Job Crisis In America : అమెరికా ఉపాధి రంగంలో సంక్షోభం కొనసాగుతుంది. జులై నెలలో అక్కడి వాణిజ్య సంస్థలు ఏకంగా 23,000 మంది ఉద్యోగులను తొలగించాయి. నిజానికి జులై మాసంలో లక్ష కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అందరూ అంచనా వేసినప్పటికీ.. అందుకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడటం చర్చనీయంశగా మారింది. అమెరికా ఉపాధి మార్కెట్‌లో నెలకొన్న సవాళ్లకు తోడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మూలంగా చమురు ధరలు పెరగడం కూడా ఉద్యోగాల కోతకు కారణమైనట్లు భావిస్తున్నారు.

కేవలం జులై మాసంలోనే కాకుండా గడచిన రెండు నెలల్లో అమెరికాలో లక్షకుపైగా ఉద్యోగాల కోత విధించినట్లు గణంకాలు తెలుపుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే, జూన్‌ నెలల్లో అదనంగా 1,03,000 ఉద్యోగాలను తగ్గించింది. ఈ చర్యతో అమెరికా ఉపాధి మార్కెట్‌ గతంలో అంచనా వేసిన దానికంటే బలహీనంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Also Read : భారత్‌కు అమెరికా మరో షాక్‌.. టారిఫ్‌ల బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం

ఇదిలా ఉండగా అమెరికాలో నిరుద్యోగిత రేటు జూన్‌లో 4.2 శాతం ఉండగా జులైలో 4.1 శాతానికి తగ్గింది. అయితే ఈ తగ్గుదల ఉపాధి మార్కెట్‌ మెరుగుపడిందనే సంకేతం కాదని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. జులై నెలలో సుమారు 2,64,000 మంది అమెరికన్లు ఉద్యోగాల కోసం వెతకడాన్ని ఆపేశారు. దీంతో వారు లేబర్‌ మార్కెట్‌ నుంచి వైదొలిగినట్లయింది. దీంతో ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి వాటా 61.4 శాతానికి పడిపోయినట్లు కార్మిక శాఖ తెలిపింది. ఇది 2021 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యల్ప స్థాయిగా కార్మిక శాఖ పేర్కొంది. అయితే ఉద్యోగాల అన్వేషణను పెద్ద సంఖ్యలో అమెరికన్లు నిలిపివేయడం మూలంగా నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ.. వాస్తవానికి లేబర్‌ మార్కెట్‌లో పాల్గొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగించే అంశం.

మరోవైపు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా(Visa) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం కావడం గమనార్హం. ఈ నిర్ణయం భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టెక్ సెంటర్లపైనా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వీసా ఉద్యోగులకు జూలై 29 తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయినట్లు వారికి తెలిసింది. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే ఆఫీస్ సిస్టమ్‌లకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసుకుంది. భారత్‌లో వీసాకు 3,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. అయితే వారిలో ఎంతమందిని తొలగించారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా వీసా దారిలోనే మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, సిస్కో, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, అట్లాసియన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం సంచనలంగా మారింది.

Also Read : సౌదీ, టర్కీ, పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. చారిత్రక రక్షణ ఒప్పందం!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.