
Jantar Mantar Protests : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక వేదిక జంతర్ మంతర్ వద్ద ఇకపై నిరసనలు బంద్ కానున్నాయా? అక్కడ ఆందోళనల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. జంతర్ మంతర్ నిరసనలకు తగిన ప్రదేశం కాదని, దాని స్థానంలో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది సతీష్ చంద్ కౌశిక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇందులో లేవనెత్తిన అంశాలు అత్యంత ప్రాముఖ్యమైనవని అభిప్రాయపడింది. స్థానిక ప్రజల రాకపోకలు, నిత్య జీవితానికి సంబంధించిన సమస్యలు ఇందులో ముడిపడి ఉన్నందున..కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, భారీ ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనల సమయంలో రహదారుల దిగ్బంధం వల్ల స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం, లోపలికి వెళ్లడం కష్టతరంగా మారుతోందని, నిత్య జీవితం పూర్తిగా స్తంభించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : BJPకి దిమ్మతిరిగే షాక్.. 30 ఏళ్ల కంచుకోట బద్దలు!
ప్రధానంగా అత్యవసర సేవలపై ఈ నిరసనల ప్రభావం తీవ్రంగా ఉంటోందని పిల్ పేర్కొంది. ఆందోళనల ఉధృతి వల్ల స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణా, అంబులెన్స్ సేవలు, వైద్య సామగ్రి సరఫరా నిలిచిపోతోందని లాయర్ కోర్టుకు విన్నవించారు. ప్రజల ప్రాథమిక అవసరాలకు, ప్రాణ రక్షణకు ఆటంకం కలిగించేలా ఉన్న ఈ వేదికను మార్చాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవల ప్లాన్ చేసిన కొన్ని రాజకీయ పాదయాత్రలు, ఆందోళనలను ప్రస్తావించినప్పటికీ, వాటిపై స్పందించేందుకు ధర్మాసనం నిరాకరించింది. చట్టప్రకారం భద్రతా సిబ్బంది పరిస్థితిని ఎలా నిర్వహించాలో తెలుసని వ్యాఖ్యానించింది. అనంతరం, నిరసనల వేదిక మార్పు,ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై సంబంధిత అధికారులతో చర్చించి వివరాలు సేకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుకు ఎంత ప్రాధాన్యత ఉందో, సాధారణ ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలకు భంగం కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు దాఖలు చేసే సమాధానంపైనే జంతర్ మంతర్ భవిష్యత్తు, ప్రత్యామ్నాయ నిరసన వేదిక ఎంపిక ఆధారపడి ఉన్నాయి.
Also Read : బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ముందంజ!









