
Lashkar Commander : పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని లష్కరే కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్‌గా గుర్తించారు. అతను ఓ కొత్త రెస్టారెంట్‌లో భోజనం తిన్న కొన్ని గంటలకే, ఇస్లామాబాద్‌లోని కుబా మసీదు వద్ద నమాజ్ చేయడానికి వెళ్లాడు. అయితే మసీదు గేటు వద్దకు రాగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా, ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
మృతి చెందిన ఖారీ సయీద్ లష్కరే తొయిబా సంస్థలో అత్యంత కీలక పాత్ర పోషించేవాడు. జమ్మూ కాశ్మీర్‌లో భారత బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థికంగా, ఇతర రకాలుగా సహాయం అందించే బాధ్యతలను ఈయనే పర్యవేక్షించేవాడు. పాకిస్తాన్‌లో ఇతని అకస్మాత్తు మరణం ఇప్పుడు ఉగ్ర వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే పాకిస్తాన్‌లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో తమ సంస్థకు చెందిన దాదాపు 30 మందికి పైగా సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారని లష్కరే తొయిబా ముఖ్య నాయకుడు ఒకరు బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు నాలుగేళ్లుగా పెషావర్, కరాచీ, రావల్పిండి, రావలకోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో లష్కరే ఉగ్రవాదులను ఎవరో వరుసగా మట్టుబెడుతున్నారని రిజ్వాన్ హనీఫ్ అనే ఉగ్రవాది ఒక వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఐక్యరాజ్యసమితిచే నిషేధించబడిన లష్కరే సంస్థకు చెందిన వ్యక్తి, పాకిస్తాన్‌లో తమ వారిని అజ్ఞాత వ్యక్తులు అంతమొందిస్తున్నారని ఇలా బహిరంగంగా ఒప్పుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.









