
Birthright Citizenship : వీసా, ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కఠిన చట్టాలు తీసుకొస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త చట్టం తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. బర్త్‌రైట్ పౌరసత్వం కట్టడికి ట్రంప్ ప్రభుత్వం గతంలో కూడా ప్రయత్నం చేయగా దాన్ని అక్కడి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయినా వెనక్కు తగ్గని ట్రంప్ మరో మార్గంలో ఆంక్షలను కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
అక్రమ వలసదారులు అయినా, తాత్కాలిక వీసాలు కలిగిన వారైన వారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే.. వారిని అమెరికన్లుగానే పరిగణించాలని నెల రోజుల క్రితం ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని ట్రంప్ చేసిన ప్రయత్నం ఆరోజు వీగిపోయింది. దీంతో మరో రూపంలో చట్టాన్ని అమలు చేసేందుకు ట్రంప్ సిద్ధపడ్డాడు. ఆ దశలోనే మళ్లీ కొత్త ఉత్తర్వులు జారీ చేశాడు. ఇది భారతీయులకు కొత్త ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి.
కాగా, ఈ విషయమై మాట్లాడుతూ “జన్మత: పౌరసత్వ హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేక తీర్పు వచ్చింది. చాలా స్వల్ప తేడాతో వచ్చిన ఆ తీర్పు.. చాలా దురదృష్టకరం. ఈ క్రమంలోనే మేం కొన్ని సర్దుబాట్లు చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇది మాత్రమే కాదు బర్త్ టూరిజాన్ని కూడా నిషేధించాలని అమెరికా ప్రభుత్వం కోరుకుంటోంది. ‘‘బర్త్ టూరిజాన్ని (Birth Tourism) భారీ సంఖ్యలో విదేశీయులు వినియోగించుకుంటున్నారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పొందుతున్నారు. దానిని అపహాస్యం చేస్తున్నారు. అదంతా అవమానకరం. అలా జరగనివ్వం’’ అని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు.
Also Read : గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో…. చంద్రుడిపై కూలిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌శకలం..
బర్త్ టూరిజం అంటే పుట్టబోయే బిడ్డకు విదేశీ పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో నెలలు నిండే సమయంలో గర్భిణీలు వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రసవిస్తారు. తద్వారా ఆయా దేశాల చట్టాల ప్రకారం అక్కడ పుట్టిన పిల్లలకు దానంతట అదే పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ నిబంధను చైనా, రష్యాలు దుర్వినియోగం చేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తున్నారు. 1868లో ఆమోదించిన అమెరికా14వ రాజ్యాంగ సవరణ ప్రకారం- అమెరికాలో పుట్టిన వారందరికీ (వారి తల్లిదండ్రులు ఆ దేశంలో అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉంటున్నా సరే) ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుందని రాజ్యాంగం పేర్కొంది. అయితే దీన్ని ట్రంప్ వ్యతికేకిస్తున్నారు. అందుకే పరిమితులు విధించాలని భావిస్తున్నారు. ఒకవేళ పరిమితులు అమల్లోకి వస్తే.. ఏటా అమెరికాలో జన్మించే దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం పడనుంది.
ఇక ఇపుడు ట్రంప్ తీసుకున్న తాజా నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరైనా విదేశీ టెర్రరిస్టు గ్రూప్‌కు చెందిన వారైతే అమెరికాలో వారికి పుట్టే బిడ్డకు యూఎస్ పౌరసత్వం దక్కదని తెలుస్తోంది. విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు, అక్రమమార్గంలో పౌరసత్వం పొందిన వారి పిల్లలు అమెరికాలో పుట్టినా జన్మతః పౌరసత్వం దక్కదని ట్రంప్ స్పష్టం చేశారు.. కేవలం పౌరసత్వం కోసం అమెరికాకు వెళ్లి పిల్లల్ని కన్న వారినీ జన్మతః పౌరసత్వానికి అనర్హులుగా ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
కాగా, ఈ కొత్త నిబంధననపై పలువురు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలపై స్థానిక నిపుణులు స్పందిస్తూ పౌరసత్వానికి సంబంధించి కొన్ని నిబంధనలు అమలు చేసే హక్కు అమెరికా అధ్యక్షుడికి ఉందని అన్నారు. పౌరసత్వం కోసం అమెరికాకు వచ్చి పిల్లల్ని కనాలనుకునే వారిని నిషేధించే అధికారం కూడా ట్రంప్‌కు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఒకసారి అమెరికాలో బిడ్డ పుట్టాక శిశువు పౌరసత్వం విషయంలో ట్రంప్‌కు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
Also Read : భారతీయ విద్యార్థులకు అమెరికా షాక్.. స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత









