
వర్షాకాలంలో వాతావరణం కూల్‌గా ఉంటుంది. అయినా కొందరికి ఇంట్లో ఉక్కపోత ఉంటుందని ఏసీ వాడుతుంటారు. అయితే ఈ సీజన్‌లో ఏసీని సరైన పద్ధతిలో వాడకపోవడం వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరగడమే కాకుండా, ఏసీలు పాడైపోవడం, అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఏసీ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
డ్రై మోడ్‌ను ఉపయోగించకపోవడం
చాలామంది వేసవికాలం లాగే వర్షాకాలంలోనూ ఏసీని సాధారణ ‘కూల్ మోడ్’లోనే నడుపుతుంటారు. వానాకాలంలో వాతావరణంలో వేడి కంటే తేమ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఏసీలోని ‘డ్రై మోడ్’ని ఆన్ చేస్తే, అది గదిలోని అదనపు తేమను పీల్చుకుని గాలిని పొడిగా, ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ మోడ్‌లో కంప్రెసర్ అవసరాన్ని బట్టి మాత్రమే నడవటం వల్ల కరెంట్ బిల్లు కూడా బాగా ఆదా అవుతుంది.
ఉష్ణోగ్రతను అతిగా తగ్గించడం
వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ, చాలామంది ఏసీ టెంపరేచర్‌ను 18 లేదా 20 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గది అతిగా చల్లబడి జలుబు, దగ్గు, కండరాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. వానాకాలంలో ఏసీ ఉష్ణోగ్రతను 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం ఉత్తమం. ఉష్ణోగ్రతను ప్రతి డిగ్రీ పెంచడం ద్వారా దాదాపు 6 శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.
ఫిల్టర్లను పరిశుభ్రంగా ఉంచకపోవడం
వర్షాకాలంలో గాలిలోని అధిక తేమ వల్ల ఏసీ ఎయిర్ ఫిల్టర్లపై దుమ్ము, ధూళితో పాటు బూజు త్వరగా చేరుతుంది. మురికి ఫిల్టర్లతో ఏసీని నడిపితే గదిలోకి సూక్ష్మజీవులు వ్యాపించి అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం అవసరం.
వోల్టేజ్ స్టెబిలైజర్ వాడకపోవడం
వానాకాలంలో ఈదురు గాలులు, వర్షాల వల్ల తరచూ విద్యుత్ కోతలు, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్లు జరుగుతుంటాయి. సరైన వోల్టేజ్ స్టెబిలైజర్ లేకపోతే ఏసీ పిసిబి లేదా కంప్రెసర్ కాలిపోయి వేలాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
సర్వీసింగ్ నిరక్ష్యం చేయడం & ఫ్యాన్ ఉపయోగించకపోవడం
వర్షాకాలం ప్రారంభానికి ముందే ఏసీని ఒకసారి సర్వీసింగ్ చేయించడం మంచిది. అలాగే ఏసీ ఆన్ చేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ వేగంతో తిప్పడం వల్ల ఏసీ ఇచ్చే డ్రై గాలి గది అంతటా సమానంగా వ్యాపించి మరింత వేగంగా ఉక్కపోతను తగ్గిస్తుంది.









