
Balochistan: దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆధిపత్యం, శోషణకు వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయానికి అంతర్జాతీయంగా ఇంకా అధికారిక దౌత్య గుర్తింపు లభించనప్పటికీ, దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ తో పాటు చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’ (CPEC) భవిష్యత్తును ఈ పరిణామం తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేసింది.
చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (BRI)లో CPEC అత్యంత కీలకమైన భాగం. దాదాపు 65 బిలియన్ డాలర్ల (రూ. 6.2 లక్షల కోట్లకు పైగా) భారీ వ్యయంతో 3,000 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ కారిడార్.. బలూచిస్థాన్‌లోని వ్యూహాత్మక గ్వాదర్ లోతటి ఓడరేవును చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంతో అనుసంధానిస్తుంది. హైవేలు, రైల్వేలు, పైప్‌లైన్ల ద్వారా సాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా నేరుగా అరేబియా సముద్రంలోకి అడుగుపెట్టాలని భావించగా, ఇప్పుడు బలూచిస్థాన్ తిరుగుబాటుతో ఆ ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడింది.
ప్రస్తుత సంక్షోభంలో ‘గ్వాదర్ పోర్ట్’ నియంత్రణ అతిపెద్ద ప్రశ్నగా మారింది. భౌగోళికంగా గ్వాదర్ పోర్ట్ బలూచిస్థాన్ భూభాగంలోనే ఉంది. అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ప్రాంతీయ సార్వభౌమాధికారం ఆ కొత్త దేశానికే చెందుతుంది. అయితే, ప్రస్తుతం చైనా ప్రభుత్వ రంగానికి చెందిన ‘చైనా ఓవర్సీస్ పోర్ట్స్ హోల్డింగ్ కంపెనీ’ (COPHC) పాకిస్థాన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ పోర్ట్ నిర్వహణను చూస్తోంది. కానీ, ఈ ఒప్పందం చైనాకు కేవలం నిర్వహణ హక్కులను మాత్రమే ఇస్తుంది తప్ప సార్వభౌమాధికారాన్ని అందించదు.
ఒకవేళ బలూచిస్థాన్ పూర్తిస్థాయి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తే, గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య, రక్షణ ఒప్పందాలను ఆమోదించాల్సిన చట్టపరమైన నిబంధన బలూచిస్థాన్‌కు ఉండదు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ ఒప్పందాలను రద్దు చేసే లేదా తమకు అనుకూలంగా తిరిగి చర్చలు జరిపే (Renegotiate) పూర్తి అధికారాన్ని కలిగి ఉంటుంది. గతంలో స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలు తమ సహజ వనరులు, ఆస్తుల విషయంలో పాత ఒప్పందాలను పునఃసమీక్షించిన దాఖలాలు ఉండటంతో చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది.
Also Read : అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల జాబితాలో భారత్ గర్జన..మూడో అతిపెద్ద ఐఏఎఫ్ గా రికార్డు
CPEC ప్రాజెక్ట్‌కు గ్వాదర్ పోర్ట్ దక్షిణ ద్వారం లాంటిది. ఒకవేళ గ్వాదర్ పోర్ట్‌పై పాకిస్థాన్‌కు నియంత్రణ తప్పితే, ప్రస్తుత రూపంలో ఉన్న CPEC ఫ్రేమ్‌వర్క్ పూర్తిగా కుప్పకూలుతుంది. కారిడార్‌ను కొనసాగించాలంటే చైనా తప్పనిసరిగా ఇస్లామాబాద్‌ను పక్కనపెట్టి, కొత్తగా ఏర్పడే బలూచిస్థాన్ ప్రభుత్వంతో సరికొత్త ఒప్పందాలను కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో గ్వాదర్ నుంచి పాకిస్థాన్ అంతర్గత ప్రాంతాలకు వెళ్లే రవాణా మౌలిక సదుపాయాలన్నీ వాణిజ్యపరంగా, రాజకీయంగా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది.
ఈ పరిణామం CPEC నిర్మాణంలో పనిచేస్తున్న వేలాది మంది చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల భద్రతను తీవ్ర ప్రశ్నార్థకం చేసింది. వీరంతా పాకిస్థాన్ ఇచ్చిన వీసాలు, వర్క్ పర్మిట్లపై పనిచేస్తున్నారు. బలూచిస్థాన్ కొత్త నిబంధనలు తెస్తే వీరి ఉనికి కష్టమవుతుంది. అంతేకాకుండా, గ్వాదర్ ప్రాంతంలో చాలా కాలంగా వేర్పాటువాద గ్రూపుల నుంచి చైనా పౌరులకు, ప్రాజెక్టులకు భద్రతా ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు హింస మరింత తీవ్రమైతే భద్రతా వ్యయం, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగి చైనాకు కోలుకోలేని ఆర్థిక భారంగా మారనుంది.
వాస్తవానికి గ్వాదర్ పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో బలూచిస్థాన్ ప్రాంతానికి ఎలాంటి వాటా దక్కడం లేదని, ఆ పోర్ట్ నిధులన్నింటినీ పాకిస్థాన్ ప్రభుత్వం, చైనా కంపెనీలే అనుభవిస్తున్నాయని స్థానిక బలూచ్ గ్రూపులు సుదీర్ఘకాలంగా ఆరోపిస్తున్నాయి. తమ భూభాగంలోని సహజ వనరులను విదేశీ శక్తులు దోచుకుంటున్నాయని, స్థానికులకు ఎలాంటి అభివృద్ధి లేదా ఉపాధి లభించడం లేదనే తీవ్ర అసంతృప్తే ఈ రోజు బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటనకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
కేవలం ఒక స్వాతంత్ర్య ప్రకటనతోనే రాత్రికి రాత్రే అంతర్జాతీయ సరిహద్దులు మారిపోవు లేదా CPEC ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోదు. కానీ, బలూచిస్థాన్‌పై పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ వేగంగా బలహీనపడుతుండటం చైనాకు తీరని మైగ్రేన్‌లా మారింది. భారీ పెట్టుబడులు పెట్టిన చైనాకు ఇది మొదట తీవ్ర భద్రతా సవాలుగా మారి, క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో కోలుకోలేని భౌగోళిక రాజకీయ (Geopolitical) సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.
Also Read : జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. సరికొత్త చరిత్ర సృష్టించిన భారత షట్లర్









