Bank Jobs : బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 11,403 ‘కస్టమర్ సర్వీస్ అసోసియేట్’ (క్లర్క్-CRP CSA-XVI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా మంచి అవకాశాలు లభించాయి. మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌కు 186 పోస్టులు, తెలంగాణకు 191 పోస్టులు కేటాయించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,731, కర్ణాటకలో 1,414 ,మహారాష్ట్రలో 1,051 ఖాళీలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్–186,పశ్చిమ బెంగాల్ – 946,తమిళనాడు – 675,గుజరాత్ – 698, మధ్యప్రదేశ్ – 570,ఢిల్లీ– 415,కేరళ–108 ,గోవా–61ఖాళీలు ఉన్నాయి.అభ్యర్థులు ఏదేని ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2026 ఆగస్టు 21 నాటికి విద్యార్హత ప్రమాణాలు పూర్తి కావాల్సి ఉంటుంది. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి చెందిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయోపరిమితి విషయానికి వస్తే 2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుముగా ఇతర అభ్యర్థులకు రూ.850 నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,మాజీ సైనికాభ్యర్థులకు రూ.175గా ఖరారు చేశారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు ప్రాథమిక వేతనం (Basic Pay) లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం డిఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి వివిధ రకాల అలవెన్సులు కూడా అందుతాయి. ఇది ప్రారంభ దశలోనే ఆకర్షణీయమైన జీతభత్యాలను అందించే ఉద్యోగ అవకాశంగా నిలుస్తుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల ఆన్‌లైన్ పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్స్) ఆధారంగా జరుగుతుంది. మొదటిగా 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధితో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. రెండు పరీక్షలలోనూ తప్పుగా సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలను పరిశీలిస్తే, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 1, 2026 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 21, 2026. ప్రిలిమినరీ పరీక్షలను అక్టోబర్ 2026లో, మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 2026లో నిర్వహించనున్నారు. తుది ఎంపిక సాధించిన వారికి మార్చి 2027 నాటికి ఉద్యోగ కేటాయింపులు (Provisional Allotment) పూర్తికానున్నాయి.

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెబ్‌సైట్‌లోని నిబంధనలను సమగ్రంగా పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.