
Iran US War : కొన్ని రోజులుగా ఒకింత ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు గల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా దళాలు సంయుక్తంగా జరిపిన భారీ దాడులతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. తమ చమురు కేంద్రాలపై మిలీషియాలు డ్రోన్ దాడులకు తెగబడటంతోనే ఈ తిరుగుబాట పట్టామని సౌదీ స్పష్టం చేయగా, మిలీషియా సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంయుక్త దాడిలో 20 మంది ఫైటర్లు, ఆరుగురు ఇరాన్ సలహాదారులు ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జోర్డాన్‌లోని అమెరికా కీలక మిలిటరీ స్థావరమైన ‘మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్’ లక్ష్యంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అర్ధరాత్రి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ , జోర్డాన్ సైన్యం వెంటనే అప్రమత్తమై, ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయి. గల్ఫ్ ప్రాంతంలోని ఇతర అమెరికా స్థావరాలపై జరిగిన దాడులను కూడా తిప్పికొట్టడంతో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ మీడియాతో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన సైనిక చర్య తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. “మన శత్రువులను అత్యంత ఘోరంగా దెబ్బకొట్టబోతున్నాం, వారికి గట్టి బుద్ధి చెబుతాం” అంటూ ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
Also Read : టోక్యో వద్దు.. రాజధాని మార్చుకుంటున్న జపాన్.. ఎందుకో తెలుసా?
పశ్చిమాసియా అలజడులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సైనిక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈజిప్టులోని డమియెట్టా పోర్టులో నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన ‘వెనెర్గోస్ వింటర్’ అనే గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు కూడా వ్యాపించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ఈ ప్రాంతానికి విస్తరిస్తోంది. కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ నౌక ధ్వంసమై ఒక నావికుడు మరణించడంతో, నల్లసముద్రంలోని ఉక్రెయిన్ పోర్టుపై ప్రతీకార దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఒమన్ చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. హర్మూజ్‌ను రెండు మార్గాలుగా విభజించి, నౌకల రాకపోకలను ఉమ్మడిగా 50% చొప్పున నియంత్రిద్దామన్న ఒమన్ విజ్ఞప్తి తమకు సమ్మతం కాదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దానికి బదులుగా తమ ప్రాదేశిక జలాల్లో మాత్రమే నౌకలు ప్రయాణించేలా ఓ తాత్కాలిక ప్రణాళికను ఇరాన్ ముందుకు తెచ్చింది. శాంతి చర్చలకు ఇరాన్ నిరాకరించడం ప్రాంతీయ భద్రతను మరింత సంక్షోభంలోకి నెట్టింది.
ఈ తాజా యుద్ధ వాతావరణం, దాడుల ప్రభావం అంతర్జాతీయంగా చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కరోజులోనే ఏకంగా 3.1% పెరిగింది. అమెరికా, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్లతో కూడిన ఈ ఘర్షణల శృంఖలం మరిన్ని పొరుగు దేశాలను కూడా యుద్ధంలోకి లాగే ప్రమాదం ఉందనే ఆందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి.
Also Read : ట్రంప్ కు పాక్ వెన్నుపోటు.. సీక్రెట్ గా చైనా నుంచి ఇరాన్ కు 400 మిస్సైల్స్.. షాకింగ్ రిపోర్ట్స్!









