
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా ఎమోసల్ అయ్యారు. బుధవారం తన వర్చువల్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎలాంటి గతి ఎదురైనా పర్వాలేదని, తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని అన్నారు. అక్కడ తనను నిర్బంధించినా.. జైల్లో పెట్టినా.. సొంతగడ్డపై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. విదేశీ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి, జాతిపిత బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడే ముందు, జాతిపిత బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కు, ప్రముఖ జాతీయ నాయకులకు, మన విముక్తి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మిలియన్ల మంది అమరవీరులకు నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాను. అలాగే, 1975 ఆగస్టు 15న నేను కోల్పోయిన నా కుటుంబ సభ్యులను తీవ్ర విచారంతో గుర్తుచేసుకుంటున్నాను” అని ఆమె తెలిపారు. తనను దేశం నుంచి బలవంతంగా వెళ్లగొట్టినప్పటికీ, ప్రజల నుంచి మాత్రం ఎప్పటికీ వేరు చేయలేకపోయారని హసీనా పేర్కొన్నారు.
అలాగే, 2024 జూలై-ఆగస్టులో తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన గొడవలు అసలు ఎలాంటి శాంతియుత విద్యార్థి ఉద్యమాలు కావని, ప్రభుత్వాన్ని మార్చేయాలనే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసుకుని చేసిన ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు. ఆగస్టు 5 తర్వాత హింస కాస్తా రాజకీయంగా వేధించే కార్యక్రమంగా మారిపోయిందని చెప్పారు. అవామీ లీగ్ లీడర్లు, కార్యకర్తలను హత్యలు చేస్తున్నారని, ఇళ్ల నుంచి బలవంతంగా ఎత్తుకెళ్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటానికి అంతర్జాతీయ సమాజం సపోర్ట్ చేయాలని హసీనా కోరారు. హసీనా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.









