India-Nepal: నేపాల్ ప్రధాని బలేన్ షా ఇపుడు భారత జపం చేస్తున్నాడు. గతంలో మనదేశం పట్ల కఠినంగా ఉన్న ఆయన వైఖరి ఇప్పుడు మెత్తబడినట్లు కనిపిస్తోంది. ప్రారంభంలో కఠినమైన దౌత్య వైఖరి, విక్రమ్ మిస్రీతో భేటీకి నిరాకరించడం, మ్యాప్ వివాదం తర్వాత, ఎట్టకేలకు ఈ రోజు ( ఆగస్టు 10న) బలేన్ షా కాట్మండులోని ప్రధాని కార్యాలయంలో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవాతో తన మొదటి ఏకాంత సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. అంతేకాదు బలేన్ షా ఇప్పుడు నేపాల్- భారత్ సంబంధాలను బలోపేతం చేయడం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ హఠాత్ మార్పు వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నేపాల్‌లో జరిగిన Gen-Z ఉద్యమం తర్వాత మార్చి 27న బలేంద్ర షా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన అహంకారం తారాస్థాయికి చేరింది. నేపాల్‌తో ‘రోటీ-బేటీ’ బంధం ఉన్న భారతదేశానికే ఆయన తన వైఖరిని చూపించడం ప్రారంభించారు. అంతేకాదు బలేన్ షా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశానికి నిరాకరించారు, కైలాస మానససరోవర్ యాత్రపై అభ్యంతరం వ్యక్తం చేశారు, అంతేకాకుండా ఆయన హయాంలో నేపాల్ ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ భారతదేశ మ్యాప్‌తో కూడా ల్యాంప్ చేసింది. కట్ చేస్తే ఆగస్టు 10 నాటికి,బలేంద్ర షా పరిస్థితి, భావోద్వేగాలు రెండూ పూర్తిగా మారాయి. ఇప్పుడు ఆయన భారత రాయబారికి రెడ్ కార్పెట్ పరుస్తూ, భారత్-నేపాల్ సంబంధాలను బలోపేతం చేయడం గురించి మాట్లాడుతుండటం విశేషం

నేపాల్ రాజకీయాల్లో ఎవరి దశ దిశ ఎప్పుడు మారుతుందో చెప్పడం కొంచెం కష్టమే. ఈసారి కాట్మండు నుండి వచ్చిన చిత్రం మొత్తం దక్షిణాసియా దృష్టిని ఆకర్షించింది. నేపాల్ ప్రధాని బలేంద్ర షా సోమవారం భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవాతో ప్రధాని కార్యాలయంలో తొలిసారిగా వన్-టు-వన్ అంటే వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. షా ప్రధాని అయిన తర్వాత ఏ విదేశీ రాయబారితోనూ కలవలేదు. ఇది ఆయనకు మొదటి వ్యక్తిగత భేటీ. ఈ ప్రత్యేక సమావేశంలో భారత్-నేపాల్ సంబంధాలు, ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధి భాగస్వామ్యం, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై బహిరంగంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ, బలేన్ షా ప్రధాని అయినందుకు అభినందనలు తెలిపారు. ఇరు పొరుగు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరోవైపు, ఒకప్పుడు తన కఠినమైన వైఖరికి పేరుగాంచిన బలేంద్ర షా స్వరం కూడా పూర్తిగా మారినట్లు కనిపించింది. భారతదేశంతో నేపాల్‌కున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై షా అత్యంత ప్రాధాన్యతనివ్వడం గమనార్హం

బలేన్ షా ఇప్పటివరకు విదేశీ రాయబారులను వ్యక్తిగతంగా కలవకుండా దూరంగా ఉంటున్నారు. అంతకుముందు ఆయన కేవలం ఉమ్మడి సమావేశాల ద్వారా మాత్రమే విదేశీ ప్రతినిధులతో మాట్లాడేవారు. అయితే, భారత రాయబారి కోసం ఆయన ఈ పాత సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తొలిసారిగా ఒక విదేశీ ప్రతినిధికి ఒక విధంగా ‘రెడ్ కార్పెట్’ పరిచారనే చెప్పాలి..అయితే ఆయన చైనా రాయబారితో కూడా విడిగా సమావేశం కానున్నారు. నేపాల్ ఇప్పుడు భారత్, చైనా రెండు అగ్రరాజ్యాలతో తన సంబంధాలను పూర్తిగా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోందని దీని ద్వారా స్పష్టమైన సంకేతం లభిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

బలేన్ షా రాయబారిని కలవడానికి 3 కారణాలు
ఇంతకాలం భారత్‌తో అంటిముట్టనట్లు ఉన్న బలేంద్ర షాకు హఠాత్తుగా ఏమైంది? నేపాల్ ప్రధాని వైఖరి ఎందుకు అంతగా చల్లబడింది? బలేంద్ర షా ఇప్పుడు ‘భారత్-నేపాల్’ సంబంధాలను మెరుగుపరచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీని వెనుక ప్రధానంగా 3 పెద్ద కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

భారతదేశం లేకుండా నేపాల్ అభివృద్ధి అసంపూర్ణం
నేపాల్ తన దౌత్యంలో చైనా కార్డ్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పటికీ, నేపాల్ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, దైనందిన అవసరాలు పూర్తిగా భారతదేశంపైనే ఆధారపడి ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. నేపాల్ విదేశీ వ్యాపారంలో ఎక్కువ భాగం భారతదేశ మార్గాలు , రేవుల (పోర్టుల) గుండానే వెళుతుంది. పెట్రోల్, డీజిల్, మందులు, రోజువారీ అవసరమైన వస్తువులు భారతదేశం నుండే నేపాల్‌కు చేరుకుంటాయనేది వాస్తవం. నేపాల్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నా, ప్రజలను ద్రవ్యోల్బణం నుంచి కాపాడాలన్నా భారతదేశంతో కలిసి పనిచేయడమే ఏకైక మార్గమని బలేంద్ర షా బాగా అర్థం చేసుకున్నారు. భారతదేశం నిర్వహిస్తున్న అభివృద్ధి భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నేపాల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉంటాయని కూడా గుర్తించాడు.

చైనా ‘అప్పుల ఊబి’ వాగ్దానాల చేదు నిజం
చైనా ఇచ్చే పెద్ద పెద్ద వాగ్దానాలు తరచుగా కాగితాలకే పరిమితమవుతాయని లేదా అవి అత్యంత ఖరీదైన అప్పుల రూపంలో ముందుకొస్తాయని నేపాల్ కు గతం అనుభవాలు నిరూపించాయి. శ్రీలంక నుండి పాకిస్తాన్ వరకు చైనా ఆర్థిక విధానాల దుష్ప్రభావాలు ఎవరికీ తెలియనివి కావు. నేపాల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చైనా ఎంత మాట్లాడినప్పటికీ, క్షేత్రస్థాయిలో పని మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. చైనా అప్పుల భారం కింద నలిగిపోతున్న పోఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ వాస్తవాన్ని గ్రహించిన బలేన్ షా, చైనాపై ఆధారపడటం ప్రమాదకరమని, అదే సమయంలో భారతదేశం ఎల్లప్పుడూ సంక్షోభ సమయంలో ఎటువంటి షరతులు లేకుండా అందరికంటే ముందుగా సహాయం చేయడానికి ముందుకు వస్తుందని ఆయన అర్థం చేసుకున్నారు.

తన కుర్చీ ,దేశంలో రాజకీయ స్థిరత్వం
నేపాల్ రాజకీయం అత్యంత అస్థిరంగా ఉంటుంది, అక్కడ ప్రభుత్వాలు చాలా త్వరగా మారుతుంటాయి. బలేన్ షా ఒక కొత్త ,యువ రాజకీయ నాయకుడిగా అధికారంలోకి వచ్చారు. ఆయనపై ప్రజల అంచనాల భారం భారీగా ఉంది. ఆయన సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలన్నా, తన ప్రభుత్వానికి స్థిరత్వం ఇవ్వాలన్నా న్యూఢిల్లీతో సంబంధాలను సాధారణంగా, బలంగా ఉంచుకోవాల్సిందే.భారతదేశంతో వివాదాలు పెట్టుకుని నేపాల్‌లోని ఏ నాయకుడూ సుదీర్ఘకాలం స్థిరమైన పాలన అందించలేకపోయారన్నది నిజం. దేశం యొక్క అంతర్గత స్థిరత్వం, సరిహద్దు వద్ద శాంతి, భద్రత కోణంలో భారతదేశంతో మెరుగైన సంబంధాలు కలిగి ఉండటం బలేంద్ర షాకు అతిపెద్ద రాజకీయ అవసరంగా మారింది.

భారత్-చైనా మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం
సింహదర్బార్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక సమావేశం తర్వాత, బలేన్ షా తన ప్రారంభ తీవ్ర వ్యాఖ్యలను పక్కన పెట్టి, మంచి పొరుగువారిగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నారని స్పష్టమవుతోంది. అయితే, చైనా రాయబారితో భేటీ ప్రణాళిక, ఒకే వైపు మొగ్గు చూపడానికి బదులుగా ఇరుదేశాల మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రయత్నాన్ని తెలియజేస్తోంది. అయినప్పటికీ, భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవాతో ఆయన జరిపిన ఈ మొదటి వన్-టు-వన్ సమావేశం, నేపాల్ యొక్క నిజమైన ప్రయోజనాలు ,అభివృద్ధి విషయానికి వస్తే కాట్మండు న్యూఢిల్లీ వైపే చూడాల్సి వస్తుందని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందనేది వాస్తవం.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.