
Washington Wildfire : ఉత్తర అమెరికా ఖండంలో దావానలం(కార్చిచ్చు) తీవ్ర అల్లకల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన తీవ్రమైన కార్చిచ్చు (Washington Wildfire) దిశ మార్చుకుని సమీప నగరాలు, గ్రామాలపై పడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 వేర్వేరు ప్రదేశాల్లో అగ్నికీలలు ఎగసిపడుతుండగా, బలమైన ఈదురు గాలులు,అధిక ఉష్ణోగ్రతల వల్ల మంటలు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. ఈ వేసవి కాలంలో ఇప్పటివరకు దాదాపు 4,50,000 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ భూమి కాలి బూడిదైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అడవుల నుంచి జనావాసాల్లోకి చొచ్చుకొచ్చిన అగ్నికీలల ధాటికి ఇళ్లు, వ్యాపార సముదాయాలు సహా మొత్తంగా 600కు పైగా భవనాలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. వాషింగ్టన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ‘స్పోకేన్’ (Spokane) పరిసర ప్రాంతాల్లో సుమారు 2,50,000 ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి. పరిస్థితి విషమించడంతో నీటిశుద్ధి కేంద్రాలు, ఇంధన ప్లాంట్లు, సైనిక ఆసుపత్రులతో పాటు పలు నివాస ప్రాంతాల నుంచి ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు. మొత్తం తూర్పు వాషింగ్టన్ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2,30,000 మందిని అధికారులు తాత్కాలిక పునరావాస శిబిరాలకు తరలించారు.
ఈ భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి స్పోకేన్ పోలీసు అధికారులు సంచలన విషయాన్ని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా అడవికి నిప్పు పెట్టి ఈ తీవ్రమైన కార్చిచ్చుకు కారణమయ్యాడనే అనుమానంతో స్పోకేన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్ ట్రయిల్స్, ఫెయిర్‌వ్యూ, మెడోవ్యూ ప్రాంతాల్లో వేర్వేరుగా అగ్నికీలలు మొదలైనట్లు నిర్ధారించిన పోలీసులు, సదరు నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
Also Read : పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్!
WATCH: MD-87 air tanker, operated by Erickson Aero Tanker, dropping fire retardant to slow the fast-moving flames in Spokane.
A 37-year-old Spokane, Washington, resident with a previous manslaughter conviction has been arrested in connection with the largest of the region’s… pic.twitter.com/dMqpm9sHFx
— Turbine Traveller (@Turbinetraveler) August 4, 2026
వాషింగ్టన్‌లో పరిస్థితులు దయనీయంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించిన అనంతరం రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ (Bob Ferguson) రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. ప్రమాదకర రీతిలో విస్తరిస్తున్న మంటల తీవ్రత దృష్ట్యా, జాతీయ వాతావరణ కేంద్రం ప్రభావిత ప్రాంతాల్లో ‘రెడ్ ఫ్లాగ్’ (Red Flag Warning) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, సుమారు 5 కోట్ల మంది ప్రజలపై ఈ పొగ, గాలి కాలుష్యం ప్రభావం పడే ప్రమాదముందని హెచ్చరించారు.
హఠాత్తుగా విరుచుకుపడిన ఈ దావానలం వల్ల రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతి కావడంతో స్పోకేన్ .పరిసర ప్రాంతాల్లో దాదాపు 60,000 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక, దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, ఇంతటి భారీ ప్రమాదం సంభవించినప్పటికీ అధికారులు సమయానికి స్పందించి ప్రజలను ఖాళీ చేయించడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.
Also Read : 5.4 తీవ్రతతో ఈజిప్ట్‌లో భూకంపం
కార్చిచ్చును అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లకు స్థానికులు ఎగురవేస్తున్న ప్రైవేట్ డ్రోన్లు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 26 సార్లు డ్రోన్ల కారణముగా రెస్క్యూ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ అధికారులు కఠిన నిషేధం విధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు కాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రత్యేక ఫెడరల్ బలగాలతో పాటు రాష్ట్ర, స్థానిక విభాగాలకు చెందిన దాదాపు 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే బలమైన గాలి వేగం, తీవ్రమైన పొడి వాతావరణం వల్ల మంటలను నియంత్రించడం వారికి పెద్ద సవాలుగా మారింది. స్పోకేన్ నగరంలో జరిగిన ఆస్తి, మౌలిక వసతుల నష్టం తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలను మరింత వేగవంతం చేశామని స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ వెల్లడించారు.
ఉత్తర అమెరికా ఖండంలో తరచూ సంభవిస్తున్న ఈ కార్చిచ్చులకు వాతావరణ మార్పులు (Climate Change),సుదీర్ఘ అనావృష్టి పరిస్థితులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, తేమ శాతం తగ్గిపోవడం వల్ల చిన్న నిప్పురవ్వ కూడా క్షణాల్లో వందలాది ఎకరాలకు విస్తరిస్తోంది. వాషింగ్టన్ సహా పొరుగునే ఉన్న కెనడా సరిహద్దుల్లోనూ పలుచోట్ల దావానలాలు వ్యాపిస్తుండటంతో, ఇరు దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా రెస్క్యూ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.









