Pakistan : సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మూడు దేశాలు ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై కూడా జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రజప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కలసి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి సౌదీ అరేబియా కూడా లాగబడటం, అలాగే హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ద్వారా జరుగుతున్న నౌకా రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఈ మూడు దేశాలు తమ భద్రతా బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, పాకిస్తాన్లు గతేడాదే ఒక ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Also Read : గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో…. చంద్రుడిపై కూలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌శకలం..

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత, ఇరాన్ దాని మిత్రదేశాలు సౌదీ అరేబియా సహా ఇతర గల్ఫ్ దేశాల లక్ష్యాలపై దాడులు చేయడం, వారి నౌకల రవాణాను నిలిపివేయడం మొదలుపెట్టాయి. యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఆ దేశ ఉత్తర భాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకుని, సౌదీ నేతృత్వంలోని కూటమి మద్దతు ఇస్తున్న ప్రభుత్వ దళాలతో పోరాడుతున్నారు. గత నెలలో హూతీలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనం ప్రకటిస్తూ సౌదీ విమానాశ్రయాలు, చమురు సంస్థలు, ఎర్ర సముద్రంలోని ట్యాంకర్లపై వరుస దాడులకు తెగబడ్డారు.

ఈ దాడులకు ప్రతిస్పందనగా సౌదీ అరేబియా హూతీల స్థావరాలపై వైమానిక దాడులు చేయడమే కాకుండా, ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో ఓడల రవాణాను రక్షించడానికి ఒక కొత్త నౌకాదళ కూటమిని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ ఉమ్మడి ఒప్పందాన్ని ప్రకటిస్తూ, ఈ మూడు దేశాల్లో దేనిపై దాడి జరిగినా అది తమ అందరిపై జరిగిన దాడిగానే భావిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Also Read : అమెరికా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్.. 60 శాతం తగ్గిన వీసాలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.