
ఫ్రాన్స్‌లో ప్రస్తుతం ఆందోళనలు చెలరేగాయి. పాఠశాలల్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. పారిస్‌తో పాటు పలు ప్రధాన నగరాలు రణరంగాలుగా మారాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు కాస్తా అల్లరి మూకల చేతిలో భయానక విధ్వంసంగా, దోపిడీలుగా మారిపోవడంతో యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.
అయితే ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఫ్రాన్స్‌లో అశాంతికి వలసదారులే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. ఫ్రాన్స్ తగలబడుతోంది.. వేరే ప్రపంచం నుంచి, ద్వేషంతో వచ్చిన వలసదారులు ఒకప్పుడు గొప్పగా ఉన్న ఆ దేశాన్ని ముక్కలు చేశారు. మరీ ఆలస్యం కాకముందే సరిహద్దులను మూసేయండి అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా దీనిని సమర్థిస్తూ.. పశ్చిమ దేశాల ఉదారవాద విధానాలే ఈ దుస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు.
Also Read : బలుపు దిగింది.. మాట మార్చిన వాన్స్ : H-1Bపై కొత్త మాట!
దేశంలో పెరుగుతున్న ధరలు, ప్రజా సేవల వైఫల్యాలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. విద్యార్థులు, కార్మికులు కలిసి దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారమే సుమారు 5.5 లక్షల మంది రోడ్డెక్కగా యూనియన్ల లెక్కల ప్రకారం ఈ సంఖ్య 8 లక్షలకు చేరింది. అయితే ఈ ప్రజాస్వామ్య నిరసనల ముసుగులోకి ప్రవేశించిన కొందరు దుండగులు, అల్లరి మూకలు విధ్వంసమే లక్ష్యంగా చెలరేగిపోయారు.
రాత్రి సమయంలో రోడ్లపై బారికేడ్లకు నిప్పు పెట్టడం, లగ్జరీ దుకాణాలను పగులగొట్టి పెద్ద ఎత్తున లూటీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిమోజెస్‌లో రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన 143 ఏళ్ల నాటి చారిత్రక టౌన్ హాల్‌ను సైతం దహనం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో వందలాది మంది పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. పారిస్ ఒక్కచోటే రికార్డు స్థాయిలో 855 మందిని అరెస్ట్ చేయగా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య దాదాపు 1,800 నుంచి 2,400కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ అల్లర్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని, దుకాణాలను దోచుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Also Read : సముద్రంలో ఐఫోన్లు.. ఇరాన్లో జనం పరుగులు? అసలు నిజం ఇదే!









