US-Iran War
US-Iran War

US-Iran war :అమెరికా,ఇరాన్ దేశాల మధ్య హఠాత్తుగా చెలరేగిన సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చి, మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలకు ఎట్టకేలకు ఒక ఉపశమనం కలిగించే వార్త అందింది. కొన్నిరోజులుగా ఇరాన్ లక్ష్యంగా సాగిస్తున్న భారీ మిలిటరీ దాడులను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. ఉద్రిక్తతలను పక్కనపెట్టి, వివాద పరిష్కారానికి ఇరుదేశాల మధ్య సోమవారం నుంచి దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

ఇరాన్‌పై తొలుత భీకరమైన రీతిలో దాడి చేయాలని తాము భావించామని, అదే గాని జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది అత్యంత పెద్ద సైనిక చర్యగా మిగిలిపోయేదని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే మానవ నష్టాన్ని, విధ్వంసాన్ని నివారించేందుకు ఘర్షణల మార్గాన్ని పక్కనబెట్టి దౌత్య సంప్రదింపులకే మొగ్గుచూపినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ఎన్నో అమాయక ప్రాణాలను కాపాడటంతో పాటు, విధ్వంసమైన ఆస్తులను తిరిగి నిర్మించేందుకు పట్టే సుదీర్ఘ కాలాన్ని, శ్రమను ఆదా చేయవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలోని మిత్రదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తులను, ప్రపంచ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలని బలగాలను ఆదేశించినట్లు ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానంలో మీడియాతో పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని మిత్రపక్షాలు కూడా యుద్ధ ముగింపుపై ఒక అవగాహనకు వచ్చాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను తీయడం తమ ఉద్దేశం కాదని, వీలైనంత త్వరగా ఇరాన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికే తాను ఇష్టపడతానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరుదేశాల మధ్య జరగబోయే ఈ దౌత్య చర్చల్లో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘హర్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) ప్రధానాంశంగా ఉండనుంది. వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ వ్యూహాత్మక జలసంధిని పూర్తిగా తెరిపించడం, ఇరాన్ నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలకు, అణు బెదిరింపులకు శాశ్వత అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై వాషింగ్టన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఒకవేళ ఈ చర్చలు విఫలమై, ఒప్పందం ఖరారు కాకపోతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని ట్రంప్ హెచ్చరించారు.

చర్చలు సఫలమైతే, బదులుగా ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని (Naval Blockade) అమెరికా ఉపసంహరించుకునే అవకాశం ఉందని ప్రాంతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇరాన్ తన ముడిచమురును అంతర్జాతీయ మార్కెట్లకు స్వేచ్ఛగా ఎగుమతి చేసుకునేందుకు అనుమతించడం వంటి కీలక హామీలను అమెరికా ఇచ్చే యోచనలో ఉంది. పశ్చిమాసియా అంతటా శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఈ చర్చలు దోహదపడతాయని ఇరువర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు భవిష్యత్తులో పూర్వపు స్థితికి (యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు) ఎప్పటికీ చేరబోవని స్పష్టం చేశారు. అయితే, ఈ జలసంధి నిర్వహణ ,భద్రతకు సంబంధించి ఒమన్‌ దేశంతో తాము జరుపుతున్న దౌత్య చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ దౌత్య ప్రయత్నాలు వేగవంతమైన క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్ర స్థాయిలో దౌత్య సంప్రదింపులు జరిపారు. ఆయన సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా తమ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ఈ చర్చల ద్వారా స్పష్టం చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి చర్చల ప్రకటన వెలువడటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు తక్షణమే స్పందించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు (Crude Oil Prices) తగ్గుముఖం పట్టాయి. లండన్ ఐసిఈ ఎక్స్ఛేంజ్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర ఒక బ్యారెల్‌కు 82 డాలర్ల వద్ద స్థిరపడి, గ్లోబల్ ఎకానమీకి కాస్త ఊరటనిచ్చింది.

పశ్చిమాసియాలో ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య సంప్రదింపులు ప్రారంభమవుతున్నప్పటికీ, మరోవైపు గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులు ఇంకా తీవ్రంగానే కొనసాగుతున్నాయి. గాజాలోని వివిధ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన తాజా దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే సమగ్ర వ్యూహం అవసరమని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది.

మొత్తానికి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమెరికా తన మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి చర్చలకు సిద్ధపడటం అంతర్జాతీయంగా ఆశలు చిగురింపజేస్తోంది. హర్మూజ్ జలసంధి స్వేచ్ఛాయుత రవాణా, అణు నియంత్రణ,ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుదేశాలు ఒక సమగ్ర ఒప్పందానికి వస్తే తప్ప ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి,గ్లోబల్ మార్కెట్లలో స్థిరత్వం సాధ్యపడవని నిపుణులు భావిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.