Mojtaba Khamenei: గత కొంతకాలంగా ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా రహాస్య పాలన సాగిస్తున్న ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ బతికి ఉన్నాడా లేడా అనే సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వస్తు్న్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడని. అతనికి రహాస్య ప్రాంతంలో చికిత్స అందిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఇటీవల మొజ్తాబా అలీ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన సంచలన వీడియోను విడుదల చేసింది.

కాగా న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఆ వీడియోలో మొజ్తాబా ఇరాన్ నాయకులతో మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియోతో మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. కాగా, 13 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇరాన్‌ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోపై పలు అనుమానాలు..

అయితే ఇదే సమయంలో మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన మొజ్తాబా వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ వీడియోలో ఆ ఆనవాళ్లేవి కనిపించడం లేదు. అంతేకాక ఆ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మెహర్ స్పష్టం చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘ఇది యుద్ధానికి ముందు తీసిన పాత వీడియో అయ్యింటుంది. ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇరాన్ ఇప్పుడు వాడుతోంది’ అని అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్‌లోని ఇరాన్ లీడర్‌షిప్ కాంపౌండ్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ది న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ తదితర నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మొజ్తాబా ముఖం, కళ్లు, కాళ్లకు తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఆయనకు ప్రాణాపాయం లేదని, కోమాలోకి వెళ్లలేదని స్పష్టం చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వ అధికారిక ఛానెల్స్ ఆయనను “జాన్‌బాజ్” (యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వీరుడు) అని సంబోధించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 5 నెలల నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించకపోవడం కూడా కారణం. అంతేకాదు తండ్రి అంత్యక్రియల్లో కూడా కనిపించకపోవటం చర్చనీయాంశమైంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.