
Uber Work From Home: ఆర్థిక సంస్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలన్నీ తమ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుమారు 3,300 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా కఠినతరం చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై పూర్తిగా రిమోట్గా పనిచేసే ఉద్యోగుల సంఖ్యను సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 1 శాతానికే పరిమితం చేయనున్నట్లు తెలిపింది. అంటే ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసే విధానం పూర్తిగా ముగిసినట్లే నని తెలుస్తోంది.
ఉబెర్ సంస్థ తన ఉద్యోగుల్లో దాదాపు 3,300 మందిని తొలగిస్తున్నట్టు సెప్టెంబర్ 2న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం కార్పొరేట్ ఉద్యోగుల్లో సుమారు 10 శాతానికి సమానం. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉబెర్ సంస్థ చేపట్టిన అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు ఇదే కావడం గమనార్హం. సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, చిన్న టీమ్లను విలీనం చేయడం, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం అనేవి తమ ప్రధాన లక్ష్యాలని, వాటి అమలులో భాగంగా ఉద్యోగాల కోత తప్పనిసరి అయిందని సీఈఓ దారా ఖోస్రోషాహి వెల్లడించారు. మేనేజర్ల సంఖ్యను కూడా సుమారు 20 శాతం తగ్గించనున్నట్లు సంస్థ ఇప్పటికే వెల్లడించింది.
ఈ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఇదివరకే తీసుకోగా ఉబర్ తీసుకున్న మరో కీలక నిర్ణయం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సంబంధించినది. ఇప్పటికే ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పరిమితం చేయనుంది. అలాగని పూర్తిగా ఐదు రోజుల ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలనుకోవడం లేదు. సంస్థ ఇప్పటికే అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది.









