
Karnataka Cabinet:కర్ణాటకలో ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొదటి మంత్రివర్గ విస్తరణ తీవ్ర రాజకీయ కలకలానికి దారితీసింది. కొత్తగా 20 మంది నేతలకు స్థానం కల్పిస్తూ చేపట్టిన ఈ విస్తరణ, పార్టీలోని అసమ్మతిని ఒక్కసారిగా బయటపెట్టింది. రాజ్‌భవన్‌లో ఒకవైపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో జరుగుతుంటే, మరోవైపు పదవులు దక్కని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు తీవ్ర నిరసనలకు దిగడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధిష్ఠానం తనను తీవ్రంగా గాయపరిచిందని, చివరి నిమిషం వరకు హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. అదేవిధంగా సాగర నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను కూడా రాజీనామా చేయనున్నానని, తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు.
The latest cabinet expansion has once again exposed the deep fault lines within the Karnataka Congress. With Indi MLA Yashwantraya Gowda Patil resigning after being denied a cabinet berth and Belur MLA Gopalakrishna announcing that he too will step down, it is evident that the… pic.twitter.com/Q3VO09I8b7
— Arvind Bellad (@BelladArvind) August 3, 2026
పదవులు రాని ప్రముఖ సీనియర్ నేతల అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన్వీర్ సేఠ్‌కు కేబినెట్‌లో చోటు నిరాకరించడంతో, ఆయన మద్దతుదారుడొకరు మైసూర్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. అలాగే ధార్వాడ్‌లో ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య మద్దతుదారులు రహదారులపై టైర్లను తగులబెట్టి, ప్రభుత్వ బస్సులపై రాళ్లు రువ్వి నిరసన తెలపడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
కాగా ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందు కేబినెట్ తుది జాబితాలో ఆఖరి నిమిషంలో నాటకీయ మార్పులు చోటుచేసుకోవడం వివాదాన్ని మరింత పెంచింది. ముసాయిదా జాబితా నుంచి మంకాల్ వైద్య, గాయత్రి చంద్రశేఖర్‌ల పేర్లను తొలగించి, వారి స్థానంలో సీనియర్ లింగాయత్ నేత ఎస్.ఎస్. మల్లికార్జున్‌కు చోటు కల్పించారు. దీనితో తీవ్ర నిరాశకు గురైన హెచ్.కే. పాటిల్, దినేష్ గుండూరావుతో సహా పలువురు సీనియర్లు బెంగళూరులోని పి.వి. జయచంద్ర నివాసంలో అత్యవసరంగా భేటీ అయి తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
#Karnataka #Breaking #CabinetExpansion @INCKarnataka MLA Yeshwanthrayagouda Patil from Indi has tendered his #resignation as an #MLA after being #denied a berth in the Karnataka Cabinet. https://t.co/A3XMva7AjM pic.twitter.com/TPssYPjvWn
— Mahesh M Goudar (@IamMGoudar) August 3, 2026
కేబినెట్ విస్తరణపై వెల్లువెత్తుతున్న అసమ్మతిపై ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులందరికీ ఒకేసారి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, సహనంతో ఉంటే భవిష్యత్తులో తప్పక అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గతంలో తనకు కూడా పదవి రాలేదని, అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని గుర్తుచేస్తూ అసమ్మతి నేతలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
మరోవైపు కేబినెట్ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.హెచ్. మునియప్ప సైతం తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన శాఖను తక్షణమే మార్చాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పార్టీకి ఏళ్ల తరబడి నిజాయితీగా సేవ చేసిన వారిని విస్మరించి, కేవలం రాజకీయ పలుకుబడి, కుటుంబ నేపథ్యం ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చారని హంపనగౌడ బదర్లి, అశోక్ పట్టణ్ వంటి సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అంతర్గత కలహాలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ చెప్పే సామాజిక న్యాయం, మహిళా సాధికారత మాటలు కేవలం ప్రచారానికే పరిమితమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ఎద్దేవా చేశారు. మొత్తం కేబినెట్‌లో ఏకైక మహిళకే ప్రాతినిధ్యం ఇవ్వడం, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోవడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బి. నాగేంద్ర, జమీర్ అహ్మద్ ఖాన్‌లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం కాంగ్రెస్ నైతికతను బయటపెడుతోందని ఆరోపించారు.
మొత్తానికి డీ.కే. శివకుమార్ ప్రభుత్వంలో మొదటి మంత్రివర్గ విస్తరణ తీవ్ర సవాళ్లను తెచ్చిపెట్టింది. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసే క్రమంలో అధిష్ఠానం చేసిన మార్పులు కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాలలను రాజేసాయి. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలు ,మద్దతుదారుల ఆందోళనల నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.









