
Haryana : హర్యానాలో ఇద్దరు వివాహిత మహిళలు ఒకేసారి తమ పిల్లలతో కలిసి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ తమ నలుగురు పిల్లలను వెంట తీసుకుని ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు.. వారి వెంట సుమారు రూ.9 లక్షల విలువైన నగలు, నగదు కూడా తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇద్దరు మహిళలు పరస్పరం ప్రేమలో ఉన్నారని, చివరికి పెళ్లి కూడా చేసుకుని ఉండొచ్చని వారి భర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రోడ్డు ప్రమాదంలో యువతి మరణం.. దర్యాప్తులో బయటపడ్డ అసలు ట్విస్ట్ ..
ఫరీదాబాద్ జిల్లా బల్లభ్‌గఢ్‌కు చెందిన మంజు (25)కు 2020లో పాల్వాల్‌కు చెందిన సన్నీతో వివాహం జరిగింది. అదే ఏడాది ఆమె చిన్ననాటి స్నేహితురాలు రీనాకు కూడా వివాహమైంది. రీనా భర్త వేద్‌పాల్ గురుగ్రామ్‌లోని పటౌడీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆగస్టు 21న మంజు తన నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెను వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెంట సుమారు రూ.4 లక్షల విలువైన నగలు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో రీనా కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులకు తెలిసింది. రీనా తన నాలుగేళ్ల కుమార్తె, ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమె వెంట సుమారు రూ.5 లక్షల విలువైన నగలు, నగదు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
ఇద్దరూ ఒకేసారి పిల్లలతో కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించారు. అందులో ఇద్దరూ ఒకరినొకరు మై క్యూట్ వైఫ్, మై లవ్, బాబు అంటూ పిలుచుకుంటూ చాలాసేపు చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
ఇద్దరూ 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని, చిన్నప్పటి నుంచి స్నేహితులేనని భర్తలు తెలిపారు. మొదట వారి మధ్య ఫోన్‌లో మాట్లాడుకోవడాన్ని సాధారణ స్నేహంగానే భావించామని.. కానీ గత ఏడాదిన్నరగా వారి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు ఇప్పుడు అనుమానం వస్తోందని చెప్పారు. అంతేకాదు.. ఇళ్ల నుంచి వెళ్లిపోయే ముందు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఉండొచ్చని కూడా భర్తలు ఆరోపిస్తున్నారు.
అయితే ఇద్దరు మహిళలు నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. వారు దొరికిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. గురుగ్రామ్‌లో కేసులు నమోదు చేసిన పోలీసులు.. మొబైల్ ఫోన్ లొకేషన్లు ఆధారాల ద్వారా ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also Read : నేను మోసగాడిని కాదు… అందుకే ఇండియాకు రావడం లేదు : విజయ్ మాల్యా









