
Colombia : కొలంబియాలో సంభవించిన తీవ్రమైన భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల డజన్ల కొద్దీ భవనాలు కుప్పకూలాయి. ఏకంగా 111 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద నివాసితులు చిక్కుకుపోవడంతో చాలా మంది గాయపడ్డారు. దీంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. అత్యధికంగా రిసరాల్డా ప్రావిన్స్ లో 42 మంది చనిపోయారు.
బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చొకో ప్రాంతంలోని, సుమారు 4,800 మంది జనాభా గల శాన్ జోస్ డెల్ పాల్మార్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈ భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం ప్రభావం పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో కూడా కనిపించింది.
Also Read : జిన్నా చేసిన నమ్మకద్రోహం.. బలూచిస్తాన్‌ను బలితీసుకున్న పాకిస్తాన్!
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది పెరీరా పట్టణానికి చెందినవారని మేయర్ కారకోల్ రేడియోతో మాట్లాడుతూ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన వెల్లడించారు. పెరీరా, కాలి, కైబ్డో నగరాల్లో ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోయాయి. అలాగే బొగోటాకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానిజాలెస్ నగరంలో నియో-గోతిక్ కేథడ్రల్ టవర్ కూడా కూలిపోయింది.
మధ్య, పశ్చిమ కొలంబియాలో టెంబ్రోరెస్ అని పిలువబడే చిన్న భూకంపాలు సాధారణమే అయినప్పటికీ.. 6.0 తీవ్రత కంటే ఎక్కువ ఉన్న భూకంపాలు చాలా అరుదు. గతంలో ఆర్మేనియా నగరం సమీపంలో వచ్చిన 6.2 తీవ్రత గల భూకంపం కారణంగా 1,100 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం కారణంగా ఆరు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, అందుకే వాటి కార్యకలాపాలను నిలిపివేసినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మానిజాలెస్, కైబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనెవెంచూరా నగరాలకు సేవనందిస్తున్న విమానాశ్రయాలపై ఈ ప్రభావం పడినట్లు ఆ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది.
Also Read : చంపేస్తామంటూ ఇరాన్ బెదిరింపులు.. ట్రంప్ ఎలా దాక్కున్నాడో చూడండి!









