంది. ఆంధ్ర నాట్య శైలిలో కుంభ హారతి, వినాయక కౌతం ప్రదర్శనలు, యు తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే నాటక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ సిలికానాంధ్ర ఆవిర్భావం, సాధించిన విజయాల గురించి వివరించారు.
“ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, ఒకే ఒక్క విత్తనం పడటంతో మన ప్రయాణం మొదలైంది. ఆగస్టు 4, 2001న లివర్మోర్ శివ విష్ణు ఆలయంలో శ్రీ గరికపాటి నరసింహారావు గారి చారిత్రాత్మక అష్టావధానంతో సిలికానాంధ్ర ప్రయాణం ప్రారంభమైందన్నారు. నేడు, మన రజతోత్సవాల (సిల్వర్ జూబ్లీ) శోభలో మనం నిలబడి ఉన్న తరుణంలో, ఆనాడు నాటిన ఆ చిన్న విత్తనం నేడు ఖండాలు దాటి మహావృక్షంగా విస్తరించింది. మన అద్భుతమైన భారతీయ సంస్కృతి, తెలుగు భాష, సంప్రదాయాలు తరతరాలకు అందేలా కాపాడే ఒక ప్రపంచ వేదికగా ఇది నిలిచిందని తెలిపారు.
Also Read : బలూచిస్తాన్ స్వాతంత్య్ర వేడుకలు.. మునీర్ సైన్యం రాక్షసకాండ, ఒక్క రాత్రిలో 28 మంది హత్య

సిలికాన్ఆంధ్ర ఎప్పుడూ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని; అది ఒక ప్రపంచ కుటుంబం; అంకితభావమైన సిద్ధాంతం, చెక్కుచెదరని దూరదృష్టితో నడిచే ఒక ఉద్యమంగా వక్తలు పేర్కొన్నారు. మన ఆలోచనలను ఉన్నతం చేసుకోవడం, మన పరిమితులను జయించడమే అసలైన పునాది. ‘వసుధైక కుటుంబం’ అనే పవిత్ర భావనతో మనం ఒకటిగా ఉన్నామని, ఈ ప్రగతిశీల ఆలోచనే మన అసలైన ఆస్తి అని వారు వివరించారు. ప్రపంచ హద్దులను చెరిపేయడానికి, మన కన్నతల్లి లాంటి తెలుగు భాషను గౌరవించడానికి, ఈ రజతోత్సవాలలో సాధించిన మరో మూడు చారిత్రాత్మక మైలురాళ్లతో కలిపి మొత్తం డజనుకు పైగా గిన్నిస్ ప్రపంచ రికార్డులను గర్వంగా సొంతం చేసుకోవడానికి వసుధైక కుటుంబం అనే ఆలోచనే మనకు గొప్ప శక్తినిచ్చిందన్నారు.
ఓక్ల్యాండ్ ఎరీనాలో జరిగిన బ్రహ్మాండమైన జనసందోహం మధ్య రజోతోత్సవ వేడుకల అపూర్వ విజయాలు ఒక్కటే నిరూపిస్తున్నాయన్నారు. మీ విలువలు, వేర్లు, వారసత్వంపై మీకు ప్రగాఢమైన నమ్మకం ఉండి, స్పష్టమైన లక్ష్యంతో మాట్లాడినప్పుడు, ఈ ప్రపంచమంతా ఆగి మీ మాట వింటుందని నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ విజయం మీ అందరిదీ. మన వేదికలకు ప్రాణం పోసిన సాంకేతిక నిపుణుల నుండి, పూర్తి నిబద్ధతతో , కర్తవ్య భావంతో పనిచేసిన మన అద్భుతమైన స్వచ్ఛంద సేవకుల వరకు, ఈ మైలురాయిని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరే సిలికాన్ఆంధ్ర గుండెచప్పుడు అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఇప్పుడు, మనం భవిష్యత్తు వైపు చూస్తున్నాము. బాధ్యతలను భుజానకెత్తుకోవడానికి, మనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్న తరం నాయకులను గుర్తించి, తీర్చిదిద్దడమే మన అంతిమ లక్ష్యం. ఈ కోనేటిలో మన తెలుగు సంస్కృతి యొక్క తామర పూలు ఎప్పటికీ వికసిస్తూనే ఉంటాయి. సిలికానాంధ్రను నిజమైన ప్రపంచ కుటుంబంగా మలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే మరో 25 ఏళ్లకు, అంతకు మించి విజయాలు సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నామని నిర్వహకుల సగర్వంగా ప్రకటించారు. కాగా, ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని చాటి చెప్పే ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు, లలితా సంగీత విభావరి, నాటక ప్రదర్వనలు, ఆంధ్రనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వేలాది మంది తెలుగువారు భాగస్వాములు కావడం విశేషం.
Also Read : ఇస్లామిక్ నాటో ఒప్పందంలో ఏముంది? పాక్ ఏం చేయబోతుంది?









