తమిళనాడులో కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డీఎంకే (DMK) అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఊహించని రీతిలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన 9,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1996 తర్వాత స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడంతో రాజకీయాల్లో సంచలనం రేగింది. ఈ విజయాన్ని సవాల్ చేస్తూ ఎంకే స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కొళత్తూర్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సమయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కౌంటింగ్ యంత్రాలు (EVMs), వీవీపాట్ (VVPAT) లెక్కింపు ప్రక్రియలలో తీవ్ర లోపాలు తలెత్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ రోజున అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని, అందువల్ల కొళత్తూర్ స్థానానికి సంబంధించి సమగ్ర రీకౌంటింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు గెలుపును చెల్లకుండా ప్రకటించాలని స్టాలిన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.