Madhya Pradesh :  మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్‌లోని శీతలామాత ఆలయం దగ్గర భక్తులపైకి అదుపుతప్పిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛినోర్ వైపు నుంచి ధాన్యంతో వస్తున్న ట్రక్కు కొండ దిగువకు వచ్చే వాలు రోడ్డుపై అదుపు తప్పింది. భారీ వాహనాలు వెళ్లకూడదని ఆ రోడ్డుపై ఆంక్షలు ఉన్నాయి. అయినా ట్రక్కు పోలీసుల చెక్‌పోస్టు, అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లింది. రోడ్డుపై ఉన్న భక్తులపైకి వెళ్లి, చివరకు ఆలయం గేటును, బయటి గోడను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంపై గ్వాలియర్ సీనియర్ పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారని, ఛినోర్ వైపు నుంచి వచ్చే రోడ్డుపై భారీ వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. అయినా ధాన్యంతో వచ్చిన ట్రక్కు బారికేడ్లను దాటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం తర్వాత మొత్తం 39 మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 12 మంది చనిపోయారని చెప్పారు. ఐదారు మంది పరిస్థితి విషమంగా ఉందని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Also Read : ప్రియుడితో కలిసి భర్తను హత్య.. చివరకు ఫోన్‌ చాట్‌ పట్టిచ్చింది!

ప్రమాదం గురించి సమాచారం అందగానే అంబులెన్సులు, ఇతర వాహనాలను అక్కడికి పంపించినట్లు గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ తెలిపారు. ఈ ఘటనలో 29 మంది గాయపడినట్లు ఆమె చెప్పారు. అయితే మృతుల సంఖ్యపై అధికారులు వెల్లడించిన వివరాల్లో కొంత తేడా ఉంది. తొలుత 11 మంది చనిపోయినట్లు కలెక్టర్ చెప్పగా, ఆ తర్వాత పోలీసు అధికారి 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ఆ రోడ్డుపై బారికేడ్లు, పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ ట్రక్కు లోపలికి ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ట్రక్కును పరిశీలించేందుకు ఆర్టీఓ బృందాన్ని కూడా పంపించారు. వాహనంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందా? ట్రక్కు ఎందుకు అదుపు తప్పింది? అనే విషయాలను పరిశీలిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు సరిగ్గా వైద్యం అందేలా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గాయపడిన వారికి సీటీ స్కాన్లు, ఎక్స్‌రేలు తీసి, వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ట్రక్కులో పరిమితికి మించి ధాన్యం లోడ్ చేసినట్లు తెలిపాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ట్రక్కు ఒక్కసారిగా దూసుకొచ్చి, దారిలో ఉన్న దుకాణాలు, మనుషులపైకి వెళ్లిందని చెప్పాడు. కొంతమంది అక్కడికక్కడే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో తన సోదరుడికి కూడా గాయాలయ్యాయని తెలిపాడు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.