
Bangladesh : బంగ్లాదేశ్‌లో సుమారు 35 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సీనియర్ నేత మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ విజయం సాధించినట్లు ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన దేశ 23వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మిర్జా ఫఖ్రుల్‌కు 255 ఓట్లు వచ్చాయి..ఆయనకు ప్రత్యమ్నాయంగా పోటీ చేసిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు, జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కల్నల్ (రిటైర్డ్) ఒలి అహ్మద్‌కు 88 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నసీర్ ఉద్దీన్ వెల్లడించారు.
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం 349 మంది పార్లమెంట్ సభ్యులకు అర్హత, అవకాశం ఉండగా 343 మంది ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ఆరుగురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ పార్లమెంట్ భవనం నేషనల్ సంసద్‌లో పోలింగ్ జరిగింది. BNPలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ ఇప్పుడు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టడానికి అర్హత సాధిచారు. ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. BNP తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగానే ఫఖ్రుల్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అధ్యక్షుడిగా ఎన్నికైన మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ శుక్రవారం సాయంత్రం బంగాభవన్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 7.30 గంటలకు యాక్టింగ్ స్పీకర్ కైసర్ కమాల్ ఆయనతో ప్రమాణం చేయించనున్నట్లు వార్త సంస్థలు ప్రకటించాయి.
35 ఏళ్ల తర్వాత పోటీ ఎన్నిక
బంగ్లాదేశ్ చరిత్రలో ఈ అధ్యక్ష ఎన్నికల్లో గురువారం జరిగిన పోలింగ్ చారిత్రాత్మకం అని చెప్పవచ్చు.35 ఏళ్లకు పైగా కాలంలో తొలిసారిగా అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడటం గమనార్హం.చివరిసారిగా 1991 అక్టోబర్ 8న పోటీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో BNP అభ్యర్థి అబ్దుర్ రహ్మాన్ బిశ్వాస్ 172 ఓట్లతో విజయం సాధించారు. అవామీ లీగ్ అభ్యర్థి బద్రుల్ హైదర్ చౌదరికి 92 ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన అన్ని అధ్యక్ష ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో ఉండటంతో పోలింగ్ అవసరం లేకుండానే అధ్యక్షులు ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి పార్లమెంట్‌లో BNPకు ఉన్న బలమైన సంఖ్యాబలంతో ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ విజయం ఖాయమనే అంచనాలు ముందుగానే వ్యక్తమైయ్యాయి. అధికార పక్షానికి 250 మంది ఎంపీల బలం ఉండగా, ప్రతిపక్ష కూటమికి 90 మంది సభ్యుల బలం ఉన్నట్లు బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంస్థ తెలిపింది.
ఎన్నికకు కారణమేంటి?
బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే ఆయన తన పదవీకి రాజీనామా చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరమవడంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు షహాబుద్దీన్ ప్రకటించారు. ఆయన రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఇన్నాళ్లు బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికలతో ఆ తాత్కాలిక వ్యవస్థకు ముగింపు పలికి, మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.









