
Strait Of Hormuz: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొలిక్కిరావడం లేదు. తాజాగా హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఆయుధ పోరుతో పాటు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన ఓ నౌకపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు UAE ఆరోపించింది. తమ ప్రభుత్వ చమురు సంస్థ ADNOCకు చెందిన నౌక జలసంధి మీదుగా ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగినట్లు UAE అధికారులు తెలిపారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోందని UAE మండిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ADNOC వెల్లడించింది. హోర్ముజ్‌లో నౌకలపై వరుస దాడులతో అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న హర్మూజ్ వ్యవహారం యుద్ధం మూలంగా మరింత సంక్లిష్టంగా మారింది. అమెరికా తమ షరతులను పూర్తిగా అంగీకరిస్తేనే హర్మూజ్‌ను తిరిగి తెరుస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తేల్సి చెప్పింది. అలాగే హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు హర్మూజ్‌లో అబుదాబికి చెందిన అడ్నాక్ నౌకపై కూడా క్షిపణి దాడి జరిగింది.
ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధి తెరవడం అనేది నిర్దిష్ట విధానాలు, షరతులతో కూడి ఉంటుందని ఐఆర్జీసీ ప్రతినిధి సర్దార్ మొహెబీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాంతీయ చర్చల్లో అమెరికా జోక్యాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభానికి సంబంధించి తమ డిమాండ్లను అమెరికా అంగీకరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహమ్మద్ బాగెర్ కూడా పలు షరతులను వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా బెదిరింపులను నిలిపివేయాలని, సైనిక చర్యలను ఆపాలని, గల్ఫ్ ప్రాంతం నుంచి ఆపరేషన్లలో పాల్గొంటున్న నౌకా, వైమానిక బలగాలను వెనక్కి తీసుకోవాలనేవి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఘర్షణల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కూడా టెహ్రాన్ ఈ సందర్భంగా కోరింది.
ఒమన్‌తో ఒప్పందానికి చేరువలో
ఒకవైపు ఆంక్షలు విదిస్తూనే హర్మూజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలకు సంబంధించి ఇరాన్ వివిధ దేశాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అందులో భాగంగా ఒమన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. కొత్త నౌకాయాన విధానంపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రానున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయమని తేల్చి చెప్పారు. అయితే శాంతి కోసం చర్చలు జరిపినా, ఇరాన్ ప్రజల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.
దేశీయ సామర్థ్యాలు, ప్రజలపైనే తమ ప్రభుత్వం ప్రధానంగా ఆధారపడుతుందని వెల్లడించారు. ప్రజల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాక, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పర్షియన్ గల్ఫ్ దేశాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పెజెష్కియాన్ దుయ్యబట్టారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌లోని అంతర్గత సవాళ్లను అమెరికా, ఇజ్రాయెల్ తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఇరాన్ షరతులపై అమెరికా నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.









